Andhra Pradesh: వెరైటీ దొంగ.. బంగారం అంటే అస్సలు ఇష్టం ఉండదు.. కేవలం అవి మాత్రమే ఎత్తుకెళ్తాడు..!
స్టూడెంట్ లా ఉంటాడు.. సింగిల్‌గా వస్తాడు.. ఒకసారి చూస్తాడు.. నెక్ట్స్ లూటీ చేసేస్తాడు. కానీ.. వాడికి కాస్త కనికరం కూడా ఉందండోయ్! బంగారం, వెండి, క్యాష్ ఉన్నా వాటిని అస్సలు ముట్టడు. కేవలం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మాత్రమే ముట్టుకుంటాడు.
స్టూడెంట్ లా ఉంటాడు.. సింగిల్‌గా వస్తాడు.. ఒకసారి చూస్తాడు.. నెక్ట్స్ లూటీ చేసేస్తాడు. కానీ.. వాడికి కాస్త కనికరం కూడా ఉందండోయ్! బంగారం, వెండి, క్యాష్ ఉన్నా వాటిని అస్సలు ముట్టడు. కేవలం ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మాత్రమే ముట్టుకుంటాడు. అది కూడా ఇళ్లలో కాదు కేవలం హాస్టల్లోనే! గత కొన్నాళ్లుగా తప్పించుకుని తిరుగుతున్నా… చేసిన చిన్న తప్పుతో అడ్డంగా బుక్ అయిపోయాడు. మళ్ళీ కటకటాల వెనక్కు వెళ్ళాడు. ఎవడా దొంగ? వాడి వ్యవహారం ఏంటి..? ఇంట్రస్టింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
విశాఖ గాజువాక చైతన్య నగర్‌లోని బాయ్స్ హాస్టల్‌లో జ్యోతిష్ అనే విద్యార్థి పరీక్షల కోసం చదువుకుంటున్నాడు. జనవరి 31న అర్ధరాత్రి వరకు చదువుకొని ఆ తర్వాత తన ఫోన్‌ను తలగడ వద్ద పెట్టుకుని పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే 5 గంటలకి లేచి చూడగా.. అతని ఫోన్ మాయమైంది. నిద్రలో ఎక్కడో పెట్టేశాడనుకుని రూమంతా వెతికాడు. కానీ, కనబడలేదు. ఫ్రెండ్స్ అందర్నీ అడిగాడు. ఫలితం దక్కలేదు. ఇతని సంగతి ఇలా ఉంటే.. అదే హాస్టల్లో ఉంటున్న మిగతావారు కూడా సేమ్ జ్యోతిష్ లాగానే వెతకడం ప్రారంభించారు. జ్యోతిష్ ఫోన్ కోసం కాదు.. వాళ్ల మొబైల్స్ కూడా కనిపించకుండా పోయాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 మొబైల్ ఫోన్స్ ఒకేసారి మాయమైపోయాయి. కానీ బంగారం నగలు, క్యాష్ అలాగే ఉంది. దీంతో గాజువాక పోలీసులను ఆశ్రయించారు బాధితులు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలుగా దర్యాప్తు ప్రారంభించారు.
ఆ అనుమానం..
హాస్టల్‌కు వెళ్ళిన పోలీసులు అందరినీ విచారించారు. కానీ ఎక్కడా క్లూ లభించలేదు. ఎందుకంటే.. అక్కడ ఉంటున్న వారంతా విద్యార్థులే. దాదాపు అందరూ సెల్‌ఫోన్ బాధితులే. దీంతో దొంగలించిన మొబైల్ ఫోన్లు ఎక్కడైనా అమ్మకానికి పెట్టారేమో అని ఆరా తీశారు పోలీసులు. పాత మొబైల్స్ కొనుగోలు చేసే ఒక షాపు యజమానికి తట్టిన అనుమానం పోలీసులకు చెప్పగా.. ఆ కోణంలో ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఓ యువకుడు మొబైల్ ఫోన్ అన్లాక్ చేసేందుకు అక్కడికి వచ్చాడు. అతని వాలకం అనుమానాస్పదంగా అనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. నిమిషాల్లో స్పాట్‌కు చేరుకున్నారు పోలీసులు. ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. విషయం వెలుగులోకి వచ్చింది.
