Tirumala: తిరుమలలో ఇకపై ఆ దందాకు చెక్.. సిఫారసు లేఖల విషయంలో కొత్త పాలక మండలి నిర్ణయం ఏంటి..?

ప్రజాప్రతినిధులు, విఐపిల సిఫారసు లేఖలతో దర్శనం టికెట్ల అమ్మకం.. మరోవైపు దళారీల ఏరివేతపై టీటీడీ పటిష్ఠ నిఘా కొనసాగుతోంది. పిఆర్ఓల పేరుతో కొనసాగుతున్న దర్శనం టికెట్లు అమ్మకం దందాపై విజిలెన్స్ కొరడా.. ఝుళిపిస్తోంది.. ఇదిలా ఉంటే మరోవైపు అసలు విఐపి సిఫారసు లేఖలపై ఒక్కొక్కరిది ఒక్కో వాదన.. సిఫారసు లేఖలు తీసుకోవాలని కొందరు, రద్దు చేయాలని మరి కొందరు వాదిస్తున్న తరుణంలో కొత్త పాలక మండలి నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.

Tirumala: తిరుమలలో ఇకపై ఆ దందాకు చెక్.. సిఫారసు లేఖల విషయంలో కొత్త పాలక మండలి నిర్ణయం ఏంటి..?
Tirumala
Follow us
Raju M P R

| Edited By: Shaik Madar Saheb

Updated on: Nov 01, 2024 | 9:35 PM

తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఒక్కొక్కరిది ఒక్కో ప్రయాస. ఎలాగైనా తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలన్న ఆత్రుత. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా వెంకన్న దర్శనం కోసం చేసే ప్రయత్నం కొందరు దళారులకు వ్యాపారంగా మారింది. ఇందులో భాగంగానే సిఫారసు లేఖలకు గిరాకీ నెలకొంది. ఆన్లైన్, ఆఫ్లైన్ లో శ్రీవారి దర్శనం టికెట్లు లభించని కొందరు భక్తులు, సిఫారసు లేఖలు దక్కని మరికొందరు అవసరమే ఆసరాగా తిరుమలలో దళారీల దందా కొనసాగుతోంది. కొండపై దళారు వ్యవస్థకు మంగళం పడేలా ఎన్నో చర్యలు చేపట్టిన టిటిడి పటిష్ట నిఘా కొనసాగిస్తోంది. అయినా ఏదో ఒకలా దళారీల దందా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే వీఐపీల సిఫారసు లేఖలు దళారీలకు ఆదాయ వనరుగా మారిపోయింది. ప్రజా ప్రతినిధులకు, ప్రముఖులకు పీఆర్వోలు, పీఏలుగా వ్యవహరిస్తున్న కొందరు దళారీలతో చేతులు కలిపి వెంకన్న దర్శనంలో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలా అడ్డంగా దొరికిపోతున్నారు.

