AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amaravati Re-Launch: అమరావతి పునఃప్రారంభానికి సర్వం సిద్ధం.. నేటి ప్రధాని షెడ్యూల్ ఇలా

అమరావతి మళ్లీ ముస్తాబవుతోంది. అర్ధాంతరంగా ఆగిన తన ప్రయాణాన్ని.. మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించబోతోంది. అందుకేనేమో, నవ్యాంధ్ర నవచరితగా మిగిలిపోనున్న ఈ ఉత్సవాన్ని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పనుల పునఃప్రారంభం మొదలు.. ప్రధాని సభ వరకు.. అదిరిపోయేలా ఏర్పాట్లు చేసింది. ఇంతకీ పీఎం షెడ్యూల్‌ ఏంటి? ఆయన టూర్‌ విశేషాలేంటి?

Amaravati Re-Launch: అమరావతి పునఃప్రారంభానికి సర్వం సిద్ధం.. నేటి ప్రధాని షెడ్యూల్ ఇలా
Pm Modi Amaravati Relaunch
Ram Naramaneni
|

Updated on: May 02, 2025 | 10:11 AM

Share

యావత్‌ దేశం దృష్టి ఇప్పుడు అమరావతి పునఃప్రారంభంపై కేంద్రీకృతమైంది. ఐదేళ్లక్రితం అట్టహాసంగా మొదలై.. ఆ తర్వాత అర్ధాంతంగా నిలిచిపోయిన అమరావతి పనులు.. మరోసారి ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుండటంతో భారీస్థాయిలో ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అమరావతి పునః ప్రారంభం మొదలు.. మోదీ బహిరంగసభ వరకు.. ఏర్పాట్లలో ఏ చిన్న పొరపాటు జరగకుండా మంత్రులు, ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

మధ్యాహ్నం 2.55.. గన్నవరం ఎయిర్‌పోర్టుకు మోదీ

ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ప్రధాని మోదీకి.. మంత్రులు కూటమినేతలు స్వాగతం పలకనున్నారు. ఎయిర్ పోర్ట్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా 3గంటల 15నిమిషాలకు వెలగపూడి సచివాలయం దగ్గరికి చేరుకోనున్న ప్రధానికి.. అక్కడ చంద్రబాబు, పవన్‌లు వెల్‌కమ్‌ చెబుతారు. ఆ తర్వాత హెలిప్యాడ్‌ నుంచి సభావేదిక వరకు.. ప్రధాని రోడ్‌షో కూడా ఉండనుంది. ఇరువైపులా ప్రజలకు అభివాదం చేస్తూ.. సభాస్థలికి రానున్నారు మోదీ. సభాస్థలికి చేరుకుని అమరావతి పున: ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అమరావతి పునః ప్రారంభవేదిక నుంచే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన రాష్ట్ర, కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ.

అమరావతి రీలాంచ్‌కు గుర్తుగా పైలాన్‌

అమరావతి రీ లాంచ్ కు సంకేతంగా.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పైలాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అమరావతి ఇంగ్లీషు పదంలోని మొదటి అక్షరం A ఆకారంలో ఈ పైలాన్‌ను ఏర్పాటు చేశారు. 21 అడుగుల ఎత్తుతో, పూర్తి గ్రానైట్ స్టోన్‌తో ఈ పైలాన్‌ను నిర్మించారు.

ప్రత్యేక ఆకర్షణగా మొబైల్‌ స్క్రాప్‌ మోదీ విగ్రహం

ప్రధాని సభావేదిక వద్దకు వెళ్లే సమయంలో… ఏర్పాటు చేసిన ప్రత్యేక విగ్రహం, మరో ఆకర్షణగా నిలుస్తోంది. ఆటో మొబైల్ స్క్రాప్‌తో తయారుచేసిన మోదీ విగ్రహం… స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలవబోతోంది. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరావు, ఆయన తనయులు కలిసి ఈ అద్భుతమైన విగ్రహాన్ని రూపొందించారు. మోదీ విగ్రహంతో పాటు ఎన్టీఆర్, బుద్దుడు, సింహం, సైకిల్‌ సింబల్స్‌ని ఐరన్ స్క్రాప్‌తోనే తయారు చేసి ఉంచారు.

రాజధాని రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు

ఇక, రాజధాని పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి.. రైతులకు ఆహ్వానం పలికారు చంద్రబాబు. రాష్ట్ర చరిత్రలో కీలక మలుపు కాబోతున్న అమరావతి పునఃప్రారంభం కార్యక్రమంలో భాగం కావాలంటూ తులను కోరిన చంద్రబాబు.. వారి మంచి మనసును రాష్ట్ర ప్రజలు కలకాలం గుర్తుంచుకుంటారని చెప్పారు. ఉండవల్లిలోని తన నివాసంలో రైతులతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం.. పలు అంశాలపై వారితో చర్చించారు.

అన్నదాతలతో పాటు అతిరథులకు ఆహ్వానం

భూములిచ్చిన అన్నదాతలే కాదు, అతిరథులు సైతం.. ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, బాలకృష్ణ, మెగాస్టార్‌ చిరంజీవి తదితర ప్రముఖులు మోదీతో వేదిక పంచుకోనున్నారు. 30 మంది రాజధాని రైతులకు, మహిళలకు మోదీతో కలిసి వేదికపై కూర్చునే అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి అందరేఊ ఆహ్వానితులేనని ప్రకటించిన ప్రభుత్వం… ప్రధాని సభకు ఐదు లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా వేస్తోంది. అందుకు తగట్టే ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది.

మాజీ సీఎం జగన్‌కూ ప్రభుత్వ ఆహ్వానం

ఈ ఉత్సవానికి హాజరు కావాలంటూ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కూడా ఆహ్వానం పంపింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రొటోకాల్‌ అధికారులు.. ఇప్పటికే జగన్‌ను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇప్పుడిదే అంశం పొలిటికల్‌గా ఆసక్తిరేపుతోంది. ప్రధాని మోదీ పాల్గొంటున్న ఈ మహత్తర కార్యక్రమానికి.. జగన్‌ వస్తారా? రారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

గంటా 15 నిమిషాల పాటు మోదీ పర్యటన

మొత్తంగా గంటా 15నిమిషాల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొననున్న మోదీ.. సాయంత్రం 4గంటల 55 నిమిషాలకు హెలికాఫ్టర్ ద్వారా గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని…అక్కడి నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.