Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఆఫ్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లు
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవాణి దర్శన టికెట్ల ఆఫ్‌లైన్ కేటాయింపునకు ప్రత్యేక కౌంటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ డీటేల్స్ తెలుసుకుందాం పదండి...
తిరుమలలో ఇచ్చే ఆఫ్ లైన్ శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసినట్లు టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలియజేశారు. గోకులం సమావేశ మందిరం వెనుక వైపు శ్రీవాణి దర్శన టికెట్ల నూతన కౌంటర్‌ను ఆయన బుధవారం ఉదయం ప్రారంభించారు. కౌంటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వయంగా భక్తుల వద్ద వివరాలు తీసుకుని మొదటి టికెట్‌ను కేటాయించారు.
ఈ సందర్భంగా అడిషనల్ ఈవో మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్న శ్రీవాణి కౌంటర్ క్యూలైన్లలో వర్షం పడినప్పుడు భక్తులు ఇబ్బంది పడటాన్ని గుర్తించి ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శ్రీవాణి భక్తులు ఇకపై ఎలాంటి అసౌకర్యం కలగకుండా టికెట్లు పొందవచ్చని పేర్కొన్నారు.
రోజుకు 900 టికెట్లను ఆఫ్ లైన్ ద్వారా కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతంలో టికెట్ కేటాయింపునకు మూడు నుండి నాలుగు నిమిషాలు పట్టేదనీ, ప్రస్తుతం ఒక నిమిషంలో భక్తులకు టికెట్ కేటాయించేలా అప్లికేషన్‌లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. ఐదు కౌంటర్ల ద్వారా భక్తులు సులభతరంగా టికెట్లు కొనుగోలు చేయవచ్చని తెలియజేశారు.
నవంబరు 15న శ్రీ కపిలేశ్వరాలయంలో అన్నాభిషేకం
తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు 15వ తేదీన కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 2 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. తర్వాత సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 7.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..