ఇలా శ్రీవారి దర్శనం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు దర్శనం టికెట్లు, వసతి గదులు అధిక ధరలకు విక్రయించి జేబులు నింపుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక తిరుమల ప్రక్షాళన పై దృష్టి సారించడంతో తిరుమలలో దళారీల దందా కు కళ్లెం వేసేలా నిఘా పెరిగింది. టీటీడీ విజిలెన్స్ వింగ్, పోలీసు శాఖ సంయుక్తంగా దృష్టి సారించి దళారీలను ఏరి వేసే పని ప్రారంభమైంది. సి ఆర్ ఓ ఆఫీస్, జేఈవో కార్యాలయం, ఎంబీసీ 34, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ల వద్ద నిఘా పెరిగింది. అనుమానితులను అదుపులోకి తీసుకొని కూపీ లాగుతున్న విజిలెన్స్ వింగ్ దళారీ వ్యవస్థలో అసలు సూత్రధారుల పాత్రలను బయటపెడుతోంది. గత ఐదేళ్లుగా తిరుమలలో కొనసాగిన దళారీల దందాపై నమోదైన కేసులను పరిశీలిస్తోంది. 2019లో 50, 2020లో 34, 2021లో 46, 2022 లో 72, 2023లో 57, 2024లో ఇప్పటిదాకా 38 కేసులు నమోదయినట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4నెలల్లో 18 కేసులు నమోదు కాగా దళారులు, ఇతర మోసగాళ్ళ మోసాలపై 64 వరకు ఫిర్యాదులు విజిలెన్స్ కు వచ్చాయి. ఈ మధ్యనే వైసీపీ ఎమ్మెల్సీ పిఏ వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను రూ. 65 వేలకు విక్రయించినట్లు తిరుమల వన్ టౌన్ పిఎస్ లో కేసు నమోదు అయింది. పుదుచ్చేరి సీఎం కార్యాలయం నుంచి సిఫారసు లేఖను పొందిన దళారీ విఐపి బ్రేక్ దర్శనం టికెట్లను విక్రయించి అడ్డంగా దొరికిపోయాడు. ఇక తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం అతిథి గృహాల్లోనూ దళారీల దందా కొనసాగుతున్నట్లు విజినెస్ గుర్తించింది. లాకర్లు తీసుకునే భక్తులను బురిడీ కొట్టించిన ఆన్ లైన్ మోసగాడి వ్యవహారం కూడా వెలుగు చూసింది. ఆదార్ తో శ్రీవారి దర్శనం గదులను తరచూ తీసుకునే వారిని గుర్తించేందుకు టీటీడీ ఆధార్ సీడింగ్ ను కూడా ప్రారంభించబోతుంది. ఈ మేరకు అనుమతులు తీసుకున్న టిటిడి, రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయగానే పూర్తిస్థాయిలో ఆధార్ డేటాతో దళారులను గుర్తించే పని చేపట్టనుంది. దళారీలను ఏరివేసేందుకు టెక్నాలజీని కూడా అందుబాటులోకి టీటీడీ తీసుకురాబోతోంది. దళారులను గుర్తించేందుకు టోల్ ఫ్రీ నంబర్ 18004254141 ను కూడా అందుబాటులోకి తెచ్చింది టీటీడీ విజిలెన్స్.

ఒక్కొక్కరిది ఒక్కో వాదన

ఇక విఐపి సిఫారసు లేఖలే దళారీల దందా కు ఆదాయ వనరుగా మారిపోగా మరోవైపు సిఫారసు లేఖలపై ఒక్కొక్కరిది ఒక్కో వాదనగా మారిపోయింది. తెలంగాణ నుంచి వచ్చే విఐపి సిఫారసు లేఖలను అనుమతించని టీటీడీ వైఖరి పై ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల డిమాండ్ ఇప్పుడు చర్చగా మారింది. తెలంగాణ ప్రజా ప్రతినిధులు స్వయంగా వస్తే దర్శనం అవకాశం కల్పిస్తున్న టీటీడీ సిఫారసు చేస్తే అనుమతించని పరిస్థితి ఉంది. దీంతో ఆ రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలందరూ టీటీడీ తమ సిఫారసులను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రజా ప్రతినిధుల నుంచి ఒత్తిడి వస్తోంది.

తెలంగాణ నేతల అభ్యర్థనపై..

ఇలా సిఫారసు లేఖల వ్యవహారంపై తెలంగాణ ప్రజా ప్రతినిధుల వార్నింగ్ ను పట్టించుకోని టీటీడీ ఇప్పటిదాకా దీనిపై ఏ నిర్ణయము తీసుకోలేదు. అయితే సిఫారసు లేఖలపై కొందరు స్వామీజీల వాదన మరోలా ఉంది. అసలు విఐపి సిఫారసు లేఖలనే రద్దు చేయాలని డిమాండ్ వినిపిస్తున్నారు.. శ్రీవారి దర్శనంలో అందరూ సమానులే అని ఏపీ సాధు పరిషత్ స్వామీజీలు పేర్కొంటున్నారు.

ఇలా సిఫారసు లేఖల పై ఎవరి వాదన ఎవరిది కాగా, తిరుమలలో సిఫారసు లేఖలే కొందరు దళారీలకు పెట్టుబడిగా మారిపోయింది. దీంతో సిఫారసు లేఖల వ్యవహారం పై ఏపీ సర్కార్ నిర్ణయం ఏంటి, కొత్త పాలక మండలి ఈ సమస్యను ఎలా ఎదుర్కోబోతోందన్నదే సవాలుగా మారబోతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..