AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vizag: అమ్మబాబోయ్.! మళ్లీ వచ్చేసింది.. విశాఖలో కరోనా అలజడి.. ఇలా చేస్తే మీరు సేఫ్

విశాఖలో కొవిడ్‌ కేసు నమోదు అయింది. పిఠాపురం కాలనీకి చెందిన మహిళకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కొవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు DMHO. ఇక కొవిడ్‌ కేసులతో అలెర్ట్‌ అయింది ఏపీ ఆరోగ్యశాఖ.

Vizag: అమ్మబాబోయ్.! మళ్లీ వచ్చేసింది.. విశాఖలో కరోనా అలజడి.. ఇలా చేస్తే మీరు సేఫ్
Corona Positive
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: May 23, 2025 | 8:47 AM

Share

కోవిడ్ మహమ్మరి మళ్లీ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ఏపీలో తొలి కేసు విశాఖలో బయటపడింది. 28ఏళ్ల మహిళకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ జరిగింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో నివాసముంటున్న 28 ఏళ్ల మహిళ… కొద్దిరోజుల క్రితం జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడింది. మందులు వాడుతున్నా తగ్గకపోయేసరికి ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. వైద్య సేవలు అందిస్తూ శాంపిల్స్ సేకరించి ర్యాపిడ్ టెస్ట్ చేశారు. దీంతో ఆమెకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కేజీహెచ్‌లోని వైరాలజీ ల్యాబ్‌కు కూడా కొన్ని శాంపిల్స్ పంపారు. అక్కడ కూడా కోవిడ్ నిర్ధారణ జరగడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే హోం క్వారాంటైన్‌లో ఉండాలని సూచనలు జారీ చేశారు. విశాఖలో తొలి కేసు నమోదైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. నాలుగు వైద్య ఆరోగ్య శాఖ బృందాలు మహిళ నివాసముంటున్న పరిసర ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. మహిళ కుటుంబ సభ్యుల శాంపిల్స్‌ను కూడా సేకరించారు. మహిళకు తప్ప ఇంకెవరికి అటువంటి లక్షణాలు లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ప్రజలందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జగదీశ్వరరావు. అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. జన సమర్థం ఉన్న ప్రదేశాల్లో వెళ్లేటప్పుడు మాస్క్ ధరించాలని సూచిస్తున్నారు.

మరోవైపు ఏపీలో పాజిటివ్ కేసు నమోదు కావడంతో ఏపీ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. దేశంలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్య్టా ప్రజలను అప్రమత్తం చేయాలంటూ సిబ్బందికి సూచనలు జారీ చేసింది. సమూహాలుగా ఏర్పడే కార్యక్రమాలు చేయొద్దంటోంది ఆరోగ్యశాఖ. జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు ఉంటే.. వెంటనే కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలంది. రైల్వేస్టేషన్‌, బస్టాండ్‌, ఎయిర్‌పోర్టుల్లో.. సోషల్‌ డిస్టెన్స్, మాస్క్ తప్పనిసరి చేసింది. విదేశాల నుంచి వచ్చినవారు తప్పనిసరిగా కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని పేర్కొంది. అధికారులకు ప్రత్యేక సూచనలు చేసిన హెల్త్ డైరెక్టర్.. మాస్కులు, పీపీఈ కిట్లు, అందుబాటులో ఉంచాలని సూచించారు.