Telugu Astrology: ఉచ్ఛ స్థితికి బుధుడు.. ఆ రాశుల వారికి ఉన్నత యోగాలు ఖాయం..!
Mercury Transit: సెప్టెంబర్ 16 నుండి అక్టోబర్ 2 వరకు బుధుడు తన స్వక్షేత్రమైన కన్యారాశిలో ఉచ్ఛస్థితిలో ఉంటాడు. దీని ప్రభావంతో వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారు ఈ కాలంలో అనుకూల ఫలితాలను పొందుతారు. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వృద్ధి, కుటుంబ సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో అదృష్టం కలిసి వస్తుంది. కొన్ని రాశుల వారికి షేర్లు, పెట్టుబడులలో లాభాలు కలుగుతాయి.

Telugu Astrology
ఈ నెల(సెప్టెంబర్) 16 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు బుధుడు తన స్వక్షేత్రమైన కన్యారాశిలో ఉచ్ఛపట్టడం జరుగుతోంది. ఈ రాశిలో బుధ గ్రహానికి విపరీతమైన బలం పడుతుంది. సమస్యల పరిష్కారం, బుద్ధి చాతుర్యం, నైపుణ్యాలు, కమ్యూనికేషన్స్, అకౌంట్స్, బ్యాంకింగ్ వ్యవహారాలకు, షేర్లు, స్పెక్యులేషన్లకు కారకుడైన బుధుడు ఉచ్ఛపట్టడం వల్ల కొన్ని రాశుల వారి అభివృద్ధికి మార్గం సుగమం చేయడం జరుగుతుంది. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి జీవితాలు పదిహేను రోజుల పాటు నల్లేరు మీద బండిలా సాగిపోతాయి.
- వృషభం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధుడు ఉచ్ఛపడుతుండడం వల్ల సమాజంలో రాజపూజ్యాలు బాగా పెరుగుతాయి. మీ ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధా న్యం, ప్రాభవం వృద్ది చెందుతాయి. అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల బాగా లబ్ధి పొందు తారు. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలతో సహా అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ బాగా లాభిస్తాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
- కర్కాటకం: ఈ రాశికి 3వ స్థానంలో బుధుడు ఉచ్ఛపడుతుండడం వల్ల కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయ వృద్ధికి మార్గాలు, అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయాలు సిద్ధిస్తాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది.
- సింహం: ఈ రాశివారికి ధన స్థానంలో ధన స్థానాధిపతి బుధుడు ఉచ్ఛ పడుతుండడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. ఆదాయ వృద్దికి కొత్త అవకాశాలు లభిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వారసత్వ సంపద లభిస్తుంది. కుటుంబ స్థాయి, హోదా పెరుగుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరగడానికి ఆస్కారముంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు.
- వృశ్చికం: ఈ రాశివారికి లాభాధిపతి లాభ స్థానంలో ఉచ్ఛ పట్టడం అన్నది ఒక గొప్ప ధన యోగం. అనుకోని విధంగా ఆదాయం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి,ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని అభివృద్ధి ఉంటుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. సోదరులకు సహాయ సహకారాలు అందజేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.
- మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్య స్థానాధిపతి బలంగా సంచరించడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక థన లాభానికి కూడా అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆర్థికంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి రావడం జరుగుతుంది. షేర్లు, మదుపులు, పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ బాగా రాణిస్తారు.
- మీనం: ఈ రాశికి సప్తమ కేంద్రంలో బుధుడు స్వక్షేత్రంలో ఉచ్ఛలోకి రావడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. ఏలిన్నాటి శని దోషం చాలావరకు తగ్గిపోతుంది. ఏ రంగంలో ఉన్నా ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. ఒక ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. ఉద్యోగం చేసే స్థాయి నుంచి ఉద్యోగం ఇచ్చే స్థాయికి చేరు కుంటారు. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం, ప్రేమలో పడడం వంటివి జరుగుతాయి.



