ఉప్పెనలా మారుతున్న ఊరటనిచ్చే వానలు.. క్లైమేట్ ఛేంజ్ భారత్‌ను ఎలా వణికిస్తుందంటే..?
ఆకాశానికి చిల్లు పడిందా? లేక ప్రకృతి ముఖచిత్రం మారిందా? కేరళ నుండి గుజరాత్ వరకు, మహారాష్ట్ర నుండి మధ్య భారత మైదానాల వరకు.. ఎక్కడ చూసినా రోడ్లు చెరువులవుతున్నాయి, నగరాలు మునుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రుతుపవనాల మ్యాప్‌ను గ్లోబల్ వార్మింగ్ ఎలా మార్చేస్తోంది? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ అనే పదాలు ఇప్పుడు కేవలం చర్చలకే పరిమితం కాలేదు. మన కళ్లముందే ప్రకృతి రూపంలో వాటి తీవ్ర ప్రభావం కనిపిస్తోంది. భారతదేశానికి వరప్రసాదంగా భావించే రుతుపవనాల శైలి ఇటీవలి కాలంలో పూర్తిగా మారిపోయిందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు దేశాన్ని మురిపించిన తొలకరి పలకరింపులు.. ఇప్పుడు ముంచెత్తే ప్రళయాలుగా మారుతున్నాయి. పశ్చిమ తీరం నుండి మధ్య భారత మైదానాల వరకు.. మహారాష్ట్ర, కేరళ, గుజరాత్ వంటి రాష్ట్రాలు వరుసగా కురుస్తున్న అత్యంత భారీ వర్షాలకు అతలాకుతలమవుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి, చెట్లు కూలుతున్నాయి, ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఈ పరిణామాలన్నీ ఒకే ప్రశ్నను లేవనెత్తుతున్నాయి.. గ్లోబల్ వార్మింగ్ మన దేశ వాతావరణ పటాన్ని మార్చేస్తోందా? అని..
వాతావరణ మార్పులపై ప్రభుత్వ అంగీకారం
ఇది కేవలం పర్యావరణ శాస్త్రవేత్తల ఆందోళన మాత్రమే కాదు.. కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో ఈ మార్పులను అంగీకరించింది. భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖవిడుదల చేసిన అసెస్‌మెంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఓవర్ ది ఇండియన్ రీజియన్ నివేదిక ప్రకారం.. వేడెక్కుతున్న పర్యావరణం కారణంగానే స్థానికంగా కురిసే అతి భారీ వర్షాలు, తీవ్రమైన కరువులు, తుఫానుల తీవ్రత పెరిగాయి.
ఆందోళనకరమైన గణాంకాలు
- 1901-2018 మధ్య కాలంలో భారతదేశంలో ఉపరితల గాలి ఉష్ణోగ్రత సుమారు 0.7 డిగ్రీల సెల్సియస్ పెరిగింది.
- 1951-2015 మధ్య కాలంలో ఉష్ణమండల హిందూ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రత దాదాపు 1 డిగ్రీ సెల్సియస్ పెరిగింది.
దీనివల్ల మధ్య భారతం, ఉత్తర భారతం, పశ్చిమ హిమాలయ ప్రాంతాలలో విపరీతమైన వర్షపాతం నమోదవుతుంది.
తక్షణ వాతావరణ పరిస్థితులా? క్లైమేట్ చేంజ్ ప్రభావమా?
