Tiger fear in kakinada district: కాకినాడలో కాలుమోపిన పులి కదలనంటోంది. ఎన్ని ఎత్తుగడలు వేసినా, చిక్కనంటోంది. అధికారుల వ్యూహాలను తిప్పికొడుతోంది. అటవీశాఖ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పరిగెట్టిస్తోంది. అందినట్టే అంది అందకుండా పోతోంది. ఇంతకీ ఈ పులిరాజాని అడవి ఎందుకు తరిమేసింది? ఎక్కడి నుంచో వచ్చి, ఇక్కడే ఎందుకు తిష్ట వేసింది? ఇప్పుడిదే ప్రశ్న యావత్ ఆంధ్రాలో హల్‌చల్ చేస్తోంది. పులిని బంధించేందుకు ఎన్ని ఎత్తుగడలను వేసినా.. అవి చిత్తు చేస్తూ చిద్విలాసంగా ఉడాయిస్తోంది. కాకినాడ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను టైగర్ టెర్రరైజ్ చేస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు దాదాపు నెలరోజులుగా అధికారుల చేతికి చిక్కినట్టే చిక్కి, చిక్కకుండా పోతోన్న పులియుక్తికి అధికారులే అవాక్కవుతున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ, తప్పించుకు తిరుగుతోన్న పులి.. భయంతో పరిసర ప్రాంతాల జనం నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు.
సరిగ్గా 25 రోజుల క్రితం కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఎంట్రీ ఇచ్చింది పులి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అధికారులు పన్నిన వ్యూహాలన్నింటినీ తిప్పికొడుతోంది. దాదాపు నెల రోజులు కావస్తున్నా పులిజాడ దొరక్కపోవడంతో అధికారులు సతమతమవుతున్నారు. పెద్ద పులిని బంధించడం ఫారెస్ట్ అధికారులకి బిగ్ టాస్క్‌గా మారింది. దాని అడుగు జాడలను ఓ వైపు గుర్తిస్తే, అది మరో వైపు వెళ్ళిపోతోంది. నాలుగు అడుగుల పొడవు.. యుక్త వయసులో ఉన్న పలి అత్యంత తెలివిగా వ్యవహరిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రాణాలను కాపాడుకుంటూ చాలా తెలివిగా సంచరిస్తుంది.
కాకినాడ జిల్లాలోని పొదురుపాక, శరభవరం, ఒమ్మంగి, పాండవుల పాలెం పరిసరాల్లో పులి అడుగుజాడలు బెంబేలెత్తిస్తున్నాయి. ఎటువైపు నుంచి పులి పంజా విసురుతుందో తెలియక జనం హడలిపోతున్నారు. అందుకే ఈ ప్రాంతాల్లో బోనుల్లో మాంసాన్ని ఎరగావేసినా వచ్చినట్టే వచ్చి అడుగు దూరంలోనుంచి బోన్లను తప్పించుకొని పారిపోతోంది. అసలెందుకు ఈ పులి బెబ్బులి ఇక్కడికొచ్చింది? ఇంత పకడ్బందీ ప్రణాళికను కూడా ఎలా తప్పించుకుతిరగ్గలుగుతోంది? ఇప్పుడిదే ప్రశ్న కాకినాడ పరిసర ప్రాంతాల్లోని ప్రజలను హడలెత్తిస్తోంది.
ఇదే తొలిసారి..
అయితే.. పులిని పట్టుకోవడం ఇంత ఆలస్యం కావడం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు. ఎంత వేగం ఉన్నా, దాన్ని ఒడిసిపట్టుకోగలిగే వేటగాళ్ళున్నారు. అయినా దీని అంతుచిక్కడం లేదు. ఇంతకీ ఎందుకిలా వచ్చింది. ఎలా తప్పించుకుతిరుగుతోంది? అరణ్యాలను మింగేస్తే క్రూరమృగాలు జనారణ్యంలోకొస్తాయన్నది ఈ పులి రుజువు చేసింది. ఎక్కడో తప్పు జరిగింది. ఏదో పులిలో అలజడికి కారణమయ్యింది. అదే దాన్ని అడవి దారితప్పేలా చేసింది.
కారణాలేవైనా ఒకటి కాదు రెండు కాదు 11 గ్రామాల ప్రజలు.. ప్రాణాలరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. గత 25 రోజులుగా నాన్‌స్టాప్‌గా వేటాడుతున్నా దాన్ని బంధించడం ఎవరి తరం కావడంలేదు. సహజంగానే పులి 40 కిలో మీటర్ల పరిధిని తన అడ్డాగా మలుచుకుంటుంది. ఇక్కడా అదే జరిగింది. తనదైన ప్రత్యేక భూభాగాన్ని నిర్ణయించుకుంది ఈ టైగర్. అక్కడే మకాం వేసింది. ఆకలిగా ఉంటేనే వేటాడడం పులి లక్షణం. వేడి నెత్తురు మాత్రమే పులి గుర్తెరిగిన రుచి. అందుకే బోన్లలో వేసిన మాంసాన్ని ముట్టనుకూడాలేదు. ఇప్పటికి ఐదు పశువులపై దాడిచేసింది. ఇంకా అంతుచిక్కని ఈ పులి కథ ఎప్పుడు సుఖాంతం అవుతుందో తెలియని జనం బెంబేలెత్తిపోతున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..