YS Sharmila: ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిల.. ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా విజయవాడలో ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్నారు వైఎస్ షర్మిల. AICC అగ్రనేతల సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు. కాంగ్రెస్‌ను రాష్ట్రంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు.. పార్టీ చేరికల్లోను, వ్యవహారాల్లోను షర్మిలకు వెన్నుదన్నుగా .. ఆఇద్దరు కాంగ్రెస్ మోస్ట్ సీనియర్ నేతలు నిలుస్తారనే టాక్ వినిపిస్తుంది.

ఏపీ పీసీసీ చీఫ్‌గా వైఎస్ షర్మిల ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇవాళ విజయవాడలో బాధ్యతలు చేపడతారు. దీంతో ఏపీ రాజకీయాల్లో మరో కీలక అడుగులు పడనున్నాయి. షర్మిళ ప్రమాణ స్వీకారం కోసం AICC అగ్ర నేతలతో పాటు APCC వ్యవహారాల ఇంచార్జీ మాణిక్యం టాగూర్, AICC కార్యదర్సులు మునియప్పన్, కృష్టఫర్ తిలక్ హాజరుకానున్నారు. షర్మిల ఏపీసీసీగా కానురులోని ఆహ్వానం ఫంక్షన్ హాల్‌లో ప్రమాణస్వీకారం చేయనున్నారు. బాధ్యతలు చేపట్టాక కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతారు. అనంతరం ర్యాలీగా విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్ర రత్న భవన్లో అధ్యక్ష హోదాలో బాధ్యతలు చేపట్టి తిరిగి హైదరాబాద్ వెళ్లనున్నారు షర్మిల.
ఇక ఏపీసీసీ షర్మిల ప్రసంగంపై సర్వత్ర ఆసక్తి నెలకొంది. రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిన తరువాత ప్రజల సెంటిమెంట్ గా మిగిలిపోయిన పోలవరం, ప్రత్యేక హోదా అంశాలపై షర్మిల కీలక ప్రసంగం ఉండబోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్ చేయడం కోసం ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అంశాలపై సవివరంగా నివేదికలను తెప్పించుకున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఏపి కాంగ్రెస్ పార్టీ బలోపేతం, పార్టీలో చేరికలపై స్పష్టత ఇవ్వనున్నారు.
కాగా.. ఏపీ పీసీసీ నూతన చీఫ్ గా బాధ్యతలు చేపట్టేముందు వైఎస్ షర్మిల ఇడుపులపాయ వెళ్లారు. ఇక్కడి ఎస్టేట్ లోని తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించారు. పీసీసీ మాజీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, పీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి, సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు తదితరులు వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఆశీస్సులు అందుకోవడానికి వచ్చానని వెల్లడించారు. రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అన్నా, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అన్నా ప్రాణంతో సమానం అని తెలిపారు. ఆ సిద్ధాంతాల కోసం రాజశేఖర్ రెడ్డి ఎంత దూరమైనా వెళ్లేవారని చెప్పారు. వైఎస్‌ఆర్ ఆశయాల కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని వైఎస్ షర్మిల చెప్పారు.
షర్మిల ఆధ్వర్యంలో మాజీ మంత్రి అహ్మదుల్లాను కాంగ్రెస్ పార్టీలో చేరారు. అహ్మదుల్లాకు షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పారు. ఇవాళ షర్మిల ఆధ్వర్యంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో పాటు మరికొందరు నేతలుకాంగ్రెస్ లో చేరుతారనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు షర్మిలకు వైఎస్ఆర్ ఆత్మసాక్షిగా చెప్పుకునే కేవీపీ రామచంద్రరావు రాజకీయ గురువుగా కాబోతున్నారనే టాక్ వినిపిస్తుండగా.. సీడబ్యూసీ సభ్యులు రఘువీరా షర్మిల ద్వారా ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ ను బలోపేతం చేయడమే కాకుండా చక్రం తిప్పుతారనే టాక్ వినబడుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
