AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాఖ బీచ్‌ మరణాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు.. రాకాసి అలలపై ఇస్రో నిఘా.. ఇకపై విషాదాలు ఉండవు!

ఐదు రోజులు ముందస్తుగానే సమయం తేదీ వారీగా కెరటాల తాకిడి, తీవ్రత తెలిపేలా ఈ సమాచార వ్యవస్థ ఉండడంతో సందర్శకుల ప్రాణాలకు మరింత భరోసానిచ్చేలా పోలీసులు ముందుకు వెళ్తున్నారు. కేవలం పోలీసులే కాదు,..

విశాఖ బీచ్‌ మరణాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు.. రాకాసి అలలపై ఇస్రో నిఘా.. ఇకపై విషాదాలు ఉండవు!
Deadly Rip Currents
Jyothi Gadda
|

Updated on: Feb 07, 2023 | 4:12 PM

Share

సాగరనగరం విశాఖలో ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన సుందరమైన బీచ్‌లు పర్యాటకులను కట్టిపడేస్తుంటాయి. చల్లని గాలులు.. సుతి మెత్తని ఇసుక… కవ్వించే కెరటాలు కాలి పాదాలకు తాకుతూ అలా వెళుతూ ఉంటే వాటి వైపు ఆకర్షితులవకుండా ఉండలేరు సందర్శకులు. అందుకే కేవలం విశాఖ నుంచి మాత్రమే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆర్కే బీచ్‌తో పాటు ఋషికొండ, యారాడ, సాగర్ నగర్, భీమిలి వేటికవే ప్రత్యేకతను సంతరించుకుని పర్యాటకలను తన వైపు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ తీర ప్రాంతలు కొన్ని సందర్భాల్లో డెడ్లీ బీచ్ లుగా మారిపోతున్నాయి. ఎందుకంటే… కనిపించకుండా అలల మాటున వచ్చే రిప్ కరెంట్స్ సందర్శకుల పాలిట మృత్యు కెరటాలుగా మారుతున్నాయి. రాకాసి అలలుగా పిలిచే ఈ రిప్ కరెంట్.. అమాంతంగా సందర్శకులను మింగేస్తున్నాయి. గాలి ద్వారా ఏర్పడిన అలలు నీటి అడుగున బలమైన ప్రవాహంగా మారి తీర ప్రాంతం వైపు దూసుకు వస్తున్నాయి. చాప కింద నీరుల.. కెరటాల కింద నుంచి వచ్చి అమాంతంగా తీరంలో జలకాలాడే జనాలను లాగేస్తోంది.

అలలు రిప్ కరెంట్‌గా మారి తీరాన్ని తాకినప్పుడు సముద్రపు అడుగున బలమైన ప్రవాహంలా ఏర్పడుతుంది. రిప్‌ కరెంట్ సెకనుకు రెండు నుంచి ఎనిమిది అడుగుల వేగం ఉంటుంది. తీరం వైపు దూసుకు వచ్చే రిప్ కరెంట్… తీరని తాకినప్పుడు ఒకలా ఉండి, వెనక్కి వెళ్ళినప్పుడు దాని రూపాన్ని మార్చుకుంటుంది. రిప్ కరెంట్ చీలి పది అడుగుల నుంచి వందల అడుగుల వెడల్పు వరకు విడిపోయి రెప్పపాటులో వెనక్కి మల్లుతుంది. ఈ సమయంలోనే అక్కడ ఉన్న సందర్శకుల కాళ్ల కింద ఇసుక కొట్టుకుపోయి కెరటాల తాకిడితో సముద్రం లోపలికి లాక్కెళ్ళిపోతుంది. రెప్పపాటులో జరిగే ఈ రిప్ కరెంట్ ప్రభావంతో ఆటుపోట్ల సమయంలో గజ ఈతగాళ్లు కూడా బయటపడలేని సందర్భాలు అనేకం ఉన్నాయి.

ప్రతీయేటా బీచ్ ప్రమాదాల బారిన పడి పదుల సంఖ్యలో సందర్శకులు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో జీవీఎంసీ పోలీస్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. లైఫ్ గాడ్స్ పేరుతో గజ ఈతగాలన్ని నియమించింది. సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉండే బీచ్‌లలో పహారా ఏర్పాటు చేస్తోంది.. చాలా సందర్భాల్లో బీచ్ లో కొట్టుకుపోతున్న సందర్శకులను గజతగాళ్లు రక్షించారు. అయినప్పటికీ ఆ కెరటాల రాకను ముందస్తుగా పసిగట్ట లేకపోవడంతో ఇప్పటివరకు ప్రమాదాల తీవ్రత పెరుగుతూ వస్తోంది. దీంతో ఇస్రో డెవలప్ చేసిన mosdac. gov.in వెబ్సైట్ ఇచ్చే సమాచార వ్యవస్థను అందిపుచ్చుకొని విశాఖ సిటీ పోలీసులు ముందుకు వెళ్తున్నారు.

ఇవి కూడా చదవండి

దేశంలోనే 175 బీచ్ లలో గత 20 ఏళ్ల కాలంలో జరిగిన ప్రమాదాల్లో కెరటాల తీవ్రతను అంచనా వేస్తూ పరిశోధనలు నిర్వహించారు. సందర్శకుల ప్రాణాలు తోడేస్తున్న రిప్‌ కరెంట్‌ రాకను ముందుగానే పసిగట్టేలా సమాచార వ్యవస్థను సిద్ధం చేసి ఆ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తున్నారు. కచ్చితంగా ఏ బీచ్ లో ఎప్పుడెప్పుడు ప్రమాదకర పరిస్థితిలో కెరటాలు వస్తున్నాయి అన్నది స్పష్టంగా తెలుసుకునేలా సమాచారాన్ని బీచ్‌ల వారీగా అందులో అప్‌ డేట్ చేస్తున్నారు. దీంతో ఈ అధునాతన సాంకేతిక వ్యవస్థ ద్వారా వచ్చే సమాచారాన్ని అందిపుచ్చుకొని విశాఖ సిటీ పోలీసులు బీచ్ లో మరింత రక్షణ వ్యవస్థను మెరుగుపరిచేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఐదు రోజులు ముందస్తుగానే సమయం తేదీ వారీగా కెరటాల తాకిడి, తీవ్రత తెలిపేలా ఈ సమాచార వ్యవస్థ ఉండడంతో సందర్శకుల ప్రాణాలకు మరింత భరోసానిచ్చేలా పోలీసులు ముందుకు వెళ్తున్నారు. కేవలం పోలీసులే కాదు, ఈ వెబ్సైట్ ద్వారా ఇతర ప్రాంతాల నుంచి బీచ్‌లకు వచ్చే పర్యాటకులు కూడా అప్రమత్తంగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ఎవరు ఎన్ని చర్యలు చేపట్టినా… ఎవరికి వారు నియంత్రించుకుంటూ బీచ్ సందర్శనలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో బీచ్‌లో ఎంజాయ్‌తో పాటుగానే అలర్ట్‌గా ఉండటం కూడా అంతే ముఖ్యం.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..