AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangal Gochar: కుజుడి రాశి మార్పుతో ఆ రాశుల వారికి చిత్ర విచిత్ర సమస్యలు.. పరిహారాలు ఏంటో తెలుసుకోండి..

ఈ నెల 11వ తేదీన కుజగ్రహం మిధున రాశి నుంచి తనకు నీచ స్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తోంది. ఈ రాశిలో జూన్ 30 వరకు ఉన్న తరువాత సింహ రాశిలోకి ప్రవేశిస్తుంది.

Mangal Gochar: కుజుడి రాశి మార్పుతో ఆ రాశుల వారికి చిత్ర విచిత్ర సమస్యలు.. పరిహారాలు ఏంటో తెలుసుకోండి..
Mangal Gochar
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: May 09, 2023 | 5:29 PM

ఈ నెల 11వ తేదీన కుజగ్రహం మిధున రాశి నుంచి తనకు నీచ స్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తోంది. ఈ రాశిలో జూన్ 30 వరకు ఉన్న తరువాత సింహ రాశిలోకి ప్రవేశిస్తుంది. కర్కాటక రాశిలో ఉన్న 50 రోజుల కాలంలో కుజ గ్రహం కొన్ని రాశుల వారికి చిత్ర విచిత్రమైన సమస్యలు తీసుకువస్తుంది. దౌర్జన్యాలకు, గొడవలకు, దుస్సాహసాలకు, రోడ్డు ప్రమాదాలకు,  విద్యుదాఘాతాలకు, హింసకాండ కు కారకుడైన ఈ గ్రహం వల్ల వివిధ రాశుల వారు ఇబ్బందులు పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృషభం, కన్య, కుంభరాశి వారు మాత్రం కొద్దిగా లబ్ధి పొందటానికి అవకాశం ఉంది. కుజ గ్రహం నీచ పడటం వల్ల ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఫలితాలు ఉండబోయేది ఇక్కడ పరిశీలిద్దాం.

మేష రాశి: ఈ రాశికి అధిపతి అయిన కుజగ్రహం నాలుగవ స్థానమైన కర్కాటక రాశిలో నీచ పడటం వల్ల కుటుంబ పరంగా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఉద్యోగంలోనూ కుటుంబంలోనూ కొద్దిగా టెన్షన్స్ తలెత్తే అవకాశం ఉంది. మనశ్శాంతి సుఖసంతోషాలు కొద్దిగా తగ్గే సూచనలు ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. ప్రయాణాల్లోనూ ఆహార విహారాల్లోనూ జాగ్రత్తలు  పాటించడం అవసరం.

వృషభ రాశి: ఈ రాశి వారికి మూడవ స్థానంలో కుజగ్రహ సంచారం వల్ల తోబుట్టువులతో లేదా స్నేహితులతో అపార్ధాలు, విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. గొడవలకు, వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఉద్యోగపరంగా ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. ఆర్థి కంగా కూడా అభివృద్ధి కనిపిస్తుంది. ఇతరులకు వీలైనంతగా సహాయం చేయడం జరుగుతుంది. మంచి గుర్తింపు పొందడం మంచి పేరు సంపాదించడం వంటివి చోటు చేసుకుంటాయి.  ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు.

మిథున రాశి: ఈ రాశి వారికి రెండవ స్థానంలో కుజ సంచారం వల్ల కుటుంబంలో చికాకులు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. సాధారణంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం జరుగుతుంది. గతంలో మీ నుంచి ఆర్థిక సహాయం పొందిన వారు ఇప్పుడు అవసర సమయంలో ముఖం చాటేసే అవకాశం ఉంది. మంచి మాట అన్నప్పటికీ అది తప్పు అర్ధాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. డబ్బు విషయంలో వాగ్దానాలు చేయటం లేదా హామీలు ఉండటం మంచిది కాదు.

కర్కాటక రాశి: ఈ  రాశిలో కుజ సంచారం జరగటం వల్ల టెన్షన్లు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలోనూ కుటుంబంలోనూ మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఏ పని తలపెట్టిన అది అర్ధాంతరంగా మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. ఎటువంటి వివాదాలలోనూ తన దూర్చక పోవడం మంచిది. అనవసర సమస్యలు తలకు చుట్టుకొనే ప్రమాదం ఉంది. వాహన ప్రమాదాలతో అప్రమత్తంగా ఉండటం మంచిది. కుటుంబంలో కలహాలు కలతలు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త.

సింహ రాశి: ఈ రాశి వారికి వ్యయ స్థానంలో అంగారకుడు సంచరించడం వల్ల రోడ్డు ప్రమాదాలు అగ్ని ప్రమాదాలు లేదా విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ప్రయాణాలలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. ముఖ్యంగా ప్రయాణాలలో డబ్బు నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. మిత్రులు కొందరు మోసం చేసే అవకాశం కూడా ఉంది. ఎవరినైనా గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ పెట్టడం మంచిది. కుటుంబంలో సామరస్యం నెలకొల్పడానికి కష్టపడాల్సి ఉంటుంది.

