విశాఖపట్నంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అనకాపల్లి జాతీయ రహదారి వద్ద ప్రమాదం జరిగింది. హైవే విస్తరణలో భాగంగా జలగలమధుం జంక్షన్ సమీపంలో నిర్మిస్తున్న కొత్త ఫ్లైఓవర్ కుప్పకూలింది. దాని సైడ్ బీమ్‌ల కింద కారు, ఓ ఆయిల్ ట్యాంకర్ లారీ నుజ్జునుజ్జయ్యాయి. అది ఖాళీ ట్యాంకర్ కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు(బాలుడు, యువకుడు) మృతి చెందగా.. మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. అటు లారీ డ్రైవర్‌కు కూడా తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పిల్లర్లు కూలుతున్న సమయంలో పెద్ద శబ్దాలు రావడంతో అక్కడున్న స్థానికులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో మరో రెండు కార్లు కూడా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. కాగా, విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకొని సహాయ కార్యక్రమాలను చేపడుతున్నారు.
ఇదిలా ఉంటే ఫ్లైఓవర్ ఘటనపై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాధ్ అన్నారు. ఈ ఘటన చాలా బాధాకరమని.. ఖచ్చితంగా కాంట్రాక్టర్ వైఫల్యం కనిపిస్తోందని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకునేలా చర్యలు తీసుకుంటామన్న మంత్రి.. కాంట్రాక్టర్‌పై చర్యలకు వెనకాడబోమని స్పష్టం చేశారు. రోడ్డు పనుల నాణ్యతపై మరోసారి పరిశీలన చేయిస్తామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అన్ని రోడ్డు విస్తరణ పనులపై క్వాలిటీ చెక్ చేయాల్సిన అవసరముందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్రం, హైవే అధారిటీపై ఒత్తిడి తీసుకొస్తామని వెల్లడించారు.
Read Also: