Astrology: భోజనం చేస్తుండగా అన్నంలో రాయి వచ్చిందా? మీ జాతకంలో ఈ దోషం ఉందేమో!
Food Stone Astrology: భోజనం చేస్తున్నప్పుడు అన్నంలో రాయి కనిపించడం కేవలం యాదృచ్ఛికమా? లేక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అది ఏదైనా సంకేతమా? కుజ దోషం, రాహు ప్రభావం, పితృ దోషంతో దీనికి సంబంధం ఉందని శకున శాస్త్రం ఏమి చెబుతుందో, అలాగే ముందుగా ఎందుకు ఆహార పరిశుభ్రతను పరిశీలించాలో తెలుసుకోండి.

Stone In Food Meaning: చాలా మంది జీవితంలో కనీసం ఒక్కసారైనా ఈ అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారు. ఎంతో ఇష్టంగా భోజనం చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా అన్నంలో చిన్న రాయి తగలడం సహజంగా జరిగే విషయం. చాలామంది దీనిని సాధారణ సంఘటనగా తీసుకుంటారు. అయితే శకున శాస్త్రం, జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుంటే, అవి కొన్ని గ్రహ ప్రభావాలు లేదా జీవితంలో ఎదురయ్యే పరిస్థితులకు సంకేతంగా భావిస్తారు. అయితే, జ్యోతిష్య పరమైన విశ్వాసాలను పక్కన పెడితే, ముందుగా ఆహార నాణ్యత, ధాన్యాల పరిశుభ్రత, వంటగది నిర్వహణ వంటి అంశాలను పరిశీలించడం అత్యంత అవసరం. అవన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు పదేపదే జరుగుతున్నట్లయితే, జ్యోతిష్య కోణంలో ఈ క్రింది వివరణలను పరిశీలిస్తారు.
కుజ గ్రహం అశుభ ప్రభావం
జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు ధైర్యం, శక్తి, భూమి, కార్యదీక్షకు ప్రతీకగా భావిస్తారు. శకున శాస్త్రం ప్రకారం, భోజనంలో తరచూ రాళ్లు కనిపించడం జాతకంలో కుజ గ్రహం బలహీనంగా లేదా ప్రతికూల స్థితిలో ఉండటానికి సూచనగా చెబుతారు. దీని ప్రభావంతో చిన్న చిన్న పనుల్లో ఆటంకాలు, అనవసర వివాదాలు, కుటుంబ కలహాలు, మానసిక ఒత్తిడి వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశముందని విశ్వసిస్తారు.
పితృ దోషానికి సంకేతమా?
హిందూ సంప్రదాయంలో పితృదేవతలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. వారి ఆశీస్సులు కుటుంబ శ్రేయస్సుకు అవసరమని నమ్మకం. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం, భోజనంలో పదేపదే రాళ్లు, వెంట్రుకలు లేదా ఇతర మలినాలు కనిపించడం పితృ దోషానికి సంకేతంగా కూడా భావిస్తారు. పూర్వీకుల స్మరణ, పితృ తర్పణం, వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను దానం చేయడం, ధార్మిక కర్తవ్యాలను భక్తిశ్రద్ధలతో నిర్వర్తించడం ద్వారా ఈ దోష ప్రభావం తగ్గుతుందని విశ్వసిస్తారు.
రాహువు బలహీనంగా ఉంటే…
జ్యోతిష్య శాస్త్రంలో రాహువును భ్రమలు, అనిశ్చిత పరిస్థితులు, ఆకస్మిక సమస్యలకు కారక గ్రహంగా పేర్కొంటారు. జాతకంలో రాహువు బలహీనంగా ఉన్నప్పుడు భోజనంలో రాళ్లు పడటం వంటి సంఘటనలు కూడా జరగవచ్చని కొందరు నమ్ముతారు. రాహువు ప్రతికూల ప్రభావం వల్ల ఆర్థిక ఇబ్బందులు, అనవసర గందరగోళం, మానసిక ప్రశాంతత కోల్పోవడం వంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని చెబుతారు. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం, వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం, సాధ్యమైతే వెండి ఆభరణాలు లేదా వెండి వస్తువులను ఉపయోగించడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తారు.
ముందుగా పరిశుభ్రతకే ప్రాధాన్యం
భోజనంలో రాయి, వెంట్రుక లేదా ఇతర మలినాలు కనిపిస్తే వాటిని వెంటనే గ్రహ దోషాలతో ముడిపెట్టకూడదు. ముందుగా ధాన్యాలను సరిగా శుభ్రం చేశారా, ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది, వంటగది పరిశుభ్రంగా ఉందా? అనే అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటనలు తరచూ పునరావృతమైతే, తమ వ్యక్తిగత విశ్వాసాల ప్రకారం జ్యోతిష్య సలహా తీసుకోవచ్చు.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య, శకున శాస్త్రాల్లో ఉన్న విశ్వాసాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని నిర్ధారించబడలేదు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)




