బెజవాడలో దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు దళారులు.. భక్తుల కోసం ఉచితంగా ఇచ్చే సౌకర్యాలపై బ్రోకర్లు కన్నేశారు. దుర్గమ్మ దర్శనం పేరిట వేల రూపాయలు దోచుకుంటున్నారు. వృద్ధులు, వికలాంగులు అనే కనికరం లేకుండా కాసులు ఇస్తేనే దర్శనమని దందాలు చేస్తున్నారు..అసలు ఇంద్రకీలాద్రిపై ఏం జరుగుతోంది.. భక్తులను ఎలా దోపిడీ చేస్తున్నారో.. tv9 నిఘాలో వెల్లడైంది.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ.. ఆలయంపై బ్రోకర్ల కన్నుపడింది. అమ్మవారిని దర్శించుకునేందుకు ఎంతో భక్తిశ్రద్ధలతో వస్తున్న అమ్మవారి భక్తులను నిలువుదోపిడీ చేస్తున్నారు దళారులు. వారికి డబ్బుపై ఉన్న పిచ్చి పీక్స్ కు చేరింది. వృద్ధులు, వికలాంగులను కూడా దోచుకోకుండా వదలడం లేదు. సాధారణంగా అలాంటి వారికి వీల్ చైర్ ఫ్రీగా ఇస్తారు. కానీ.. ఈ బ్రోకర్లు వారిని బురిడీ కొట్టించి.. వికలాంగులు, వృద్ధుల దగ్గరి నుంచి డబ్బు కాజేస్తున్నారు. ఈ అక్రమాలపై టీవీ9 నిఘా పెట్టింది. ఈ సీక్రెట్ ఆపరేషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అమ్మవారి దర్శనానికి ఓ కుటుంబం వచ్చింది.. వారిలో ఓ వ్యక్తి కనీసం నడవలేని పరిస్థితిలో ఉన్నాడు.. దీంతో వీల్ చైర్ కావాలని ఎదురు చూస్తున్న సమయంలో.. ఓ బ్రోకర్ అప్రోచ్ అయ్యాడు.. ఆ వ్యక్తిని వీల్ చైర్‌పై అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లాలంటే.. 300 అవుతుందని వారికి చెప్పాడు. తాము అంత డబ్బు ఇచ్చుకోలేమని చెప్పగా.. మీరే చైర్ తీసుకొని దర్శనం చేసుకుని రండి అని తమాషాగా చెప్పాడు. దీంతో ఆ భక్తులు 300 ఇస్తే కానీ.. వీల్ చైర్ మీద ఆ వ్యక్తిని తీసుకెళ్లలేదు. ఇదంతా టీవీ9 నిఘా కెమెరాకు చిక్కింది.
తెలంగాణా నుంచి అమ్మవారి దర్శనం కోసం వృద్ధురాలితో కలిసి వచ్చారు ఒక ఫ్యామిలీ. వాళ్లు వీల్ చైర్ కావాలని కోరారు. అందుకు ఆ బ్రోకర్.. వారి వద్ద నుంచి కూడా వీల్ చైర్ మీద దర్శనానికి తీసుకెళ్లడానికి 300 రూపాయలు డిమాండ్ చేశాడు.. ఇంతలో టీవీ9 ఆ బ్రోకర్‌తో దర్శనం కూడా చేయిస్తారా..? అని ప్రశ్నిస్తే.. దర్శనానికి సపరేట్ అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుందని సమాధానం చెప్పాడు.
ఒక మహిళ పూర్తిగా కాలు కోల్పోయి నడవలేని స్థితిలో ఉంది. ఆమెను చూస్తే ఎవరికైనా జాలి అనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఉన్న మహిళ కుటుంబ సభ్యుల నుంచి డబ్బులు డిమాండ్ చేసి.. వీల్ చైర్ మీద దర్శనానికి తీసుకెళ్లాడు ఓ బ్రోకర్.. అంతేకాదు.. టీవీ9 నిఘాలో.. విస్తుపోయే అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఆరేళ్లుగా.. ఇదే విధంగా దందాలు చేస్తున్నట్లు ఏకంగా బ్రోకర్లే ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అంతేకాదు.. అక్కడ ఉన్న వీల్ చైర్ బ్రోకర్లేకాదు.. సామాన్య ప్రజలు కొండపైకి లిప్ట్ లో వెళ్లాలన్నా.. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి డబ్బు చెల్లించాల్సిందే.. లేదా 300, 500 దర్శన టికెట్ ఉంటే తప్ప.. లిఫ్ట్ ఎక్కించే పరిస్థితి లేదు. దీంతో దుర్గగుడికి వచ్చే భక్తులు దోపిడీకి గురవుతూ.. తీవ్ర అవస్థలు పడుతున్నారు.
గత ఆరు సంవత్సరాలుగా కొండపైన అమ్మవారి గుడిలో వీల్ చైర్ సర్వీస్ చేస్తున్నామని.. ఒక వ్యక్తికి రెండు వందల రూపాయలు తీసుకుంటున్నామని బ్రోకర్ చెప్పుకొచ్చాడు. ఒక్క రోజుకు ఒకరిని లేదా ఇద్దరినీ తీసుకెళ్తామని మాయమాటలు చెప్పాడు సదరు బ్రోకర్. .
కొండపై ఆలయంలో మాయ చేస్తున్న బ్రోకర్లను ఆలయ అధికారులు పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్శనం టికెట్లు లేకుండా దర్శనాలకు తీసుకెళుతూ.. వీల్ చైర్లు ద్వారా డబ్బులు దండుకుంటున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి వారి మీద కఠిన మైన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రోజుకు వందలాది మందిని మోసం చేస్తూ.. డబ్బు సంపాదిస్తున్నారని ఆరోపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..