AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జనవరి 22 నుంచి JEE Main 2027 తొలి విడత పరీక్షలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఎప్పటినుంచంటే?

జేఈఈ మెయిన్‌ 2027 తొలి విడత పరీక్షలు జనవరి 22 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు NTA ప్రకటించింది. అయితే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభ తేదీని ఇంకా వెల్లడించలేదు. గతేడాది ట్రెండ్‌ను పరిశీలిస్తే అక్టోబర్‌ చివరి వారంలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు ఆధార్‌, విద్యార్హతల ధ్రువపత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవడం మంచిది..

జనవరి 22 నుంచి JEE Main 2027 తొలి విడత పరీక్షలు.. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ఎప్పటినుంచంటే?
JEE Main 2027 Session 1 Exam Date
Srilakshmi C
|

Updated on: Oct 06, 2026 | 11:55 AM

Share

హైదరాబాద్, అక్టోబర్ 6: దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ 2027 (JEE Main 2027) తొలి విడత పరీక్షలకు సంబంధించిన తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. ఈసారి జనవరి 22 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే విషయంపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.

అక్టోబర్‌ చివరి వారంలో రిజిస్ట్రేషన్లు?

జేఈఈ మెయిన్‌ గత సంవత్సరాల షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. తొలి విడత పరీక్షలకు కొన్ని నెలల ముందుగానే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతూ వస్తోంది. జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌-1 రిజిస్ట్రేషన్లు అక్టోబర్‌ 31న, 2025లో అక్టోబర్‌ 28న ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో 2027 సెషన్‌-1కు కూడా అక్టోబర్‌ చివరి వారంలో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే NTA అధికారికంగా తేదీని ప్రకటించే వరకు దీనిని ఖచ్చితమైన షెడ్యూల్‌గా పరిగణించకూడదు. దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులు అవసరమైన వివరాలు, పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా ఈ కింది సర్టిఫికెట్లు మీ వద్ద ఉండాలి. అవేంటంటే..

ఇవి కూడా చదవండి
  • ఆధార్‌ కార్డు/చెల్లుబాటయ్యే ఏదైనా గుర్తింపు పత్రం
  • పదో తరగతి విద్యార్హత వివరాలు
  • ఇంటర్‌/12వ తరగతి విద్యా వివరాలు
  • పాస్‌పోర్ట్‌ సైజు ఫొటో
  • సంతకం
  • అవసరమైన ఇతర ధ్రువపత్రాలు

వీటిలో పేర్లు, పుట్టిన తేదీ వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో ముందుగానే పరిశీలించుకోవాలి. జేఈఈ మెయిన్‌ 2027కు సంబంధించిన రిజిస్ట్రేషన్‌ తేదీ, దరఖాస్తు విధానం, పరీక్షా కేంద్రాలు, అడ్మిట్‌ కార్డు, పరీక్షా మార్గదర్శకాలు తదితర వివరాలను NTA అధికారిక JEE Main వెబ్‌సైట్‌లో మాత్రమే ధ్రువీకరించుకోవాలి. ప్రస్తుతం రిజిస్ట్రేషన్‌ ప్రారంభ తేదీపై అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో, విద్యార్థులు సోషల్‌ మీడియాలో వచ్చే అనధికారిక తేదీలను నమ్మకుండా NTA అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సిందే.

Follow Us