రాబోయే రెండు రోజుల్లో దక్షణిది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ బంగాళాఖాతంలో మధ్య భాగాలపై విస్తరించిన ఉపరితల ఆవర్తన ద్రోణి.. తీవ్ర అల్పపీడనం మారింది. 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండగా మారనుందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి వచ్చే 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో క్రమంగా అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు.
ఈ అల్పపీడనం కారణంగా.. ఉత్తర కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి మరియు దక్షిణ కోస్తాంధ్రలో నవంబర్ 21, 22 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రా, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు, రాయలసీమలలో ఆదివారం సాయంత్రం నుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక నవంబర్ 21, 22 తేదీల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదయ్యే ఛాన్స్ ఉందని ఐఎండీ అధికారులు ప్రకటించారు.
ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి నవంబర్ 20, 22 మధ్య గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, నవంబర్ 20 నుంచి 23 వ తేదీ వరకు మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..