Uttarandhra Rains: ఉత్తరాంధ్రను ముంచెత్తిన అకాల వర్షం.. విజయనగరం జిల్లాలో వేల ఎకరాల్లో పంట నష్టం
ఉత్తరాంధ్రను అకాలవర్షం అతలాకుతలం చేసింది. అన్నదాతలను నట్టేట ముంచింది. విజయనగరం జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది.
ఉత్తరాంధ్రను అకాలవర్షం అతలాకుతలం చేసింది. అన్నదాతలను నట్టేట ముంచింది. విజయనగరం జిల్లాలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పెనుగాలుల ధాటికి చేతికొచ్చిన పంట నేలపాలైంది. వేల ఎకరాల్లో పంటనష్టం జరిగింది. భారీ వర్షం బీభత్సానికి అనేకచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కరెంట్ సరఫరా కూడా నిలిచిపోవడంతో పలు కాలనీలు అంధకారంలో చిక్కుకున్నాయి.
జిల్లాలోని కొమరాడ, కురుపాంలో కుండపోత వర్షం కురిసింది. రహదారులు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్థానికులు రోడ్లపై పడ్డ చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు. అధికారులు కూడా పలుచోట్ల పునరుద్ధరణ పనులు చేపట్టారు.
మరోవైపు అకాలవర్షాలు రైతులకు తీవ్రనష్టాన్ని మిగిల్చాయి. ఏజెన్సీలో బలంగా వీచిన ఈదురుగాలులకు మామిడి, అరటి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మామిడికాయలు రాలిపోగా …వేలాది ఎక్కరాల్లో అరటి, మొక్కజొన్న పూర్తిగా ధ్వంసం అయ్యింది. చేతికి వచ్చిన పంట నేల పాలవ్వటంతో లబోదిబోమంటున్నారు రైతన్నలు.
విజయనగరంజిల్లాలో వేలాది ఎకరాల్లో మామిడి, అరటి, జీడిమామిడి తోటలు ఉన్నాయి. వీటిపై ఆధారపడి జీవించేవారు అధికంగా ఉన్నారు. పెను గాలులకు మామిడి, జీడిమామిడి చెట్లు నేలకొరిగాయి. పిందె దశలో ఉన్న కాయలు నేలరాలి తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. రాలిన కాయలు ఎందుకూ పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్ముదామన్నా కొనేవారే వుండరన్నారు. మామిడితోపాటు ఆరుతడి పంటలు, వాణిజ్య, ఉద్యానవన పంటలు తీవ్రంగా నష్టపోయి రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: ‘ మా నాన్నను వదిలేయండి’.. కంటతడి పెట్టుకున్న జవాను రాకేశ్వర్ సింగ్ కుమార్తె.. కదిలిస్తున్న వీడియో
వరుడి ఎత్తు రెండు అడుగులు.. వధువు ఎత్తు నాలుగు అడుగులు.. దేవుడే కలిపాడు ఈ జంటను..