AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: పట్టు వస్త్రం స్కామ్‌పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్

మొన్న కల్తీ నెయ్యి కలకలం... నిన్న పరకామణి చోరీ వ్యవహారం... ఇప్పుడేమో పట్టువస్త్రం పేరుతో భారీ కుంభకోణం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో వరుస స్కామ్‌లు వెలుగులోకొస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. దశాబ్దకాలం నుంచీ ఈ స్కామ్‌ జరుగుతున్నట్టు ఆరోపణలు రావడం ఇటు భక్తులను కలవరపెడుతోంది.

Tirumala: పట్టు వస్త్రం స్కామ్‌పై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్
TTD silk cloth scam
Raju M P R
| Edited By: Ram Naramaneni|

Updated on: Dec 10, 2025 | 5:39 PM

Share

టీటీడీలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. వేద ఆశీర్వచనం సమయంలో భక్తులకు కప్పే వస్త్రాల కొనుగోళ్లలో అవినీతి జరిగినట్టు బోర్డు అనుమానిస్తోంది. రెండు నెలల క్రితమే బోర్డు సమావేశంలో ఈ అంశం చర్చకు రాగా, నిపుణుల కమిటీ సమర్పించిన తాజా నివేదిక అసలైన నిజాలను బహిర్గతం చేసింది. నాణ్యతలేని వస్త్రాలను పట్టు వస్త్రాలుగా చూపిస్తూ టీటీడీకి సరఫరా చేసిన సంస్థల బాగోతం బయటకు వచ్చింది.

2010 నుంచీ టీటీడీకి వస్త్రాలను సరఫరా చేస్తున్న నగరానికి చెందిన VKS ఎక్స్‌పోర్ట్స్, దాని అనుబంధ సంస్థలు నాణ్యత ప్రమాణాలను ఉల్లంఘించినట్లు విచారణలో తేలింది. పట్టు పేరుతో జరిగిన ఈ అవినీతి దాదాపు రూ.50 కోట్ల మేరుందని టీటీడీ బోర్డు అంచనా వేసింది. టీటీడీ విజిలెన్స్ నివేదికలో కూడా ఈ అక్రమాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. కేసు విచారణను ఏసీబీకి బదిలీ చేయాలని బోర్డు నిర్ణయించడంతో, టీటీడీ CVSO ఇప్పటికే ఏసీబీ డీజీకి లేఖ రాసింది.

టెండర్ నిబంధనలకు విరుద్ధంగా వస్త్రాలు కొనుగోలు చేసినట్లు నిర్ధారించిన టీటీడీ, దీన్ని మరో కీలక స్కామ్‌గా పరిగణిస్తోంది. 2015–2025 మధ్య జరిగిన వస్త్రాల కొనుగోళ్లను, అందులో చోటుచేసుకున్న అవినీతిని పూర్తిగా వెలికితీయడానికి కమిటీ సిద్ధమైంది. బహిరంగ మార్కెట్లో రూ.350 లోపు ధర కలిగిన వస్త్రాలను, టీటీడీ రూ.1389కి కొనుగోలు చేసినట్లు విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది.

టీటీడీలో ఇప్పటికే పరకామణి, కల్తీ నెయ్యి, తులాభారంపై విచారణ జరుగుతుండగా, ఇప్పుడు వస్త్రాల స్కామ్ కూడా బయటపడడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2019–2024 మధ్య టీటీడీలో భారీ అవినీతి జరిగిందని, గత ఐదేళ్లలో శ్రీవారి ఆస్తులకు సరైన రక్షణ లేకపోయిందని టీటీడీ పాలకమండలి సభ్యుడు భాను ప్రకాష్ ఆరోపించారు. పరకామణి, తులాభారం, నెయ్యి, వస్త్రాల కొనుగోళ్లలో అనేక అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు.

వేద ఆశీర్వచనంలో భక్తులకు కప్పే వస్త్రాలకు నాణ్యత లేదని ఎక్స్పర్ట్ కమిటీ నివేదిక వెల్లడించినట్లు తెలిపారు. శ్రీవారికి అలంకరించే మేల్ చాట్ వస్త్రాలలో కూడా పట్టు లేకపోవడం చాలా సిగ్గుచేటని, దేవుడి సొమ్మును దిగమింగారని మండిపడ్డారు. రూ.50 కోట్ల మేర అవినీతి జరిగిందని, ప్రాథమిక నివేదిక వెలువడిన తర్వాత అన్ని వివరాలు స్పష్టం అవుతాయని తెలిపారు. టీటీడీలో జరుగుతున్న స్కాంలను రాజకీయ కోణంలో చూడడం లేదని, శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.

తిరుమలలో జరిగిన పట్టు వస్త్రాల స్కాంపై జనసేన అధిపతి పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. టీటీడీలో ఎన్నో అక్రమాలు వెలుగులోకి వస్తుండటానికి కారణం కూటమి ప్రభుత్వమే విచారణను వేగంగా ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. హిందూ మత విషయాలను చిన్నచూపు చూడటాన్ని పవన్ విమర్శించారు. పరకామణి వివాదంపై జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని, ఇదే ఘటన ఆయన మతంలో జరిగి ఉంటే చిన్న విషయం అంటూ కొట్టిపారేస్తారా? అని ప్రశ్నించారు.