అనంతపురం జిల్లా, సెప్టెంబర్ 15: నిఫా వైరస్, డెంగ్యూ డెన్ 2 కేసులు పెరుగుతున్న సమయంలోనే స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరం కలకలం రేపింది. ఎక్కడో ఒడిశాలో ఐదుగురు, హిమాచల్ ప్రదేశ్‌లో 9 మంది మరణించారు, ఇప్పట్లో మన ప్రాంతానికి రాదని అనుకుంటుండగానే తెలుగు రాష్ట్రాల్లో తొలి మరణం నమోదయింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో స్క్రబ్ టైఫస్ జ్వరంతో గవ్వల మధు అనే యువకుడు మృతి చెందాడు. కొత్త రకం జ్వరంతో యువకుడు మృతి చెందడంతో స్థానిక ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. మధు మరణమే కాక జిల్లాలో ఇప్పటికే 3 కేసులు నమోదు అయినట్లు వైద్యులు చెబుతున్నారు. వ్యాధి లక్షణాలు బయటకు పెద్దగా కనిపించకపోవడంతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.
ధర్మవరం మండలం పోతుకుంటకు చెందిన గవ్వల మధు పదిహేను రోజులుగా జ్వరంతో బాధపడుతూ.. బెంగళూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మధు సాధారణ జ్వరంతో చనిపోలేదని.. స్క్రబ్ టైఫస్ అనే కొత్త రకం జ్వరంతో చనిపోయినట్లు వైద్యులు నివేదికలో తెలిపారు. జ్వరంతో పాటు మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా మధు మృతి చెందాడని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. దీంతో సత్యసాయి జిల్లా వైద్య అధికారులు అలెర్ట్ అయ్యారు. బెంగుళూరు ఆస్పత్రి నివేదిక పరిశీలించిన వైద్యాధికారులు.. మధు కుటుంబ సభ్యులను అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఈ రకం జ్వరం మనిషి నుంచి మనిషికి సోకదని.. ఓరియెంటా సుత్సుగముషి బ్యాక్టీరియా కుట్టడం వల్లే స్క్రబ్ టైఫస్ జ్వరం వస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. మధు ఇంటి చుట్టుపక్కల తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు చర్యలు చేపట్టారు.
కాగా, ఓరియెంటా సుత్సుగముషి బ్యాక్టీరియా కుట్టిన పది రోజుల్లోనే స్క్రబ్ వైరస్ లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఈ జ్వరం బారిన పడినవారిలో తీవ్రజ్వరం, చలి, విపరీతమైన తలనొప్పి, దగ్గు జలుబు, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పి, శరీరంపై దురద, ఎర్రని మచ్చలు, కళ్ల మంట, కోమా వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..