కన్యా రాశి: ఈ రాశి వారికి లాభ స్థానంలో కుజుడు సంచరించడం వల్ల ఉద్యోగ పరంగా పురోగతి కనిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు తిరిగి వస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అయితే, ఆహార, విహారాల్లో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంది. జేష్ట సోదరులతో విభేదాలు తలెత్తవచ్చు. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు చోటు చేసుకోవచ్చు. వృత్తి వ్యాపారాల వారికి బాగా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ప్రయాణాలు పైన డబ్బు వృధా అవుతుంది.

తులా రాశి: ఈ రాశి వారికి దశమ స్థానంలో అంగారకుడి సంచారం వల్ల వృత్తి ఉద్యోగాలలో తీవ్ర స్థాయిలో మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో పని భారం పెరగవచ్చు. కొందరు సహచరులు వెన్నుపోటు పొడిచే సూచనలు ఉన్నాయి. ఆదాయం ఆశాజనకంగా ఉన్నప్పటికీ అనవసర ఖర్చులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. కుటుంబ పరంగా ఒకటి రెండు ముఖ్యమైన సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కానీ కొత్త సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. వీలైనంతగా ఓపిక సహనాలతో వ్యవహరించడం మంచిది.

వృశ్చిక రాశి: ఈ రాశి నాధుడైన అంగారకుడు భాగ్య స్థానంలో నీచ పడటం వల్ల మంచి ఉద్యోగ అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు పెళ్లి ప్రయత్నాలలో చికాకులు, ఇబ్బందులు ఎదురవుతాయి. అవసర సమయంలో మీ డబ్బే మీ చేతికి అందక ఇబ్బంది పడటం జరుగుతుంది. డబ్బు తీసుకున్న వారు ఒక పట్టాన తిరిగి ఇవ్వకపోవడం, మీరు డబ్బు ఇవ్వాల్సిన వారు బాగా ఒత్తిడి తేవడం వంటివి జరుగుతాయి. ఆర్థిక విషయాలలో ఎవరికి హామీలు ఉండటం మంచిది కాదు.

ధనుస్సు రాశి: ఈ రాశి వారికి అష్టమ స్థానంలో కుజ సంచారం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలకు దారి తీసే అవకాశం ఉంది. ఉద్యోగ పరిస్థితి ఆర్థిక పరిస్థితి సజావుగానే ఉంటాయి కానీ కుటుంబంలో మాత్రం కొద్దిగా అశాంతి అసంతృప్తి తలెత్తే ప్రమాదం ఉంది. బంధువులతో కూడా అపార్ధాలు ఏర్పడవచ్చు. ఇతరుల విషయాలలో ఎంత తక్కువగా జోక్యం చేసుకుంటే అంత మంచిది. ఆర్థిక లావాదేవీల జోలికి పోవద్దు. పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేసుకోవడం మంచిది. నిరుద్యోగులు చిన్న ఉద్యోగంతో సరిపెట్టుకోవలసి వస్తుంది.

మకర రాశి: ఈ రాశి వారికి సప్తమ రాశిలో కుజ గ్రహ సంచారం జీవిత భాగస్వామి ఆరోగ్యానికి ఏమంత మంచిది కాదు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉంది. విదేశీ ప్రయాణాలకు ఆటంకాలు కలుగుతాయి. ఇరుగుపొరుగుతో సమస్యలు తలెత్తుతాయి. ఆహార, విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. స్నేహితుల వల్ల, దగ్గర బంధువుల వల్ల డబ్బు నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది.

కుంభ రాశి: ఈ రాశి వారికి ఆరవ స్థానంలో అంగారకుడి సంచారం వల్ల శత్రు, రోగ, రుణ బాధలు కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆస్తికి సంబంధించిన కోర్టు కేసులో విజయం సాధిస్తారు. అనారోగ్యాల నుంచి చాలా వరకు కోలుకుంటారు. ఉద్యోగ పరంగా కుటుంబ పరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. దగ్గర బంధువులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.

మీన రాశి: ఈ రాశి వారికి ఐదవ స్థానంలో కుజ గ్రహ సంచారం వల్ల పిల్లల నుంచి సమస్యలు చికాకులు తలెత్తే సూచనలు ఉన్నాయి. పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీ నిర్ణయాలు ఆలోచనలు ఒక పట్టాన ఆచరణలోకి రాకపోవచ్చు. వృత్తి ఉద్యోగాలలో కొద్దిగా అణగిమనగి ఉండటం మంచిది. బంధువులలో కొందరు అపనిందలు వేసే అవకాశం ఉంది. శుభకార్యాల మీద భారీగా ఖర్చు కావచ్చు. సంతాన యోగం కోసం మరికొంత కాలం నిరీక్షించాల్సి ఉంటుంది.

పరిహారాలు: కుజ గ్రహం కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నంత కాలం సుబ్రహ్మణ్యాష్టకం లేదా స్కంద స్తోత్రము లేదా సుందరకాండ పారాయణం చేయడం చాలా మంచిది. వీలైతే అన్నదానం లేదా వస్త్ర దానం చేయటం వల్ల కుజ సంబంధమైన దోషాలు తగ్గు ముఖం పడతాయి. కులదైవం లేదా ఇష్ట దైవానికి సంబంధించిన ప్రార్థనలపై మరింత శ్రద్ధ పెట్టడం చాలా మంచిది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని జ్యోతిష్య కథనాల కోసం క్లిక్ చేయండి..