Visakhapatnam: అందాల పోటీల్లో ఆంధ్రా అమ్మాయి సత్తా చాటింది. కేరళలోని కోచిలో జరిగిన మిస్ సౌత్ ఇండియా (Miss South India) పోటీల్లో విశాఖ అమ్మాయి విజయ కేతనం ఎగరవేసింది. ఆంధ్రా యూనివర్సిటీ (Andhra University)లో ఫైన్ ఆర్ట్స్ చదువుతున్న ఛరిష్మా కృష్ణ (Charishma Krishna) ‘మిస్ సౌత్ ఇండియా’ కిరీటం దక్కించుకుంది. పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వందలాది మంది అమ్మాయిలు హాజరయ్యారు.అయితే అందరినీ వెనక్కి నెట్టిన ఛరిష్మా విజేతగా నిలిచింది.
ఈ అందాల పోటీల్లో తమిళనాడుకు చెందిన దేబ్‌నితా కర్ ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, కర్ణాటకకు చెందిన సమృద్ధి శెట్టి సెకెండ్ రన్నరప్‌గా నిలిచింది. ఇక ఛరిష్మ విషయానికొస్తే.. ఆమె తండ్రి పేరు హరికృష్ణ. ఐదవ తరగతి వరకు అమెరికాలోనే చదివింది. ఆ తరువాత వీరి కుటుంబం విశాఖకు వచ్చి ఇక్కడే స్థిరపడింది. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు నృత్య కారిణిగా, నటిగా రాణిస్తోంది ఛరిష్మా.
చిన్ననాటి నుంచి క్లాసిక్, ఫోక్, వెస్టన్ డ్యాన్స్ లు నేర్చుకుంటోంది. ఇప్పటివరకు 30కు పైగా నృత్య ప్రదర్శనల్లో పాల్గొంది. అలాగే స్విమ్మింగ్, గుర్రపుస్వారీలోనూ శిక్షణ పొందింది. స్టార్ ఫిల్మ్ మేకర్‌గా గుర్తింపు పొందిన ఎల్.సత్యానంద్ దగ్గర నటనలో శిక్షణ తీసుకుంది. కాగా కొన్ని షార్ట్‌ఫిలిమ్స్‌లోనూ ఈ ముద్దుగుమ్మ నటించింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..