ఇళ్లు ఉడ్చేందుకు లైట్ స్విచ్ వేసిన పని మనిషి.. ఇంతలోనే భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా
వేసవి కాలం వచ్చిందంటే చాలూ ప్రతి ఒక్క ఇంట్లో 24 గంటల పాటు ఏసీ, ఫ్యాన్‌లు రన్ అవుతూనే ఉంటాయి. కానీ అధికంగా ఎండలు ఉన్నప్పుడు ఇలా నిరంతరాయంగా వాటిని నడిపించడం పెను ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిపై ఎక్కవ భారం పడి పేలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. తాజాగా విజయం నగరంలో జరిగిన ఘటనే ఇప్పుడు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.

విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని విద్యానగర్ కాలనీలో ఏసి పేలి భయాందోళనలకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణానికి చెందిన స్కూల్ టీచర్ డర్రు అప్పన్న నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పన్న ఇంట్లో ఎప్పటిలాగే ఇంటిని శుభ్రం చేయడానికి పనిమనిషి వచ్చింది. అలా వచ్చిన పనిమనిషి ఓ బెడ్ రూమ్ లోకి వెళ్లి లైట్ స్విచ్ ఆన్ చేసింది. అంతే భారీ పేలుడు శబ్దాలతో కూడిన మంటలు, దట్టమైన పొగ క్షణాల్లో గదిని ఆక్రమించాయి. ఏమి జరిగిందో తెలుసుకునే లోపు మంటలు చుట్టుముట్టాయి.
అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో పనిమనిషితో పాటు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా భయంతో బయటకు పరుగులు తీశారు. పెద్ద పెద్ద శబ్దం వినిపించడంతో కాలనీవాసులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంటలు మరింత విస్తరించే అవకాశం ఉండటంతో స్థానికులు అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో గదిలోని ఏసీ యూనిట్‌తో పాటు కొన్ని ఇంట్లో వస్తువులు దెబ్బతిన్నాయి. అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
మండుతున్న ఎండలు వల్ల వేడి ధాటికి తట్టుకోలేక ఏసీ ఒక్కసారిగా పేలి షార్ట్ సర్క్యూట్ కు గురైనట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. వేసవి కాలంలో విద్యుత్ పరికరాల వినియోగం అధికంగా ఉండే నేపథ్యంలో, ఇళ్లలో విద్యుత్ వ్యవస్థలను తరచుగా పరిశీలించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండలు అధికంగా ఉన్న సమయంలో ఏసీలు నిరంతరం రన్నింగ్ లో ఉండటం వల్ల షార్టు సర్క్యూట్ ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కాబట్టి రన్నింగ్ లో ఉన్న ఏసికి కొంత విరామం ఇవ్వడం మంచిదని అంటున్నారు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
