Guntur district news: స్మశానాలకు రక్షణ కల్పించండి.. అంటూ వేడుకుంటున్నారు అక్కడి స్థానికులు.. స్మశానాల్లో ఏముంటాయి, అక్కడ రక్షణ ఎందుకు కల్పించాలని అనుకుంటున్నారా..? అయితే, గుంటూరులోని తాడేపల్లికి చెందిన ఈ స్టోరీ చదవాల్సిందే.. తాడేపల్లి మండలంలోని మెళ్ళంపూడి, గుండిమెడల్లో తెల్లవారుతూనే స్థానికులు ఉలిక్కి పడ్డారు. ఎందుకంటే ఆ ఊర్ల స్మశాన వాటికలో దొంగలు పడ్డారు. ఆశ్చర్యపోతున్నారా.. మీరు విన్నది నిజమే.. స్మశానాల్లో దొంగలు పడ్డారు. మృతదేహాలను కాల్చడానికి ఏర్పాటు చేసిన ఐరన్ బెడ్స్ కడ్డీలను అపహరించుకుపోయారు. ఏకంగా రెండు గ్రామాల్లోని స్మశాన వాటికల్లో ఇదే తరహా దొంగతనాలు చేశారు. దీంతో స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
వీళ్ళేం దొంగలురా బాబు స్మశానాలపై పడ్డారని చర్చించుకుంటున్నారు స్థానికులు.. ఒక్కో బెడ్ లో యాభై వేల రూపాయలు విలువ చేసే ఇనుప కమ్మీలుంటాయని నిర్వాహకులు పేర్కొంటున్నారు. దీంతో వీటిని టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారని పేర్కొంటున్నారు.
వారం రోజుల క్రితం తాడేపల్లి మండలం పెనమాకలోని స్మశాన వాటికలోనూ ఇదే తరహా దొంగతనం చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది మర్చిపోకముందే మరో రెండు గ్రామాల్లోని స్మశాన వాటికల్లోనూ చోరికి పాల్పడ్డారు. దీంతో ఆయా గ్రామాల్లోని స్మశాన వాటిక నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు.
ఒక్కో బెడ్ ను తిరిగి ఏర్పాటు చేయాలంటే లక్ష రూపాయల వరకూ ఖర్చవుతుందంటున్నారు. పోలీసుల ఇప్పటికైనా దృష్టి సారించి దొంగలను పట్టుకోవాలని ప్రాధేయపడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..