Andhra Pradesh: శ్రీకాకుళం టూ అనంతపురం వయా రాజమహేంద్రవరం.. మంత్రుల బస్సు యాత్రకు సర్వం సిద్ధం
సామాజిక న్యాయభేరి నాదం ప్రతిధ్వనించేలా, పక్కా ప్లాన్‌తో ప్రజల్లోకి వెళ్తోంది వైసీపీ. బడుగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం, జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించేందుకు బస్సు యాత్ర(Bus Yatra) చేపట్టనుంది. రేపటి నుంచి...
సామాజిక న్యాయభేరి నాదం ప్రతిధ్వనించేలా, పక్కా ప్లాన్‌తో ప్రజల్లోకి వెళ్తోంది వైసీపీ. బడుగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం, జగన్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను వివరించేందుకు బస్సు యాత్ర(Bus Yatra) చేపట్టనుంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్రకు సర్వం సిద్ధం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా, కేబినెట్‌లో 17 మంది బడుగు బలహీన వర్గాల నేతలకు మంత్రి పదవులిచ్చారు సీఎం జగన్. ఇదే కాకుండా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారికి అనేక నామినేటెడ్ పదవులు ఇచ్చి ప్రోత్సహించారు. అటు సంక్షేమ పథకాలు కూడా ఎక్కువగా బడుగుల ఉన్నతికి ఉపకరించేలా ప్లాన్ చేశారు. వీటన్నింటిని ప్రజలకు వివరించడానికే, సిక్కోలు నుంచి అనంతపురం వరకు వైసీపీ మంత్రుల(YCP Ministers) సామాజిక న్యాయ భేరీ రథం బయల్దేరబోతోంది. శ్రీకాకుళం ఏడు రోడ్ల జంక్షన్ నుంచి రేపు బయల్దేరనున్న మంత్రుల బస్సు యాత్ర, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలను చుట్టేసి, గోదావరి తీరం మీదుగా కోస్తాలోకి ఎంటర్ అవుతుంది. అక్కడినుంచి రాయలసీమ(Rayala Seema) జిల్లాల్లో ప్రయాణాన్ని సాగించి, అనంతపురం వేదికగా, అనంతమైన గళంతో, సామాజిక న్యాయ గర్జనను వినిపించనున్నారు మంత్రులు. ఈ యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి అయ్యాయి. యాత్రకు కావాల్సిన బస్‌ను హైదరాబాద్‌లో సిద్ధం చేశారు.
మంత్రుల బస్సు యాత్రలో భాగంగా, విజయనగరం జిల్లాలో తొలి బహిరంగ సభ, రాజమండ్రిలో రెండో బహిరంగ సభ, నర్సరావుపేటలో మూడో బహిరంగ సభ, అనంతపురంలో నాలుగో బహిరంగ సభ నిర్వహించి, యాత్రను ముగించాలని మంత్రులు సీఎం జగన్ దగ్గర ప్రతిపాదించగా, అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం జగన్. ఈ బస్సు యాత్రలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో బలహీనవర్గాలకు ఉంటున్న ప్రాధాన్యం, అందుతున్న పథకాలను ప్రజలకు వివరించనున్నారు మంత్రులు. మంత్రులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన నేతలు కూడా బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో కీలక నేతలు, మంత్రులు ఈ బస్సు యాత్ర విజయవంతం అయ్యేలా సన్నాహక సమావేశాలు కూడా నిర్వహించారు.
ఈ బస్సు యాత్రకు ఓ విశేషం ఉంది. జగన్ లేకుండా మంత్రులు చేస్తున్న తొలియాత్ర ఇది. దీంతో జనం నుంచి స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా సామాజిక న్యాయభేరీతో, ఏపీ అంతటా సమరభేరీ మోగించడానికి మంత్రులు సమాయత్తం కావడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. అటు రాజకీయ పార్టీలకు శ్రీకాకుళం జిల్లా సెంటిమెంట్ అనే ప్రచారం ఉంది. ఈ యాత్ర కూడా శ్రీకాకుళం నుంచే ప్రారంభం కావడం లక్కీగా చెబుతున్నారు వైసీపీ నేతలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి