Tirupati: తిరుమ‌ల‌లో స‌నాత‌న ధార్మిక సదస్సుకు ముమ్మర ఏర్పాట్లు.. ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం

| Edited By: Srilakshmi C

Jan 31, 2024 | 10:46 AM

హిందూ ధర్మ ప్రచారానికి టిటిడి మరో అడుగు ముందుకేసింది. తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5 వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స‌నాత‌న‌ ధార్మిక సదస్సుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. శ్రీ వెంకటేశ్వర వేద సదస్సు నిర్వహణ, ఏర్పాట్లపై ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి అధికారుల‌తో సమీక్ష నిర్వహించగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న..

Tirupati: తిరుమ‌ల‌లో స‌నాత‌న ధార్మిక సదస్సుకు ముమ్మర ఏర్పాట్లు.. ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభం
Sanatana Dharmic Conference In Tirupati
Follow us on

తిరుపతి, జనవరి 31: హిందూ ధర్మ ప్రచారానికి టిటిడి మరో అడుగు ముందుకేసింది. తిరుమల ఆస్థాన మండపంలో ఫిబ్రవరి 3 నుండి 5 వరకు టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న స‌నాత‌న‌ ధార్మిక సదస్సుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది. శ్రీ వెంకటేశ్వర వేద సదస్సు నిర్వహణ, ఏర్పాట్లపై ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి అధికారుల‌తో సమీక్ష నిర్వహించగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. తిరుమల ఆస్థాన మండపంలో మూడు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న స‌నాత‌న‌ ధార్మిక సదస్సులో దేశంలోని ప్రముఖ మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామిజీలు పాల్గొంతుండటంతో స్వామీజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప‌టిష్ట‌మైన ఏర్పాట్లు చేయాల‌ని టీటీడీ అధికారుల‌కు ఆదేశించింది. ఈ కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయ‌డానికి ముగ్గురు సీనియ‌ర్ అధికారుల‌తో కూడిన స‌మ‌న్యయ క‌మిటీని ఏర్పాటు చేసింది. వివిధ మఠాధిపతులు, పీఠాధిపతులను సంప్రదించి ఆహ్వానాలను అందజేసింది. అదేవిధంగా ప్రతి స్వామిజీకి ఒక లైజ‌న్ అధికారిని నియ‌మించిన టీటీడీ ఈ స‌ద‌స్సు నిర్వహ‌ణ‌కు ఏర్పాటు చేసిన దర్శనం, వసతి, ఆహార, ర‌వాణా కమిటీల‌తో లైజ‌న్ అధికారి స‌మ‌న్వయం చేసుకోవాలని ఆదేశించింది. టీటీడీ నిర్వహించే ధ‌ర్మ ప్రచార కార్యక్రమాల‌పై ఎస్వీబీసీ వీడియో రూపొందించిన టీటీడీ సదస్సులో పాల్గొనే స్వామిజీల స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకునేందుకు త‌గిన ఏర్పాట్లు చేసింది.

మరోవైపు తిరుమల ఆస్థాన మండపంలో 3 రోజుల పాటు నిర్వహించే శ్రీ వేంకటేశ్వర వేద సదస్సు ఏర్పాట్లను పరిశీలించారు టిటిడి చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి. వేద సదస్సుఏర్పాట్ల పై అధికారులకు పలు సూచనలు చేసారు భూమన. పిబ్రవరి 3 నుంచి 5 వరకు ధార్మిక సదస్సును వైభవంగా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. సుమారు 57 మంది పీఠాధిపతుల సలహాలు తీసుకుంటామన్నారు, బాల బాలికల స్థాయి నుంచే హిందూ వ్యాప్తి ఉద్యమంగా మార్చాలని టీటీడీ కంకణం కట్టుకుందన్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా దేశ వ్యాప్తంగా టీటీడీ ధర్మ ప్రచారం చేస్తోందన్నారు. తిరుమల దివ్య క్షేత్రం నుంచే ఈ ధార్మిక సదస్సు భారత దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక ఉద్యమాన్ని తీసుకు వస్తుందన్నారు. ఈ తరంలో తగ్గిపోతున్న మానవతా విలువలకు ఆధ్యాత్మికతను జోడించి భక్తి ఉద్యమాన్ని తీసుకొస్తామని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. పీఠాధిపతులు ధార్మిక సదస్సులో అనుగ్రహభాషణం చేయటానికి సంసిద్ధతను వ్యక్తం చేశారని, వారిచ్చే సూచనలతో మరింతగా ధర్మ ప్రచారం చేయాలన్నదే టీటీడీ ఆలోచన అని భూమన అన్నారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఏ సందేశం వెళ్లినా ప్రపంచంలోని హిందూ దేవాలయాలకు ఆమోదయోగ్యమై నటువంటిదన్న సంకేతం ఇప్పటిదాకా ఉందన్నారు. తిరుమలలో నిర్వహించే ధార్మిక సదస్సు తీసుకునే నిర్ణయాలతో మరింతగా ధర్మ వ్యాప్తి చేస్తామని, హిందూ ధర్మ ప్రచార పరిషత్తును మరింత పటిష్టం చేయాలన్న ఆలోచనతోనే వేద సదస్సు నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.