మయన్మార్ సరిహద్దు‌లో పట్టుబడిన తలనీలాలపై దుమారం.. ప్రచారంపై టీటీడీ సీరియస్.. పోలీసులకు ఫిర్యాదు

మనం ఇప్పటి వరకు గోల్డ్‌, డ్రగ్స్‌ వంటి వాటినే సరిహద్దులను దాటించడాన్ని చూశాం. కానీ కొందరు కేటుగాళ్లు కేశఖండనాలను కూడా వదలడం లేదు

మయన్మార్ సరిహద్దు‌లో పట్టుబడిన తలనీలాలపై దుమారం.. ప్రచారంపై టీటీడీ సీరియస్.. పోలీసులకు ఫిర్యాదు
Ttd Hair Smuggling
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 31, 2021 | 8:18 AM

మనం ఇప్పటి వరకు గోల్డ్‌, డ్రగ్స్‌ వంటి వాటినే సరిహద్దులను దాటించడాన్ని చూశాం. కానీ కొందరు కేటుగాళ్లు కేశఖండనాలను కూడా వదలడం లేదు. అంతర్జాతీయంగా జట్టుకున్న డిమాండ్‌ను సొమ్ము చేసుకుందామనుకుని.. దేశ సరిహద్దులు దాటించే క్రమంగా అడ్డంగా దొరికిపోయారు.

అంతర్జాతీయ స్మగ్లింగ్‌ జాబితాలో జుట్టు కూడా చేరినట్టు కనిపిస్తోంది. అవును.. జుట్టున్నమ్మ ఎన్నికొప్పులైనా వేయొచ్చని అన్నట్టుగా.. అంతర్జాతీయంగా జుట్టుకున్న డిమాండ్‌.. ఇప్పుడీ పనిచేసేలా ఉసిగొల్పుతున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల మయన్మార్‌ సరిహద్దులో.. 120 బ్యాగుల్లో తలనీలాలను తీసుకెళ్తుండగా.. సీజ్‌ చేశారు. అయితే అవి టీటీడీవేనన్న ప్రచారం సాగింది. కానీ ఆ ప్రచారాన్ని తిప్పికొడుతూ టీటీడీ వివరణ ఇచ్చింది. వాటితో టీటీడీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. దేశంలోని అనేక ఆలయాల్లో తలనీలాల విక్రయాలు జరుగుతుంటాయని అలాగే..టీటీడీ కూడా ప్రతీ మూడునెలలకోసారి ఈ-టెండర్‌ ద్వారా విక్రయాలు జరుపుతుందని స్పష్టం చేసింది.

ఆ తర్వాత కొనుగోలు చేసిన బిడ్డర్‌కు జట్టును అంతర్జాతీయ ఎగుమతి చేసుకునే అనుమతులున్నాయా లేవా అన్నది టీటీడీకి సంబంధం లేని విషయమని స్పష్టం చేసింది. అయితే మయన్మార్‌లో పట్టుబడిన కేశాల విలువ 2 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. వీటిని థాయ్‌లాండ్‌, చైనాకు అక్రమంగా ఎగుమతి అవుతున్న క్రమంలో పట్టుబడ్డాయి. ఎలాంటి బిల్లులు, రవాణా పత్రాలు లేకుండా ఈ తలనీలాలను తరలిస్తున్నట్టుగా అసోం రైఫల్స్‌ భద్రతా సిబ్బంది, కస్టమ్స్‌ అధికారులు గుర్తించారు. కేటుగాళ్ల జుట్టు పట్టుకుంటే.. ఈ జుట్టు గుట్టు వెలుగుచూసింది. ఇలా అక్రమ రవాణాకు పాల్పడే వారి వివరాలను భవిష్యత్‌ టెండర్ ప్రక్రియలో పాల్గొనకుండా బ్లాక్ లిస్టులో పెడతామని టీటీడీ తెలిపింది. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుమల శ్రీవారికి భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన తలనీలాలను టీటీడీ చైనాకు స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేసిందని ఫేస్ బుక్, మీడియాలో దుష్ప్రచారం చేసిన వారిపై మంగళవారం రాత్రి తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read: మాస్క్ పెట్టుకోని వ్యక్తులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. నేడు కోర్టు ముందుకు

Horoscope Today: ఈరాశుల వారికి ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి… ఈరోజు రాశిఫలాలు..