AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maoist Jalandhar Reddy: లొంగిపోయిన మావోయిస్టు జలంధర్ రెడ్డి అలియాస్ మారన్న.. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ముందు సరెండ్

మావోయిస్టు కీలక నేత ముత్తన్నగారి జలంధర్‌రెడ్డి అలియాస్‌ కృష్ణ అలియాస్‌ మారన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మంగళవారం ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఎదుట సరెండర్ అయ్యారు.

Maoist Jalandhar Reddy: లొంగిపోయిన మావోయిస్టు జలంధర్ రెడ్డి అలియాస్ మారన్న.. ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ముందు సరెండ్
Top Maoist Jalandar Reddy
Balaraju Goud
|

Updated on: Apr 21, 2021 | 8:47 AM

Share

మావోయిస్టు కీలక నేత ముత్తన్నగారి జలంధర్‌రెడ్డి అలియాస్‌ కృష్ణ అలియాస్‌ మారన్న ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. మంగళవారం ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఎదుట సరెండర్ అయ్యారు. 22 ఏళ్లుగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మారన్న ఎట్టకేలకు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. నలభై ఏళ్ల జలంధర్‌రెడ్డి స్వస్థలం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం భూంపల్లి. డిగ్రీ చదువుతుండగా మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితుడై ఉద్యమ పంథా ఎంచుకున్నాడు. మావోయిస్ట్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన కీలక నేత, స్పెషల్ జోన్ కమిటీ సభ్యుడిగా ఎదిగారు. ఆయనపై రూ.20 లక్షల రివార్డు ప్రకటించింది హోంశాఖ. కాగా, ఆయన పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఆ డబ్బును ఆయనకే అందించనున్నారు. మావోయిస్టు పార్టీకి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను అధిగమించలేక, ఆరోగ్య సమస్యల కారణంగానే లొంగిపోయానని జలంధర్ రెడ్డి తెలిపారు.

రిటైర్డ్‌ వీఆర్వో బాలకృష్ణారెడ్డి, సులోచన దంపతుల చివరి కుమారుడు జలంధర్‌. సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతుండగా ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు. 1998లో రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌లో చేరిన జలంధర్‌రెడ్డి మావోయిస్టు పార్టీ స్పెషల్‌ జోన్‌ కమిటీ సభ్యుడి స్థాయికి వెళ్లారు. 2000 ఫిబ్రవరిలో సీపీఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ పార్టీ సభ్యుడిగా గిరాయిపల్లి దళంలో పనిచేశారు. 2000 సెప్టెంబర్‌ నుంచి 2002 ఆగస్టు వరకు నల్లమల ప్రాంతంలోని దక్షిణ తెలంగాణ స్పెషల్‌ గెరిల్లా స్క్వాడ్, ఆంధ్ర ప్రాంత ప్లాటూన్‌ లలో పనిచేశారు. 2002 సెప్టెంబర్‌లో ఏరియా కమిటీ సభ్యుడిగా పదోన్నతి పొంది ఏవోబీ ఎస్‌జెడ్‌సీకి వెళ్లారు.

ఏవోబీ ఎస్‌జెడ్‌సీలో ఈస్ట్‌ డివిజనల్‌ కమిటీ, మల్కన్‌గిరి– కోరాపుట్‌–విశాఖ బోర్డర్‌ కమిటీల్లో డివిజన్‌ కార్యదర్శి, కమాండర్‌గా పనిచేశారు. 2006 నవంబర్‌లో డివిజనల్‌ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు స్వీకరించారు. 2013 నుంచి 2016 వరకు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే ప్రొటెక్షన్‌ స్క్వాడ్‌ కార్యదర్శిగా పనిచేశారు. 2019 అక్టోబర్‌ నుంచి ఏవోబీ ఎస్‌జెడ్‌సీ సభ్యుడిగా పదోన్నతి పొందారు. 2008లో గ్రేహౌండ్స్‌ పోలీసులపై జరిగిన బలిమెల దాడి, 2011లో ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ వినీల్‌ కృష్ణ కిడ్నాప్‌ ఘటనలు జలంధర్‌రెడ్డి నేతృత్వంలోనే జరిగాయి. ఏడు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. 2001 మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, సున్నిపెంట, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీస్‌స్టేషన్లపై దాడి చేసిన కేసుల్లోనూ జలంధర్‌రెడ్డి ప్రధాన నిందితుడు.

లొంగిపోయిన జలంధర్ రెడ్డి అలియాస్ మారన్నను డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. జలంధర్ రెడ్డి మాట్లాడుతూ, మావోయిస్టు పార్టీ మునుపటిలా లేదని, ప్రజాబలం కోల్పోయిందని పేర్కొన్నాడు. అందుకే తాను జనజీవనంలోకి వచ్చేయాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. ప్రభుత్వం ప్రకటించిన నూతన లొంగుబాటు విధానం ఆకర్షణీయంగా ఉందని అన్నాడు.

Read Also…  జీవిత పరమార్ధం తెలిసిందంటూ సన్యాసం తీసుకున్న బాలీవుడ్ నటీమణులు వీడియో : Bollywood Heroine Video.