AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆలయంలో ప్రమాదంపై త్రిసభ్య కమిటీ విచారణ.. బయటపడ్డ కీలక అంశాలు

సింహాచలం దుర్ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణలో ఏం తేలింది? ఇంజనీర్ల ఒత్తిడితోనే, కాంట్రాక్టర్‌ తప్పటడుగు వేశారా? ఆదరబాదరాగా నాసిరకం గోడ నిర్మించి, ఏడుగురు ప్రాణాలు పోయేందుకు కారణమయ్యారా? నామ్‌కేవాస్తే నిర్వాకం, నిర్మాణం భక్తుల ప్రాణాలు తీసిందా? ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఆలయంలో ప్రమాదంపై త్రిసభ్య కమిటీ విచారణ.. బయటపడ్డ కీలక అంశాలు
Simhachalam Incident
Ravi Kiran
|

Updated on: May 01, 2025 | 9:55 PM

Share

సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. గోడ కూలిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు కమిటీ సభ్యులు. ఘటనా స్థలంలో శాంపిల్ష్‌ సేకరించారు. ఆనంద నిలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింహాచలంలో నిర్మాణాలు, చందనోత్సవ ఏర్పాట్లు, గోడ కూలిన ఘటనపై ఆరా తీశారు. దేవస్థానం, టూరిజం ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. పర్యాటక శాఖ డీఈ రమణను అరగంట పాటు విచారించారు. ప్రసాదం స్కీమ్ కింద సింహాచలంలో టూరిజంశాఖ చేపట్టిన నిర్మాణాలపై ఆరా తీశారు. గోడను ఎప్పుడు నిర్మించారు. ఎవరు నిర్మించారన్న విషయాలపై ఆరా తీశారు. విచారణ సమయంలో కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు వీడియోగ్రఫీ చేశారు. రెండు రోజుల్లో త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది. 30 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక సమర్పించనుంది.

మరోవైపు సింహాచలంలో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు వైసీపీ నేతలు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేతృత్వంలోని వైసీపీ బృందం గోడకూలిన ప్రాంతాన్ని పరిశీలించింది. ప్రభుత్వ పబ్లిసిటీ పిచ్చి భక్తులకు ప్రాణసంకటంగా మారిందని మండిపడ్డారు వైసీపీ నేతలు. గురువారం సింహాచలంలో మృతుల కుటుంబాలను పరామర్శించిన వైఎస్ జగన్ కూడా ప్రభుత్వ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడ నిర్మాణంలో నాణ్యతాలోపం స్పష్టంగా కనిపిస్తుందని ఆరోపించారు జగన్.

భక్తుల రద్దీ పెరగడం వల్లే దుర్ఘటన చోటుచేసుకుందంటున్నారు టీడీపీ నేతలు. వైసీపీ హయాంలో కన్నా కూటమి పాలనలో దేవాలయాల నిర్వహణ మెరుగుపడిందన్నారు. అందుకే భక్తుల తాకిడి పెరిగిందంటున్నారు టీడీపీ నేతలు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామంటున్నారు.