Mangalagiri: లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం నాలుగు కాళ్ళ మండపం కోనేరులో బయటపడిన పిల్ల బావి..
మంగళగిరి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం నాలుగుకాళ్ళ మండపం వద నున్న కోనేరులో పిల్ల బావి బయటపడింది. స్వామి వారి పార్వేట ఉత్సవం నిర్వహించేందుకు ఈ నాలుగు కాళ్ళ మండపం వద్ద నున్న స్థలాన్ని ఉపయోగించేవారు
Mangalagiri Narasimha Swamy: మంగళగిరి లక్ష్మీ నరసింహా స్వామి ఆలయం నాలుగుకాళ్ళ మండపం వద నున్న కోనేరులో పిల్ల బావి బయటపడింది. స్వామి వారి పార్వేట ఉత్సవం నిర్వహించేందుకు ఈ నాలుగు కాళ్ళ మండపం వద్ద నున్న స్థలాన్ని ఉపయోగించేవారు. ఓ భక్తుడు ఏడెకరాల పొలాన్ని పార్వేట ఉత్సవం కోసం కానుకగా అందించాడు. అక్కడ నాలుగు కాళ్ళ మండపం, కోనేటిని నిర్మించారు. పార్వేట ఉత్సవం తర్వాత స్వామి విగ్రహాలకు ఈ కోనేటిలోనే స్నానం చేయించి తిరిగి మంగళగిరిలోని ఆలయానికి అర్చకులు తీసుకెళ్ళేవారు. అయితే కొంతకాలంగా ఈ మండపాన్ని, కోనేటిని ఉపయోగించడం లేదు. దీంతో అవి శిథాలావస్థకు చేరుకున్నాయి. లక్ష్మీ నరసింహా ఆలయానికి ఉన్న ప్రాముఖ్యత నేపధ్యంలో ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అభివృద్ది పనులు చేపట్టారు. ఆలయం ఎదురుగా ఉన్న చీకటి కోనేటిని శుభ్రం చేయించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా పార్వేట ఉత్సవానికి ఉపయోగించే కోనేటిని, మండపాన్ని అభివృద్ధి చేస్తున్నారు. కోనేటిలో పూడిక తీత చేపట్టిన కార్మికులకు లోపల పిల్ల బావి కనిపించింది. ఆ పిల్ల బావిలో కూడా మట్టి పేరుకుపోవటంతో శుభ్రం చేస్తున్నారు. కోనేరు లోపల పిల్ల బావి బయటపడటం ఆశ్చర్యానికి గురి చేసింది. సాధారణంగా ఇటువంటి పిల్ల బావులు ఉండవని నిపుణులు అంటున్నారు. అయితే పిల్ల బావి బయటపడటంతో ఎమ్మెల్యే ఆర్కే ఆ ప్రాంతాన్ని పరిశీలించి కోనేటిలో పూర్తి స్థాయి పూడిక తీయాలని ఆదేశించారు. అదే విధంగా నాలుగు కాళ్ళ మండపం చుట్టూ ప్రహారి నిర్మించాలని అధికారులకు సూచించారు. తిరిగి పార్వేట ఉత్సవాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు. ఈ మధ్య కాలంలో మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. చీకటి కోనేరు ప్రక్షాళన సమయంలోనూ వెంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహం, వినాయక రాతి విగ్రహం బయటపడ్డాయి. పార్వేట కోనేరులో బయటపడిన పిల్లబావిని అరుదైన నిర్మాణంగా అభివర్ణిస్తున్నారు.
రిపోర్టర్: టి నాగరాజు, టీవీ9 తెలుగు, గుంటూరు.
Also Read: పునీత్‌కు అమెజాన్ ప్రైమ్ ట్రిబ్యూట్.. ఫ్రీగా 5 సినిమాలు చూసే ఛాన్స్