AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Day 2022: వైకుంఠధామమే ఆమె నివాసం.. స్మశానమే సర్వస్వం.. మహిళా కాటి కాపరి ప్రత్యేక కథనం

Women's Day 2022: కడదాకా తోడుంటానన్న భర్త.. ఉండకపోగా ఆమె కాటి కాపరిగా మారడానికి కారకుడయ్యాడు. నా అన్నవాళ్లూ ఎవరూ లేకపోవడంతో.. ఆ వైకుంఠధామమే ఆమె నివాసమైంది. స్మశానమే ఆమె సర్వస్వంగా మారింది.

Women's Day 2022: వైకుంఠధామమే ఆమె నివాసం.. స్మశానమే సర్వస్వం.. మహిళా కాటి కాపరి ప్రత్యేక కథనం
Woman Kaati Kaapari
Janardhan Veluru
|

Updated on: Mar 08, 2022 | 1:04 PM

Share

International Women’s Day 2022: కడదాకా తోడుంటానన్న భర్త.. ఉండకపోగా ఆమె కాటి కాపరిగా మారడానికి కారకుడయ్యాడు. నా అన్నవాళ్లూ ఎవరూ లేకపోవడంతో.. ఆ వైకుంఠధామమే ఆమె నివాసమైంది. స్మశానమే ఆమె సర్వస్వంగా మారింది. కళేబరాలు, కంకాళాలు కళ్లెదుట కనబడుతున్నా భయపడదు. పొట్టనింపుకునేందుకు కాటికాపరి వృత్తినే బతుకుదెరువుగా ఎంచుకుంది. కపాల మోక్షానికి తనవంతు సాయం అందిస్తున్న ఆ మహిళా కాటి కాపరిపై అంతర్జాతీయ మహిళ దినోత్సవంగా ప్రత్యేక కథనం.

ఈ సృష్టిలో ఎవరైనా ఏడుకట్ల సవారీ ఎక్కాల్సిందే.. ఏడేడు లోకాలకు ఎల్లిపోవాల్సిందే… చితిమీద దేహం చింత నిప్పుల కర్రల మీద బూడిదవుతుంది.. చింత మాత్రం జీవితాంతం వెంటాడుతుందని.. కాటికాపరి చెప్పే మాటలను ఓ విశ్లేషకుడు వివరించిన తీరు వారి లైఫ్‌ను మన కళ్లకు కడుతుంది. కులవృత్తి పరంగా కొందరు దీనినే బతుకుదెరువుగా చేసుకోవడం తప్ప ఎవరూ ఇష్టంగా ఈ పనిచేయరు. నుదుటిరాతని సరిపెట్టుకుని..ముందుకు సాగడం తప్ప.

ఇదిగో ఈమె పరిస్థితి కూడా అలాంటిదే. తాగుబోతు భర్త కారణంగా సంసారం ఒక చదరంగంగా మారింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో.. ఉపాధిగా కాటి కాపరి వృత్తిని ఎంచుకుంది. తూర్పుగోదావరి జిల్లా బండారులంకకు చెందిన శేషామణి.. కర్మకాండ పనిని కర్మఫలంగా భావించి ముందుకు సాగుతోంది.

స్మశానమే ఆమె ఆవాసం.. 20 ఏళ్లుగా ఇదే పనిచేస్తోంది. తాగుబోతు భర్త పట్టించుకునే వాడు కాదు.. తల్లికి తోడుగా ఉండాల్సిన పిల్లలు కూడా కాదని వెళ్లిపోయారు. పెద్దవాళ్లు కావడంతో వారి దారి వాళ్లు చూసుకున్నారు. ఇప్పుడీ మణికి గ్రామస్తులే కుటుంబసభ్యులు. వారి అండదండలతోనే ఈ వృత్తిలో రాణిస్తోంది.

వైకుంఠధామంలోనే చిన్నపూరిల్లు కట్టుకుని జీవిస్తోంది శేషామణి. ఎవరైనా చనిపోయిన వారిని తీసుకువస్తే.. దగ్గరుండి అన్ని కర్మకాండలను నిర్వహిస్తుంది. శంఖం, గంటా చేతపల్లి శవాన్ని పూడ్చే వరకు అన్నీ తానే చూసుకుంటుంది. వాళ్లు ఇచ్చే వెయ్యి రూపాయలతోనే జీవితాన్ని నెట్టుకువస్తోంది.

ఎవరూ చనిపోవాలని కోరుకోరు. కానీ ఆమెకు ఎవరైనా చనిపోయి వస్తేనే పూటగడుస్తుంది. కర్మకాండలు చేస్తే వచ్చే డబ్బులతోనే ఆ పూటకు తిండి దొరుకుతుంది. తండ్రి వారసత్వంగా వస్తున్న సంప్రదాయాన్ని సాగిస్తున్న మణి.. ప్రభుత్వం దయతలచి ఆదుకుంటే అదే పదివేలని వేడుకుంటోంది. పక్కా ఇల్లు, పింఛన్‌ ఇస్తే చాలని అంటోంది.

స్థానికుల అండతోనే ఇన్నేళ్లూ ఈ వృత్తిలో రాణిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం సాయం కూడా అంటే మరింత బాగుంటుందని కోరుతున్నారు. మణికి తాము ఎంత మనోధైర్యాన్ని ఇచ్చినా సర్కార్‌ ఇచ్చే సాయం ముందు తమ సాయం దిగదుడుపే అంటున్నారు. అయినప్పటికీ మణి మా గ్రామ ఆడపడుచని చెబుతున్నారు.

అసలే స్మశానం.. ఆపై నిశబ్ద వాతావరణం. అయినా ఏ మాత్రం భయపడకుండా ఇదే తన ఇల్లు అని జీవిస్తున్న మణి.. నిజంగా ఈ తరానికి ఓ వెలుగుల మాణిదీపమే.

-సత్య, తూర్పు గోదావరి జిల్లా, టీవీ9 తెలుగు

Also Read..

Inspiring Story: భర్త మరణం.. నలుగురు పిల్లల పోషణ భారం.. మటన్ కొట్టు వృత్తిని ఉపాధిగా ఎంచుకున్న మెదక్ జిల్లా వనిత..

Women’s Day 2022: సాధారణ గృహిణి నుంచి కోట్ల టర్నోవర్ దాకా.. విజయనగరం జిల్లా మహిళ విజయగాథ