Weekend Hour: ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు రాబోతున్నాయా?
ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలు రాబోతున్నాయా? బీజేపీ నాన్చుడు ధోరణి.. కొత్తకూటమికి దారితీస్తుందా? హస్తానికి సైకిల్ దగ్గరవుతుందా? అదే జరిగితే ఏపీ రాజకీయాల్లో రాబోయే కొత్త సమీకరణలు ఎలా ఉంటాయ్? తెలంగాణ ఎన్నికల తర్వాత తెలుగురాష్ట్రాల్లో ఇప్పుడిదే చర్చ జరుగుతోంది.

ఏపీ రాజకీయాల్లో ఎవరు ఎటు వైపు? అనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీల తీరు చూస్తుంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ, జనసేన కలిసి 2024 ఎన్నికలబరిలో దిగడం దాదాపు ఖరారైపోయింది. ఈ రెండు పార్టీలకు సంబంధించి.. సీట్ల పంపకం మాత్రమే మిగిలింది. అయితే, ఇప్పటికే బీజేపీతో జనసేన కలిసి పనిచేస్తున్నందున .. ఈ పొత్తుల వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతోంది. టీడీపీతో డిస్టాన్స్ మెయింటెన్‌చేస్తున్న బీజేపీ… తన మిత్రుడు జనసేనను అనుసరిస్తుందా? లేక పక్కకు తప్పుకొంటుందా అనేది అర్థంకాని పరిస్థితి. ఒకవేళ జనసేనను కాదని.. బీజేపీ సైడైతే మాత్రం… ఏపీలో కొత్త సమీకరణకు బీజం పడినట్టే అనుకోవాలి.
ముఖ్యంగా కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల గెలుపుతో దక్షిణాదిలో దున్నేద్దామన్నంత ఊపులో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు ఏపీమీద కన్నేసింది. రాష్ట్రవిభజన తర్వాత దాదాపుగా ఏపీలో జీరోగా మారిన పార్టీని.. పునరుత్తేజం దిశగా తీసుకెళ్లాలని చూస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. అందులో భాగంగానే.. ఇటీవల ఏపీసీసీ నేతలతో ఢిల్లీలో కాంగ్రెస్‌పెద్దలు కీలక సమావేశం నిర్వహించారు. నేతల ఘర్‌వాపసీ, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వందరోజుల ప్రణాళిక, ప్రజల్ని ఆకట్టుకునేలా గ్యారంటీలు.. ఇలా మూడు ప్రధానఅంశాలపై దృష్టిపెట్టింది.
జనసేన, టీడీపీ కూటమిని గనక బీజేపీ దూరం పెడితే.. ఆ ప్లేసులో కాంగ్రెస్ చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కలిసివచ్చే వారితో ముందుకెళ్లేందుకు సిద్ధమని ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ సహా రాష్ట్ర పార్టీ నేతలు స్పష్టం చేశారు. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసిన కాంగ్రెస్, టీడీపీ.. ఇప్పుడు మరోసారి కలిస్తే అతిశయోక్తి ఏమీ కాదన్నది పొలిటికల్ విశ్లేషకుల మాట. అలాగైతే, ఆ కూటమిలోకి లెఫ్ట్ పార్టీలు కూడా లగెత్తుకు రావడం ఖాయం.
మొత్తానికి, ఏపీలో కొత్త సమీకరణాలు రాబోతున్నాయన్న ముచ్చట మాత్రం రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తోంది. ఏపీ ప్రజల్ని బీజేపీ మోసం చేసిందనీ.. అధికారంలోకి వస్తే విభజన హామీల్లో కీలకమైన ప్రత్యేకహోదాను ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ అంటోంది. అలాంటి కాంగ్రెస్.. టీడీపీ కూటమిలో చేరితే బీజేపీ ఏంచేస్తుందన్నదే కీలకంగా మారింది. ఎందుకంటే, తామెవ్వరితోనూ జతకట్టబోమనీ.. ఇప్పటికే అధికార వైసీపీ స్పష్టం చేసింది. మరి, ప్రతిపక్షాల పొత్తుల విషయంలో ఈ కన్ఫ్యూజన్‌కు ఎప్పుడు తెరపడుతుందో చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..