
విజయనగరం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక గుర్తింపునిచ్చే లక్ష్యంతో అమలు చేస్తున్న ఒక జిల్లా – ఒక ఉత్పత్తి కార్యక్రమంలో భాగంగా మామిడి తాండ్ర జిల్లాకు ప్రతినిధి ఉత్పత్తిగా ఎంపికైంది. ఈ నిర్ణయం స్థానికంగా తయారయ్యే సంప్రదాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తరణతో పాటు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. ఎల్ కోట మండలం భీమాళి ప్రాంతంలో తయారయ్యే మామిడి తాండ్ర నోరూరించే ప్రత్యేక రుచిగా మంచి పేరు ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఏటా సుమారు 500 మెట్రిక్ టన్నుల వరకు మామిడి తాండ్ర ఉత్పత్తి జరుగుతోందని అధికారిక అంచనాలు ఉన్నాయి. ఈ ఉత్పత్తిని మరింత అభివృద్ధి చేసి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లకు చేరవేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకున్నారు.
మామిడి తాండ్రకు సంబంధించిన విస్తరణ, అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ రామసుందరరెడ్డి ఆదేశించారు. ముడిసరుకు నుంచి తయారీ, ప్యాకేజింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్ వరకు అన్ని దశలను సమన్వయంతో అమలు చేయాలని సూచించారు. దీనివల్ల స్థానిక రైతులు, తాండ్ర తయారీదారులు, మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక బలం చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేకంగా మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ చిన్న స్థాయి పరిశ్రమలుగా మామిడి తాండ్ర తయారీ యూనిట్లను అభివృద్ధి చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు తమ శాఖల ద్వారా అందించాల్సిన సహకారం పై చర్చించారు. మామిడి తాండ్రను జిల్లాకు గర్వకారణంగా నిలిపేలా సమిష్టి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.