
కడపలో రాజకీయాలు రోజురోజుకీ వేడెక్కుతున్నాయి. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీత ఈసారి ఎన్నికల బరిలో నిలవనున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య తరువాత రోజురోజుకి మారుతున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ వివేకానంద రెడ్డి ఐదో వర్ధంతి రోజు అంటే ఈ నెల 15వ తేదీన తన రాజకీయ భవిష్యత్తుపై ప్రకటన చేయనున్నారు. వచ్చే ఎన్నికల బరిలో ఉంటానని ఇప్పటికే చెప్పకనే చెప్పిన సునీత.. మార్చి 15న జరిగే ఆత్మీయ సమావేశంలో రాజకీయ ప్రకటన చేయబోతున్నారు. వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి అన్ని సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షురాలిగా ఎన్నికైన తన అక్క వైఎస్ షర్మిలతో భేటీ అయి చర్చలు జరిపారు. అంతేకాకుండా టీడీపీతో కూడా సత్సంబంధాలను సునీత రెడ్డి కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదో ఒక పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్గా బరిలో నిలవాలనే ఆలోచనతో సునీత రెడ్డి ఉన్నట్లు తెలుస్తుంది.
ఎందుకంటే కాంగ్రెస్‌కు బిజెపికి సరిపోదు కాబట్టి.. టిడిపి – బిజెపితో పొత్తు పెట్టుకుటుందన్న నేపథ్యంలో ఏదో ఒక పార్టీ నుంచి పోటీ చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిస్తే.. ఇటు కాంగ్రెస్ వైపు నుంచి అటు టిడిపి – జనసేన – బిజెపిల నుంచి తనకు పూర్తి మద్దతు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే ఇండిపెండెంట్‌గానే బరిలో నిలవాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తన తల్లి సౌభాగ్యమ్మను బరిలో నిలుపుతారా లేదా సునీతనే ఎన్నికల బరిలో ఉంటారా అనేది మాత్రం 15న జరిగే ఆత్మీయ సమావేశంలో స్పష్టత రానుంది. వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయి ఐదేళ్లు గడుస్తున్న నేపథ్యంలో వివేకానంద రెడ్డి ఆత్మీయులు సన్నిహితులతో సునీత రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సన్నిహిత వర్గాలందరికీ ఫోన్లు చేసి మాట్లాడినట్లు సమాచారం. కడపలోని వివేకానంద రెడ్డి కుటుంబానికి చెందిన ఫంక్షన్ హాల్ జయరాం గార్డెన్స్‌లో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సునీత రెడ్డి తన కుటుంబంలో ఎవరినో ఒకరిని ఎన్నికల బరిలోకి దింపే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అది సునీత రెడ్డేనా లేదా సౌభాగ్యమ్మ అనేది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…