ఒక నిర్దిష్ట వారంలో కురిసే కుండపోత వర్షానికి క్లైమేట్ చేంజ్ మాత్రమే కారణమని చెప్పలేమని వాతావరణ నిపుణులు అంటున్నారు. స్కైమెట్ వెదర్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ పలావత్ దీనిపై స్పందిస్తూ.. ‘‘మహారాష్ట్ర, గుజరాత్‌లలో కురిసిన అతి భారీ వర్షాలకు తక్షణ వాతావరణ వ్యవస్థలే కారణం. ఒడిశా మీదుగా మధ్యప్రదేశ్ వైపు కదిలిన వాయుగుండం, అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దీనికి తక్షణ కారణాలు” అని వివరించారు. అయితే గ్లోబల్ వార్మింగ్ ఈ వర్షాల తీవ్రతను పెంచే ఒక ఇంటెన్సిఫైయర్‌గా పనిచేస్తుందని ఆయన అంగీకరించారు. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల గాలిలో తేమను పట్టి ఉంచే సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల భారీ మేఘాలు ఏర్పడి, తక్కువ సమయంలోనే క్లౌడ్‌బర్స్ట్ వంటి తీవ్రమైన వర్షాలు కురుస్తాయి. ‘‘రుతుపవనాల మొత్తం వర్షపాతంలో పెద్దగా మార్పు లేకపోయినా, అది కురిసే విధానం మారింది. సీజన్ అంతా కురవాల్సిన వర్షం.. ఇప్పుడు సుదీర్ఘమైన పొడి వాతావరణం తర్వాత, కేవలం కొన్ని రోజుల్లోనే అత్యంత తీవ్రంగా కురుస్తోంది. ఇది ఖచ్చితంగా గ్లోబల్ వార్మింగ్ సంకేతమే’’ అని పర్యావరణవేత్త సిద్ధాంత్ సారంగ్ అన్నారు.
శాస్త్రవేత్తలు హెచ్చరించిన ముప్పు..
వాతావరణం వేడెక్కే ప్రతి 1 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతకు.. గాలి దాదాపు 7శాతం ఎక్కువ నీటి ఆవిరిని పట్టి ఉంచగలదని పూణేకు చెందిన పర్యావరణవేత్త హేమ చారి తెలిపారు. కేరళ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్‌లలో వస్తున్న వరదలు ఈ మార్పుకు నిదర్శనమని, మనం గతంలో చూసిన వాతావరణం వేరు, నేడు అనుభవిస్తున్న వాతావరణం వేరని ఆమె స్పష్టం చేశారు.
అభివృద్ధి పేరుతో వినాశనం..
ప్రకృతి వైపరీత్యాల తీవ్రత పెరగడానికి మానవ తప్పిదాలు, కాంక్రీట్ సంస్కృతి కూడా ప్రధాన కారణాలు. కేరళకు చెందిన పర్యావరణవేత్త వీణా మారుతూర్ మాట్లాడుతూ.. ‘‘మనం అభివృద్ధి వేగంలో పడి పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. చెట్లను నరికేయడం వల్ల స్థానిక ఉష్ణోగ్రతలు పెరిగి వాతావరణం అస్తవ్యస్తమవుతుంది. కేరళలో క్రమబద్ధంగా కురవాల్సిన వర్షాలు ఇప్పుడు ముంచెత్తుతున్నాయి, ఆ వెంటనే భానుడు భగభగమంటున్నాడు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌కు చెందిన అర్బన్ పాలసీ అడ్వకేట్ అర్ఘ్యదీప్ హతువా మాట్లాడుతూ.. నగరాల్లో చెట్లు తగ్గిపోవడం, కాంక్రీట్ నిర్మాణాలు పెరగడం వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకే మార్గం లేక నగరాలు మునిగిపోతున్నాయని, స్మార్ట్ సిటీ ప్లానింగ్ అవసరమని తెలిపారు.
రేపటి కోసం ఏం చేయాలి?
నదుల పరివాహక ప్రాంతాలు, చిత్తడి నేలలు, అడవులు ప్రకృతి ప్రసాదించిన స్పంజ్ లాంటివి. అవి వర్షపు నీటిని పీల్చుకుని వరద తీవ్రతను తగ్గిస్తాయి. వాటిని రియల్ ఎస్టేట్ స్థలాలుగా భావించి నిర్మించే ప్రాజెక్టుల వల్లే నేడు నగరాలు మునుగుతున్నాయి. ఇకనైనా మన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, వంతెనలను ఆధునిక వాతావరణ మార్పులకు తట్టుకునేలా నిర్మించకపోతే, భవిష్యత్తులో మరింత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