మొబైల్ ఫోన్లు ఓఎల్ఎక్స్ లో పెట్టి..
పట్టుబడిన వాడే మొబైల్ ఫోన్లు దొంగలించే యువకుడని పోలీసులు నిర్ధారించారు. ఈ స్మార్ట్ దొంగ పేరు కనకం దామోదర్ రావు. ఊరు విజయనగరం జిల్లా గుర్ల. వయసు 24 ఏళ్ళు. బాయ్స్ హాస్టల్లో బ్యాచిలర్స్ రూమ్సే వాడి టార్గెట్. స్టూడెంట్ మాదిరిగా బ్యాగ్ వెనక్కి తగిలించుకొని వచ్చి.. హాస్టల్లోకి చొరబడతాడు. ఎందుకంటే అలా ఉంటే వాడిపై అనుమానం రాదు. అక్కడ ఉంటున్న వారంతా విద్యార్థులే కాబట్టి.. ఎవరో స్నేహితులనుకుంటారు. వాచ్‌మెన్‌కి కూడా కనీస అనుమానం రాకుండా వాడి కదలికలు ఉంటాయి. తాజాగా గాజువాకలో బాయ్స్ హాస్టల్లో చొరబడి మొబైల్ ఫోన్లు ఎత్తేశాడు. దొంగలించిన మొబైల్ ఫోన్లను అన్లాక్ చేసి.. వాటిని ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టేస్తాడు. మొబైల్ ఫోన్ బిల్లు అడిగిన వారికి ఫేక్ పిడిఎఫ్ వెబ్సైట్ ద్వారా క్రియేట్ చేసి అమ్మి సొమ్ము చేసుకుంటాడు. ఎట్టకేలకు వాడి వ్యవహారం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. 39 మొబైల్ ఫోన్స్, ఓ ల్యాప్‌టాప్, బ్లూటూత్ స్పీకర్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు. రెండు లక్షల నగదు కూడా సీజ్ చేశారు పోలీసులు.
సొత్తు అమ్మిన నగదు తన బ్యాగులోనే..
వీడి స్పెషాలిటీ ఏంటంటే.. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ మినహా అక్కడ ఉన్న వస్తువులేవీ ముట్టడు. బంగారం, నగదు కనిపించిన వాటిని టచ్ చేయడు. ఎందుకంటే బంగారం డిస్పోస్ చేస్తే పట్టుబడతామన్న భయం. ఎందుకొచ్చిన ఖర్మ రా బాబు అనుకుని.. కేవలం మొబైల్ ఫోన్స్, ల్యాప్‌టాప్‌లతో సరిపెట్టేస్తాడు. ఇక చోరీ చేసిన సొత్తు అమ్మగా వచ్చిన నగదును కూడా ఎవరికి ఇవ్వడు.. బ్యాంకులో దాచుకోడు. తనతోపాటే క్యారీ చేస్తాడు. ఎక్కడైనా డిపాజిట్ చేస్తే ఈజీగా పోలీసులకు చిక్కి పోతానన్న భయం వాడిది. ఇలా హ్యాపీగా నగదును తన బ్యాగులోనే పెట్టుకొని ఊర్లో తిరుగుతూ అవసరం ఉన్నప్పుడు చోరీలు చేస్తూ.. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తుంటాడని వెల్లడించారు క్రైమ్ డిసిపి నాగన్న. ఇలా దాదాపు.. చాలా చోట్ల నేరాలు చేసి జైలుకు కూడా వెళ్ళాడు. వాడిపై 15 దొంగతనం కేసులు కూడా ఉన్నాయి. గత కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న ఈ దామోదర్.. ఎట్టకెలకు పోలీసులకు చిక్కి మళ్లీ కటకటాల పాలయ్యాడు.
ఖాజా, టీవి9 తెలుగు వైజాగ్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..