Silver: కేవలం రూ.800తో కోటీశ్వరులు అవ్వొచ్చు.. కియోసాకి సిల్వర్ సీక్రెట్ గురించి తెలుసా..?
పెట్టుబడి పెట్టాలంటే వేలు, లక్షలు ఉండాలి అని అనుకుంటున్నారా..? అయితే అవసరం లేదంటున్నారు ప్రపంచ ప్రఖ్యాత రచయిత రాబర్ట్ కియోసాకి. కేవలం 800 రూపాయలతోనే మీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవచ్చని ఆయన చెబుతున్నారు. అసలు ఆ మ్యాజిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఏంటి? స్టాక్ మార్కెట్లు కూలిపోతాయని ఆయన ఎందుకు హెచ్చరిస్తున్నారు? అనేది తెలుసుకుందాం..

ప్రపంచ ప్రఖ్యాత పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడి పెట్టాలంటే లక్షలు ఉండక్కర్లేదని.. కేవలం 10 డాలర్ల తో కూడా సంపదను సృష్టించవచ్చని ఆయన బాంబు పేల్చారు. ఇందుకు ఆయన సూచిస్తున్న ఏకైక మార్గం.. వెండి. ఆర్థిక అవగాహన అనేది పెద్ద పెద్ద కోర్సులతో రాదని, చిన్న చిన్న పెట్టుబడులతోనే ప్రారంభమవుతుందని కియోసాకి నమ్ముతారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. ‘‘ఎవరి దగ్గరైనా కేవలం 10డాలర్లు ఉన్నా సరే, వెంటనే వెండి కొనండి. ఒకవేళ అంత డబ్బు లేకపోతే రోజువారీ ఖర్చులను తగ్గించుకుని ఆ మొత్తాన్ని ఆదా చేయండి’’ అని సూచించారు. పెట్టుబడి పెట్టడం వల్ల కేవలం డబ్బు మాత్రమే రాదని, మార్కెట్ ఎలా పనిచేస్తుందనే నిజమైన అవగాహన పెరుగుతుందని ఆయన విశ్లేషించారు.
స్టాక్ మార్కెట్‌కు ముంచుకొస్తున్న ముప్పు?
కేవలం వెండి కొనమని చెప్పడమే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కియోసాకి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అప్పుల భారం పెరిగిపోతోందని, ఇది భవిష్యత్తులో పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరించారు. గతంలో లెమాన్ బ్రదర్స్ పతనాన్ని ముందే ఊహించిన విషయాన్ని గుర్తు చేస్తూ, 2008 నాటి ఆర్థిక మాంద్యం సమస్యలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని ఆయన వాదించారు. త్వరలోనే స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యే అవకాశం ఉందని, అప్పుడు కేవలం ప్రత్యామ్నాయ ఆస్తులు మాత్రమే ఇన్వెస్టర్లను కాపాడతాయని చెప్పారు.
వెండి ఎందుకు బెస్ట్ ఆప్షన్?
బంగారం, బిట్‌కాయిన్, ఎథెరియం వంటి వాటిని కియోసాకి సమర్థిస్తున్నప్పటికీ.. సామాన్యులకు వెండిని రికమండ్ చేయడానికి పలు కారణాలు ఉన్నాయి.
- తక్కువ ధరలో లభించడం వల్ల ఎవరైనా సులభంగా కొనవచ్చు.
- వెండిని కేవలం ఆభరణాలకే కాదు.. ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్‌లో విరివిగా ఉపయోగిస్తారు. కాబట్టి దీనికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది.
- ద్రవ్యోల్బణానికి చెక్: రూపాయి విలువ తగ్గుతున్నప్పుడు, వెండి వంటి లోహాలు ఆస్తిని కాపాడుతాయి.
పాత నాణేలతో ప్రారంభించండి
స్థానిక డీలర్ల వద్ద దొరికే పాత వెండి నాణేలు లేదా చిన్న మొత్తంలో వెండిని కొనడం ద్వారా అనుభవాన్ని గడించాలని కియోసాకి సలహా ఇచ్చారు. దీనివల్ల డీలర్లతో మాట్లాడే అవకాశం లభిస్తుందని, తద్వారా మార్కెట్ మెళకువలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆర్ధిక మాంద్యం భయాల మధ్య రాబర్ట్ కియోసాకి ఇచ్చిన ఈ సలహా ఇప్పుడు ఇన్వెస్టర్లలో కొత్త చర్చకు దారితీసింది. మదుపర్లు తమ పోర్ట్‌ఫోలియోలో వెండికి ఎంత శాతం కేటాయించాలనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
