AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YS Jagan: ఢిల్లీ వేదికగా ఏపీ సమరం.. భాగస్వామ్యం కావాలంటూ అన్ని పార్టీలను ఆహ్వానించిన వైసీపీ అధినేత జగన్..

ఏపీలో హింసపై పొలిటికల్‌ ఫైట్ జరుగుతోంది! ఏ చిన్న దాడి జరిగినా సరే.. అది రాజకీయ రంగు పులుముకుంది. దాడి చేసింది ఫలానా పార్టీ వాళ్లు.. బాధితులు తమ పార్టీ వాళ్లు అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం హత్యా రాజకీయ ఆరోపణలు ఏపీలో దుమారం రేపుతున్నాయి.

YS Jagan: ఢిల్లీ వేదికగా ఏపీ సమరం.. భాగస్వామ్యం కావాలంటూ అన్ని పార్టీలను ఆహ్వానించిన వైసీపీ అధినేత జగన్..
Ys Jagan
Shaik Madar Saheb
|

Updated on: Jul 22, 2024 | 1:21 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న హత్యలు, దాడులు, హింసాత్మక ఘటనలు హాట్‌ టాపిక్‌గా మారాయి. ఇవన్నీ రాజకీయ కక్షలే అని వైసీపీ ఆరోపిస్తోంది.. ఇదే అంశంపై కూటమి సర్కార్‌కు, వైసీపీకి మధ్య వార్ ముదురుతోంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 రాజకీయ హత్యలు జరిగాయని వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ మేరకు హత్యలు, దాడులపై గవర్నర్ కు సైతం ఫిర్యాదు చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడి హత్య ఘటన, పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్ల దాడి, ఇతర సంఘటలను జగన్ గవర్నర్‌కు వివరించారు. ఆయా ఘటనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా గవర్నర్‌కు అందించారు. రాష్ట్రంలో దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్ ను పునరుద్ధరించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు.. ఢిల్లీ వేదికగా పోరాటం చేసేందుకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో జరిగిన హత్యలు, దాడులపై గళం వినిపించనున్నట్లు పేర్కొన్నారు.. అయితే.. దేశ రాజధానిలో జరిగే పోరాటంలో భాగస్వామ్యం అవ్వాలని విపక్ష పార్టీలను జగన్ ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో తమ పార్టీ క్యాడర్‌, నేతలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. జూలై 24న న్యూఢిల్లీలో పార్టీ నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. దేశ రాజధానిలో నిరసన నిర్వహించడం ద్వారా గత 45 రోజులలో రాష్ట్రంలోని విపత్కర పరిస్థితిని దేశం ముందు ప్రదర్శించాలనుకుంటున్నాని.. పోరాటంలో భాగస్వామ్యం కావాలని జగన్ కోరారు. శనివారం మాట్లాడిన జగన్.. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి అపాయింట్‌మెంట్ కోరామని, అది రాగానే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తామని చెప్పారు. రాష్ట్రంలో హింస పెరుగుతుందని.. శాంతిభద్రతల పరిరక్షణలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.

కాగా.. జగన్ తమ పోరాటంలో భాగస్వామ్యం కావాలని ఏపీలోని అన్ని పార్టీలను ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది.. ఇదిలాఉంటే.. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, ఆస్తుల విధ్వంసానికి వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభల్లో వైసీపీ ఎంపీలు గళం విప్పనున్నారు. ఇప్పటికే.. బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగిన భేటీలో వైసీపీ ఫిర్యాదు చేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..