వివేకా హత్య కేసులో కీలక పురోగతిని సాధించింది సీబీఐ.. మరోసారి పులివెందులలో తనిఖీలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. సోమవారం సుప్రీం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో.. సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడంలో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవాళ సుప్రీం కోర్టులో ఏం జరగబోతుందోనని తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది.
వివేకా కేసులో వరుసగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పులివెందులలో వివేకా ఇంటిని సీబీఐ బృందం మరోసారి పరిశీలించింది. కొత్తగా వచ్చిన సీబీఐ సిట్ బృందం అధికారులు పులివెందులలో వివేకా ఇంటి పరిసరాలను చూశారు. ఇంట్లో హత్య జరిగిన బాత్రూం, బెడ్ రూమ్ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వివేకా ఇంటి నుంచి బయటికి వచ్చిన సీబీఐ అధికారులు సమీపంలో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లారు. ఆయన ఇంటి పరిసరాలనూ పరిశీలించారు. అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉన్న పీఏ రమణారెడ్డితో సీబీఐ అధికారులు మాట్లాడారు.
తిరిగి మళ్లీ వివేకా ఇంటికి ఇచ్చి సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి వద్ద టైపిస్టుగా పని చేసిన ఇనాయతుల్లాను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా హత్య తర్వాత జరిగిన పరిణామాల్లో ఇనయతుల్లా కీలకమైన వ్యక్తిగా సీబీఐ భావిస్తోంది. హత్య జరిగిన రోజు వివేకా మృతదేహాన్ని ఫొటోలు, వీడియోలు తీసి ఇనయతుల్లా కుటుంబ సభ్యులకు పంపించారు. దీంతో హత్య జరిగిన రోజు ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీశారు.
హత్య జరిగిన రోజు వైఎస్ అవినాష్‌రెడ్డి తన ఇంటి నుంచి వివేకా ఇంటికి ఎంత సమయంలో రావొచ్చు అనేదానిపై సాంకేతికంగా ఇప్పటికే ఆధారాలు సేకరించిన అధికారులు.. మరోసారి క్షుణ్నంగా తనిఖీ చేయడానికే పులివెందుల వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం సుప్రీం కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో సీబీఐ అధికారులు తాజాగా వివేకా ఇంటిని, అవినాష్‌రెడ్డి ఇంటిని పరిశీలించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వై ఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి పిటిషన్ పై సోమవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. గత శుక్రవారం సునీత పిటిషన్ విచారించింది సీజేఐ ధర్మాసనం. అవినాష్ రెడ్డి కి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల పై కీలక ఆదేశాలిచ్చింది ధర్మాసనం. తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చింది సుప్రీం కోర్టు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం… హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తే అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందని చెప్పారు అవినాశ్ తరఫు న్యాయవాది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తూనే, సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టే వరకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐ ని ఆదేశించింది ధర్మాసనం. సోమవారం ఏం జరుగుతుందనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..