AP News: ఏపీలో కొత్త సీఎస్‌పై ఉత్కంఠ.. రేసులో ఉన్నవాళ్లు వీరే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తదుపరి సీఎస్ ఎవరన్నది ఇప్పుడు సర్వత్రా చర్చ నెలకొంది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీరాబ్ కుమార్ ప్రసాద్ ఈ నెల డిసెంబర్ 31కు పదవీ విరమణ చేయనున్నారు. వారి తర్వాత ఆ పదవిలో బాధ్యతలు చేపట్టేది ఎవరన్నది ఇప్పుడు ప్రశ్న.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుత చీఫ్ సెక్రటరీ నీరాబ్ కుమార్ ప్రసాద్ ఈ నెల 31కు పదవీ విరమణ చేయబోతున్నారు. ఇప్పటికే ఆయనకు ఆరు నెలల పాటు పదవీకాలాన్ని పొడిగించడం తో ఇకపై పొడిగించడం వీలు కాకపోవచ్చు. దీంతో తదుపరి సీఎస్ ఎంపిక, రేస్‌లో ఉన్నవారి పేర్లు, వారి బలాబలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ – 1987 బ్యాచ్ కు చెందిన అధికారి. ఈ నెల చివర్లో పదవీ విరమణ చేయనుండగా, మరో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 1992 బ్యాచ్ కు చెందిన బి. రాజశేఖర్ కూడా డిసెంబర్ 31 నే రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో, సీఎస్ పదవికి కొత్త వ్యక్తిని నియమించాల్సి ఉంది. అయితే ఈ నియామకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు రాజకీయంగా కీలకంగా మారనుంది.
సీనియార్టీ ప్రకారం రేసులో ఉన్నవారు..
ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న 10 మంది ఐఏఎస్ అధికారులు రేసులో ఉన్నారు. వీరిలో 1988 బ్యాచ్‌కు చెందిన యెర్ర శ్రీలక్ష్మి సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కానీ ఆమెకు సీఎస్ పదవిలో అవకాశం దక్కే అవకాశాలు లేవని వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఆపై సీనియారిటీ ప్రకారం:
జి. అనంతరాము (1990 బ్యాచ్): జూన్ 30, 2027 వరకు సర్వీస్ ఉన్నా, ఆయనను సీఎస్ పదవికి పరిగణనలోకి తీసుకునే అవకాశం లేదని సమాచారం. ప్రభుత్వ పెద్దలతో అనంత రాము కు ఉన్న సంబంధాలు అంతంత మాత్రమే
జి. సాయిప్రసాద్ (1991 బ్యాచ్): మే 31, 2026 వరకు సర్వీస్ లో ఉండే ఆయనకు సీ ఎస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2014 – 19 మద్య చంద్రబాబు సీఎంఓ లో చక్రం తిప్పిన సాయిప్రసాద్ కు 2019 – 24 మద్య కూడా కీలకమైన బాధ్యతలు లభించడం పై కూటమి పార్టీలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే లోకేష్ సాయి ప్రసాద్ వైపే మొగ్గు చూపిస్తున్న నేపద్యంలో, చంద్రబాబు కూడా సాయి ప్రసాద్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయ్
అజయ్ జైన్ (1991 బ్యాచ్): గతంలో ముఖ్యమంత్రితో చోటుచేసుకున్న విభేదాల కారణంగా, ఆయనకు అవకాశాలు చాలా తక్కువ.
సుమితా దవ్రా (1991 బ్యాచ్): ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో కార్యదర్శిగా ఉన్న ఆమె మార్చి 31, 2025న రిటైర్ కానున్నారు. ఆమెను రాష్ట్రానికి తిరిగి రప్పించే చాన్స్ ఉన్నా, అది సాధ్యమయ్యే అవకాశం తక్కువ.
రేసులో ముందున్నవారు..
ఆర్.పి. సిసోడియా (1991 బ్యాచ్): జనవరి 31, 2028 వరకు సర్వీస్ ఉన్న సిసోడియా ప్రస్తుతం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉండి, వ్యవస్థను ప్రక్షాళన చేయడం లో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఆయన సీఎస్ పదవికి ముందు వరుసలో ఉన్న వారిలో ఒకరిగా ఉన్నారు
కె. విజయానంద్ (1992 బ్యాచ్): గత కొంత కాలంగా ప్రభుత్వంలో కీలకంగా కనిపిస్తున్న విజయానంద్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతీ సందర్భంలోనూ కీలక బాధ్యతలు నిర్వహించిన విజయానంద్, సీఎస్‌గా నియమితులయ్యే అవకాశం ఎక్కువ ఉందన్న చర్చ కూడా ఉంది
మిగిలిన పేర్లు..
శంషేర్ సింగ్ రావత్ (1992 బ్యాచ్): గతంలో ఆర్థిక శాఖలో వివాదాలకు గురైనప్పటికీ, చంద్రబాబుకు నచ్చిన అధికారిగా ఉన్నారు. కానీ ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా ప్రస్తుతం అందుబాటులో లేరు.
అనిల్ కుమార్ సింగాల్ (1993 బ్యాచ్): ఇటీవల కేంద్రంలో అదనపు కార్యదర్శిగా చేరిన ఆయనకు ఈ పదవి దక్కే అవకాశం లేదు.
తిరుమల కృష్ణ బాబు (1993 బ్యాచ్): జాబితాలో తొమ్మిది మందిని పరిగణనలోకి తీసుకోకుండా కృష్ణ బాబు ను ఎంపిక చేసే అవకాశం తక్కువ
ముఖ్యమంత్రి ముందున్న సవాళ్లు..
తదుపరి సీఎస్ నియామకంపై సీఎం చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయం, కేవలం పరిపాలనా కాకుండా, రాజకీయంగా కూడా కీలకంగా మారనుంది. సరైన వ్యక్తిని ఎంపిక చేయకపోతే, ప్రభుత్వ పరిపాలనపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. మొత్తానికి సాయి ప్రసాద్, ఆర్‌పీ. సిసోడియా లేదా విజయానంద్‌లలో ఒకరిని సీఎస్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అధికారిక ప్రకటన ఒకటి రెండు రోజుల్లో వెలువడనుంది.
ఇది చదవండి: పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని రైతులు వెళ్లి చూడగా
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..