Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sankranti 2023: ఈ 5 రాశుల వారికి సంక్రాంతి తర్వాత మంచి రోజులు.. మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..

Sankranti Astrology 2023: కొన్ని గ్రహాల మార్పుల కారణంగా అయిదు రాశుల వారు అత్యధికంగా ప్రయోజనం పొందబోతున్నారు. ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, గృహ యోగం, వాహన యోగం వంటి అంశాలలో వీరి జాతకాలు కొత్త పుంతలు తొక్క బోతున్నాయి.

Sankranti 2023: ఈ 5 రాశుల వారికి సంక్రాంతి తర్వాత మంచి రోజులు.. మీ రాశికి ఎలా ఉందో తెలుసుకోండి..
Sankranti Astrology 2023Image Credit source: TV9 Telugu
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 11, 2023 | 6:33 PM

 Sankranti Astrology 2023: ఈ నెల 14న రవి మకర రాశిలో ప్రవేశించడంతో ప్రారంభమయ్యే సంక్రాంతి సంబరాలు ఈసారి ప్రధానంగా  ఐదు రాశుల వారిని అందలం ఎక్కించబోతున్నాయి. సంక్రాంతి రోజున మకర రాశిలో శని, శుక్రుడు, రవి యుతి చెందబోతున్నారు. కాగా, ఈ నెల18 నుంచి శని తన స్వక్షేత్రమైన కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ గ్రహాల మార్పుల కారణంగా మేషం, మిధునం, తుల, ధనస్సు, మకర రాశుల వారు అత్యధికంగా ప్రయోజనం పొందబోతున్నారు. ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, గృహ యోగం, వాహన యోగం వంటి అంశాలలో వీరి జాతకాలు కొత్త పుంతలు తొక్క బోతున్నాయి. సంక్రాంతి తరువాత మారబోయే శని కారణంగా మిగిలిన రాశుల వారు కూడా ఉద్యోగ పరంగా అదృష్ట యోగం అనుభవించబోతున్నారు.

మేషం

ఈ నెల 18న శని కుంభరాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశి వారు కొన్ని అదృష్ట యోగాలు అనుభవించే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. ఇంతవరకు సంతానం కలగని వారికి సంతానం కలుగుతుంది. ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, అధికార యోగం చోటు చేసుకుంటాయి.

వృషభం

సంక్రాంతి తర్వాత నుంచి ఈ రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో తిరుగులేని అభివృద్ధి కనిపిస్తుంది. విదేశాలలో ఉద్యోగం, విదేశాలలో ఉన్నత విద్య, విదేశాలలో స్థిర నివాసం వంటివి తప్పకుండా జరుగుతాయి. వివాహ యోగానికి, సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే మంచి ఉద్యోగం లభిస్తుంది.

మిథునం

ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. గతంలో ఎన్నడూ జరగనంతగా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మాటకు విలువ పెరుగుతుంది.

కర్కాటకం

ఈ నెల 14వ తేదీన రవి, 18వ తేదీన రాసులు మారుతున్నందువల్ల ఉద్యోగంలో ప్రాభవం, వైభవం బాగా పెరుగుతాయి. అధికారులు మీ మాటకు విలువ ఇచ్చి సలహాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. దూర ప్రాంతంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది.

సింహం

ఈ నెల 14 తర్వాత నుంచి  దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. కొత్త ప్రాజెక్టుల కారణంగా పని భారం తిరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిగా మెరుగుదల ఉంటుంది. రాదని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.

కన్య

సంక్రాంతి తరువాత జీవితంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీ కంపెనీలలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లు, ఐటీ నిపుణులు, ఇంజనీర్లు చాలా చక్కగా తమ తమ రంగాల్లో రాణిస్తారు. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఉన్నవారు తమ కార్యకలాపాలను విస్తరించుకుంటారు. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది.

తుల

సంక్రాంతి తర్వాత నుంచి రవి, శనుల రాశుల మార్పు వల్ల తులా రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఇంతకాలంగా అనుభవిస్తున్న ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగ పరంగా స్థిరత్వం ఏర్పడుతుంది. నిరుద్యోగులు కూడా జీతభత్యాలు ఎక్కువగా ఉన్న ఉద్యోగాల్లో చేరటం జరుగుతుంది. ప్రేమ వ్యవహారాలు సానుకూల పడతాయి.

వృశ్చికం

ఈ నెల 18 నుంచి అర్ధాష్టమ శని ప్రారంభం అవుతున్నందువల్ల ఉద్యోగంలో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అధికారులు మీ ప్రతిభను గుర్తించి అదనపు బాధ్యతలను అప్పగిస్తారు. నిరుద్యోగులు దూర ప్రాంతంలో ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం చాలావరకు కుదుటపడుతుంది. పెళ్లి ప్రయత్నాలు చికాకు కలిగిస్తాయి.

ధనుస్సు

సంక్రాంతి తర్వాత నుంచి ఈ రాశి వారికి ఏలినాటి శని తొలగిపోతున్నందువల్ల ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా కొన్ని శుభయోగాలు పట్టబోతున్నాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రాని బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మకరం

ఉద్యోగంలో పని భారం పెరిగినప్పటికీ, అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ఆశాజనకంగా కనిపిస్తుంది. ఇంట్లో శుభకార్యం జరగడానికి అవకాశం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లలు చూడటానికి వస్తారు. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. అదనపు ఆదాయానికి మార్గాలు కనిపిస్తాయి.

కుంభం

సంక్రాంతి తరువాత శని కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశి వారు ఉద్యోగంలో స్థిరత్వం సంపాదించుకోవడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మారటానికి ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. అనారోగ్యం నుంచి కొద్దిగా బయటపడటానికి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేస్తారు.

మీనం

సంక్రాంతి నుంచి రవి శుక్ర గ్రహాలు లాభ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఉద్యోగ పరంగా ప్రమోషన్లకు, అధికార యోగానికి అవకాశం ఉంది. ఈనెల 18 నుంచి శని 12వ రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. శుభకార్యాలు, తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు, విహారయాత్రల మీద బాగా ఖర్చు అవుతుంది. ఆరోగ్యం పర్వాలేదు.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..