
చిత్తూరులో ఆడదాం ఆంధ్ర పోటీల్లో భాగంగా జరిగిన కబడ్డీ పోటీల్లో క్రీడాకారుల మధ్య గొడవ జరిగింది. కబడ్డీ జట్ల మధ్య డిష్యుం డిష్యుం కొనసాగింది. చిత్తూరులో ఈ రోజు ఉదయం నుంచి జిల్లా కబడ్డీ పోటీలు జరగ్గా 7 నియోజకవర్గాలకు చెందిన జట్లు పాల్గొన్నాయి. జిల్లాస్థాయి పోటీల్లో కుప్పం, పలమనేరు, పూతలపట్టు, చిత్తూరు, గంగాధర నెల్లూరు, నగరి, పుంగనూరు జట్లు తలపడ్డాయి. కబడ్డీ పోటీల్లో కుప్పం జట్టు తరపున తమిళనాడు రాష్ట్రం నుంచి క్రీడాకారులు పాల్గొన్నారని క్రీడాకారులు ఆరోపించడం వివాదాస్పదంగా మారిపోయింది.
క్రీడాకారుల సమక్షం లో ఈకేవైసీ చేయకుండా కబ్బడ్డి ఆడించారని క్రీడాకారుల ఆరోపించారు. నిన్న జరిగిన క్రికెట్ పోటీల్లో కుప్పం టీం తరఫున తమిళనాడు క్రీడాకారులు ఆడినట్లు గంగాధర నెల్లూరు టీం సభ్యులు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా నగిరి టీంను విజేతగా ప్రకటిస్తున్నారని గంగాధర నెల్లూరు నియోజకవర్గం టీం ఆరోపించింది.
ఈ రోజు జరిగిన కబడ్డీ పోటీల్లో నగిరి టీం ఆడకుండానే విజేతగా అధికారులు ప్రకటించారని నిలదీసే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా గంగాధర నెల్లూరు టీం సభ్యులు. డీఎస్ఎ స్టేడియం ముందు నిరసనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఘటన స్థలానికి చేరుకున్న చిత్తూరు ఆర్డీవో చిన్నయ్య, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డి లు క్రీడాకారులతో చర్చలు జరిపారు. క్రీడాకారుల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకొని నిర్వాహకులను ప్రశ్నించారు.