Tirumala: రూ.లక్షతో 5 మందికి బ్రేక్ దర్శనం.. ఆ సేవలు కూడా.. శ్రీవారి భక్తులకు టీటీడీ సూపర్ న్యూస్..
టీటీడీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. భక్తుల నుంచి విరాళాలు సేకరించి కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. మరికొన్ని సొంత నిధులతో అమలు చేస్తోంది. అందులో ఒక సేవా కార్యక్రమం పేరే ఆపన్న హృదయ పథకం. ఈ పథకం ద్వారా చిన్నారులు ఉచితంగా హార్ట్ సర్జరీలు చేయిస్తోంది. ం

తిరుమల వెంకన్నకు భక్తులు సమర్పించే విరాళాలు ఎన్నో సేవా కార్యక్రమాల నిర్వహణకు దోహదపడుతున్నాయి. టీటీడీ ఖాతాకు జమవుతున్న విరాళాలు ఎన్నో ప్రాణాలను సైతం నిలబెడుతున్నాయి. భక్తుల సొమ్ముతో నడిచే కొన్ని ట్రస్టులు ద్వారా ఎంతో మంది ప్రాణాలకు ఊపిరి పోస్తున్నాయి. ఇందులో భాగమే చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు ఉపయోగపడుతున్న ఎస్ వి ఆపన్న హృదయ పథకం. సేవా కార్యక్రమాల్లో భక్తులను సైతం భాగస్వామ్యం చేస్తున్న టిటిడి ఆఫర్లు ఇస్తోంది. రూ. లక్ష చెల్లిస్తే శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం, వసతి, లడ్డు ప్రసాదం అందించి ఆదరిస్తోంది.
పసిబిడ్డల గుండెలకు ఆపరేషన్లు
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థగా గుర్తింపు పొందింది. నిత్యం వేలాది మంది భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కల్పించడమే కాదు భక్తులు సమర్పించే విరాళాలతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దాదాపు 13 ట్రస్టు లు, స్కీం లను నిర్వహిస్తున్న టిటిడి భక్తుల సేవలో తరిస్తోంది. ప్రివిలైజ్ గా భక్తుకులకు కూడా ఎన్నో సేవలు కల్పిస్తోంది. ఈ నేపథ్యంలోనే భక్తులు సైతం పెద్ద ఎత్తున శ్రీవారికి విరాళాలు సమర్పిస్తున్నారు. ఇలా దాతలు సమర్పించిన విరాళాలు అంతకంతకు పెరుగుతుండడంతో టీటీడీ ఆ నిధులను సద్వినియోగం చేసుకుంటోంది. ఎన్నో సేవా కార్యక్రమాలను సక్సెస్ ఫుల్ గా అమలు చేస్తోంది. ఇందులో భాగమే శ్రీ వెంకటేశ్వర ఆపన్న హృదయ హస్తం పథకం. ప్రాణదానం ట్రస్టు ద్వారా ఈ స్కీమ్ ను అమలు చేస్తున్న టీటీడీ దాతలు సమర్పించే విరాళాలతో పసి బిడ్డలకు ప్రాణం పోసే స్కీమ్ లో భక్తులను కూడా భాగస్వామ్యం చేస్తోంది. దాతలు ధాతృత్వాన్ని చాటేలా చేస్తోంది. దీంతో శ్రీ వేంకటేశ్వర ఆపన్న హృదయ పథకం టీటీడీ నిర్వహిస్తున్న ఒక గొప్ప సేవా కార్యక్రమంగా మారింది. ఈ స్కీమ్ ద్వారా నవజాత శిశువులు, చిన్నారులకు తిరుపతిలోని శ్రీ పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ సెంటర్ లో ఉచిత గుండె ఆపరేషన్లు చేయిస్తోంది.
ఆదాయపు పన్ను మినహాయింపు
ప్రాణదానం ట్రస్ట్ కింద ఎస్ వి ఆపన్న హృదయ పథకం అమలవుతోంది. ఈ పథకానికి విరాళాలు ఇచ్చే దాతలకు టీటీడీ ప్రత్యేకంగా వీఐపీ బ్రేక్ దర్శన అవకాశాలను కల్పిస్తోంది. ఈ స్కీమ్ ద్వారా భక్తులకు పలు ప్రయోజనాలు కల్పిస్తోంది. రూ.లక్ష విరాళం ఇస్తే 5 మందికి ఒకసారి వీఐపీ బ్రేక్ దర్శనం లభిస్తుంది. ఉచితంగా వసతి, శ్రీవారి తీర్థ ప్రసాదాలు కూడా అందిస్తోంది. సెక్షన్ 80G కింద ఆదాయపు పన్ను మినహాయింపు కూడా పొందే ఛాన్స్ ఉంది. టిటిడిని నేరుగా లేదంటే TTD అధికారిక వెబ్‌సైట్ లో ఆపన్న హృదయ స్కిమ్ ద్వారా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఇలా ప్రాణదానం ట్రస్ట్ కింద చిన్నపిల్లల గుండె చికిత్సలకు విరాళాలు ఇచ్చే భక్తులు అటు స్వామి దర్శనం ఇటు సేవాభావం పొందుతూ సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
2 వేలకు పైగా గుండె ఆపరేషన్లు
ఇక గుండె జబ్బులతో బాధపడే చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంగా 4 ఏళ్ల క్రితం టిటిడి శ్రీ పద్మావతి హృదయాలయ చిన్నపిల్లల ఆసుపత్రికి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటిదాకా 5వేల కు పైగా చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు చేసిన ఆసుపత్రి ఎస్వీ ఆపన్న హృదయ హస్తం స్కీంను సద్వినియోగం చేసుకుంటోంది. ప్రాణదానం ట్రస్ట్ కింద ఎస్ వి ఆపన్న హృదయ హస్తం పథకానికి ఇప్పటిదాకా 2వేల మంచి దాతలు విరాళాలు ఇచ్చారు. దాతలు ఇచ్చిన డొనేషన్ లతో దాదాపు 2 వేల చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు పూర్తి చేసినట్లు చెబుతున్నారు శ్రీ పద్మావతి చిన్నపిల్లల ఆసుపత్రి డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి. ఒక్కో గుండె ఆపరేషన్ కు రూ.2 నుంచి రూ. 3 లక్షల దాకా ఖర్చు అవుతోంది. ధాత ఇచ్చే రూ. లక్ష విరాళం చిల్లు పడ్డ చిన్న పిల్లల గుండెకు శస్త్ర చికిత్స చేసేందుకు సరి పడకపోయినా మిగతా డబ్బు ప్రాణదానం ట్రస్ట్ నుంచి టీటీడీ అందిస్తోంది. ఈ స్కీమ్ అమలు చేసినప్పటి నుంచి 2వేల మంది దాతలు ముందుకు రాగా.. 2025-26 ఏడాదిలోనే 1200 మంది భక్తులు విరాళాలు ఇచ్చారు. ఈ మధ్య కాలంలో శ్రీవాణి టికెట్స్ కు విపరీతంగా డిమాండ్ పెరగడంతో ట్రస్టులకు డొనేషన్స్ ఇచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఇలా శ్రీవారి దర్శనం టికెట్లు పొందుతున్న భక్తులు ప్రాణదానం ట్రస్ట్ తోపాటు పలు ట్రస్టులకు విరాళాలు ఇస్తుండడంతో వైద్య సేవ ద్వారా టిటిడి ఎన్నో ప్రాణాలను నిలబెడుతోంది.
