AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP vs YSRCP: అసలీ ప్రైవేట్‌ కేసులు అంటే ఏంటి…? వాటి ఇంపాక్ట్‌ ఎలా ఉంటుంది…?

మాజీ సీఎం జగన్‌ వరుస పర్యటనలపై రాజకీయ రచ్చ ఏరేంజ్‌లో అయితే నడుస్తోందో... కేసులు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి...! అంతకుముందు గుంటూరు, మొన్నామధ్య పల్నాడు, లేటెస్ట్‌గా బంగారుపాళ్యం పర్యటనపైనా కేసులు ఫైల్‌ అవ్వడం చర్చనీయాంశమైంది. జగన్‌ పర్యటనలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహం...

TDP vs YSRCP: అసలీ ప్రైవేట్‌ కేసులు అంటే ఏంటి...? వాటి ఇంపాక్ట్‌ ఎలా ఉంటుంది...?
Ysrcp Vs Tdp
K Sammaiah
|

Updated on: Jul 12, 2025 | 10:02 AM

Share

ప్రభుత్వ అండదండలతో రెచ్చిపోతారా…! విచ్చలవిడిగా కేసులు పెడతారా…! మీరు మాపై కేసు మీద కేసు రాస్తే… మేం తప్పక ఇస్తాం రివర్స్‌ డోసు అంటున్నారు వైసీపీ నేతలు. చట్టబద్ధంకాని కేసులను చట్టబద్ధంగానే తేల్చుకుంటామంటూ సవాల్‌ చేస్తున్నారు. ప్రైవేట్‌ కేసులు వేసి ఓవైపు ప్రభుత్వం, మరోవైపు అధికారుల పని పడతామంటున్నారు…! అసలింతకీ ఈ ప్రైవేట్‌ కేసులంటే ఏంటి…? వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది…? ఇదే అంశం ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.

మాజీ సీఎం జగన్‌ వరుస పర్యటనలపై రాజకీయ రచ్చ ఏరేంజ్‌లో అయితే నడుస్తోందో… కేసులు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి…! అంతకుముందు గుంటూరు, మొన్నామధ్య పల్నాడు, లేటెస్ట్‌గా బంగారుపాళ్యం పర్యటనపైనా కేసులు ఫైల్‌ అవ్వడం చర్చనీయాంశమైంది. జగన్‌ పర్యటనలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించడంతోపాటు పూర్తిగా ఆంక్షలు ఉల్లంఘిస్తున్నారంటూ కేసులు మీద కేసులు నమోదవుతున్నాయి. వైసీపీ కీలక నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలపైనా కేసులు ఫైల్ అయ్యాయి. అంతేకాదు పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో సింగయ్యను జగన్‌ కారు ఢీకొట్టిందంటూ జగన్‌పైనా కేసు నమోదవ్వడంపై భగ్గుమన్న వైసీపీ నేతలు రివర్స్‌ ఎటాక్‌కి రెడీ అయిపోయారు.

సంబంధం లేని వాళ్లందరిపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు… తప్పు ఎవరిదైనా తమ నేతలపైనే కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహిస్తున్నారు. అలాంటి వాటికి వైసీపీలో భయపడే వాళ్లు ఎవరూ లేరంటూనే… ప్రైవేట్‌ కేసులతో ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ అధికారుల పని పడతామంటున్నారు. ఇక కాస్కోండి అంటూ సవాల్‌ విసురుతున్నారు. తమపై కక్ష కట్టిన ఏ ఒక్కరిని వదలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.

వైసీపీ నేతల మాటలతో అసలీ ప్రైవేట్‌ కేసులంటే ఏంటి…? అవి వేస్తే ఏమవుతుందన్న అంశంపై చర్చ మొదలైంది. ప్రైవేటు కేసు వేయడం అంటే… ఒక వ్యక్తి నేరుగా కోర్టులో దాఖలు చేసే ఫిర్యాదు. సాధారణంగా, పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడానికి నిరాకరించినప్పుడు లేదా ఎలాంటి చర్యలు తీసుకోనప్పుడు బాధితులు నేరుగా కోర్టులో ప్రైవేటు కంప్లయింట్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత ఫిర్యాదు చేసిన వ్యక్తి మేజిస్ట్రేట్ ముందు హాజరై తన ఇబ్బందులేంటో చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వాధికారులు ఎందుకు కేసు ఫైల్‌ చేయలేదో క్లారిటీ కూడా ఇవ్వాలి. ఇక ఇరువర్గాల వాదనల అనంతరం కోర్టు తీర్పునిస్తుంది. అయితే పక్కా ఆధారాలు, తమవైపు ఎలాంటి తప్పులేదనుకున్నప్పుడు మాత్రమే ఈ ప్రైవేట్‌ కేసులు వేయడానికి సిద్ధమవుతారు. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా మేం సిద్ధమంటున్నారు.

మొత్తంగా… ప్రైవేట్‌ కేసులు వేసే విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటున్నారు వైసీపీ నేతలు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్న వారికి చట్టబద్ధంగానే శిక్ష పడేలా చేస్తామంటున్నారు. మరీ వైసీపీ అన్నట్లుగానే ప్రైవేట్‌ కేసులు వేస్తుందా…? లేక మాటలతోనే సరిపెడుతుందా…? అన్నది తేలాంటే కాస్త ఆగాల్సిందే.