ఏలూరు, అక్టోబర్ 2: గణేశ్ నిమజ్జనం సందర్భంగా జరిగిన ఊరేగింపులో డీజే ఆపమన్నందుకు కానిస్టేబుల్ గంధం నరేంద్ర (34)పై ఉలాస రామకృష్ణ అనే యువకుడు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. గత శనివారం జరిగిన దాడిలో యవకుడు కానిస్టేబుల్‌ను కర్రతో చితకబాదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిని కానిస్టేబుల్ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృత దేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అసలేం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా ఆగిరిపల్లి గౌడ బజార్‌లో గత శనివారం రాత్రి (సెప్టెంబర్ 23) గణేశ్ నిమజ్జనం ఊరేగింపు జరిగింది. అర్ధరాత్రి దాటడంతో ఊరేగింపులో డీజే ఆపేయాలని అక్కడ విధులు నిర్వహిస్తోన్న కానిస్టేబుల్ గంధం నరేంద్ర సూచించారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఉలాస రామకృష్ణ అనే కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. కానిస్టేబుల్‌పై పగ పెంచుకున్న రామకృష్ణ కానిస్టేబుల్ ఒంటరిగా ఉన్న సమయంలో కర్రతో దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఆగిరిపల్లి ఎస్సై ఘటన స్థలానికి చేరుకుని బాధితుడిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆదివారం సాయంత్రం (అక్టోబర్ 1) మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కానిస్టేబుల్ గంధం నరేంద్ర సోమవారం (అక్టోబర్ 2) ఉదయం మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసు విచారణలో ఉందని, దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఓ పోలీసధికారి మీడియాకు తెలిపాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.