Tirupati By-Election: చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన.. కేసు నమోదు చేసిన తిరుపతి పోలీసులు..
Chandrababu Naidu: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న రోడ్‌షోలో సోమవారం
Chandrababu Naidu: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న రోడ్‌షోలో సోమవారం రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. తిరుపతిలోని గాంధీ రోడ్డు షోలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాయి విసిరారు. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని పేర్కొన్నారు. ఈ దాడిలో పలువురు గాయపడగా.. వాహనాలు కూడా ధ్వంసమయ్యయని వివరించారు. ప్రచారం చేయకుండా భయపెట్టాలని చూస్తున్నారని పేర్కొన్నారు. పకడ్భందీగా భద్రత కల్పించాలని.. ప్రచారం సజావుగా సాగేలా చూడాలని కోరారు. నరసింహా యాదవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపీసీ 324, 143, 427 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు.
కాగా.. తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ హోరాహోరిగా ప్రచారం చేస్తున్నాయి. రోడ్డు షోలో రాళ్ల దాడి అనంతరం చంద్రబాబు వైపీపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దమ్ముంటే ముందుకు రావాలని.. తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ నిప్పులు కక్కారు. అక్కడే భైఠాయించి ఆందోళన నిర్వహించారు. అనంతరం పోలీసులతో మాట్లాడారు. కాగా ఏప్రిల్ 17వ తేదీన తిరుపతి స్థానానికి, అదేవిధంగా నాగర్జునసాగర్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది.
Also Read: