Road Accident: ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. అంతలోనే వెళ్లిపోయావా కన్నా..
అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ కళ్లముందే కన్నుమూయడంతో ఆ తల్లి గుండె అల్లాడిపోయింది. ఉదయాన్నే స్కూటీపై స్కూల్‌కు వెళ్తుంటే దారి పొడవునా ఎన్నో ఊసులు చెప్పిన చిన్నారి.. అనుకోని ప్రమాదం..
అల్లారుముద్దుగా పెంచుకున్న బిడ్డ కళ్లముందే కన్నుమూయడంతో ఆ తల్లి గుండె అల్లాడిపోయింది. ఉదయాన్నే స్కూటీపై స్కూల్‌కు వెళ్తుంటే దారి పొడవునా ఎన్నో ఊసులు చెప్పిన చిన్నారి.. అనుకోని ప్రమాదం సంభవించడంతో రక్తం మడుగుల్లో విగతజీవిగా పడివున్న కుమారున్ని చూసి కన్నీరుమున్నీరుగా విలిపించింది. మనసును కలచివేస్తోన్న ఈ హృదయవిదారక సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..
విశాఖపట్నం నగర శివారు అగనంపూడి సమీపంలోని శనివాడలో పెరుమాళ్ల సౌజన్య కొడుకుతోపాటు తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. ఆమె భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఆ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు పెరుమాళ్ల ఎలైజా సావెరిన్ (9) డిపాల్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం (డిసెంబర్ 20) ఉదయం ఇంటి నుంచి స్కూటీపై పాఠశాలకు బయలుదేరారు. సరిగ్గా 8 గంటల 30 నిముషాలకు ప్రధాన రహదారి నుంచి పాఠశాలకు వెళ్లేందుకు మలుపు తిరుగుతుండగా.. ఏఆర్ లైఫ్ సైన్సెస్ ఫార్మా సంస్థకు చెందిన బస్సు వీరు ప్రయాణిస్తున్న స్కూటీని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. దీంతో తల్లీ, కుమారులిద్దరూ చెరోవైపున ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో చిన్నారి తలపైకి బస్సు చక్రాలు ఎక్కడంతో నుజ్జునుజ్జయి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అప్పటి వరకు కబుర్లు చెప్పిన కొడుకు కళ్లముందు ప్రాణాలు వదలంతో ఆ తల్లి తల్లడిల్లిపోయింది. బస్సులో ప్రయాణిస్తున్న ఉద్యోగులు, డ్రైవర్ పరారయ్యారు. ఆగ్రహించిన స్థానికులు బస్సును ధ్వంసం చేసి, పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తాజా క్రైం సమాచారం కోసం క్లిక్ చేయండి.