Andhra Pradesh: కొట్టడానికి చేతులెలా వచ్చాయి.. చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఉపాధ్యాయుడు..

| Edited By: Shaik Madar Saheb

Aug 01, 2023 | 5:27 PM

తన బిడ్డ పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదులగూడెంలో చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా ఈదులగూడెం గ్రామానికి చెందిన కోలుసు మౌనిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నది. అయితే ఏదైనా పొరపాటు చేస్తే మందలించాల్సిన ఉపాధ్యాయుడే కర్కశంగా ప్రవర్తించాడు.

Andhra Pradesh: కొట్టడానికి చేతులెలా వచ్చాయి.. చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేసిన ఉపాధ్యాయుడు..
Eluru District News
Follow us on

ఏలూరు, ఆగస్టు 1: చదువు చెప్పి, ఉన్నత విలువలను నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే.. చిన్నారి బాలిక పట్ల అమానుషంగా ప్రవర్తించాడు. చిన్నపిల్ల అనే జాలి, దయ, కనికరం లేకుండా విచక్షణారహితంగా విద్యార్థినిపై దాడికి తెగబడ్డాడు. ఉపాధ్యాయుడి దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆ చిన్నారి బాలిక తండ్రి.. తన బిడ్డ పట్ల అమానుషంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదులగూడెంలో చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా ఈదులగూడెం గ్రామానికి చెందిన కోలుసు మౌనిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్నది. అయితే ఏదైనా పొరపాటు చేస్తే మందలించాల్సిన ఉపాధ్యాయుడే కర్కశంగా ప్రవర్తించాడు. చిన్నారి మౌనికను ఓ కర్ర తీసుకొని విచక్షణారహితంగా శరీరంపై, తలపై కొట్టాడు. దీంతో బాలిక శరీరంపై వాతలు తేలడంతో పాటు, బాలిక ఒక చెవి వినిపించడం లేదని బాలిక తెలిపింది. అయితే, తన కుమార్తెపై అత్యంత పాశవికంగా దాడి చేసిన ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని చిన్నారి తండ్రి సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అదేవిధంగా, గతంలోనూ తన కుమార్తెపై ఇదే రీతిలో ఉపాధ్యాయుడు దాడి చేశాడని సురేష్ చెబుతున్నారు. చిన్నారులను అక్కున చేర్చుకుని వారికి ప్రేమగా విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు వారికి కాలయముడులా మారిపోవడం ఎంటంటూ ప్రశ్నిస్తున్నాడు. ఉపాధ్యాయుడి ప్రవర్తనతో తోటి చిన్నారులు సైతం స్కూలుకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. చిన్నారులు ఏదైనా తప్పు చేస్తే సున్నితంగా మందలించడం, ప్రేమతో వారికి అర్థమయ్యేలా చెప్పడం లాంటివి చేయాలి.. కానీ.. ఈ విధంగా చేయడం అన్యాయమని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయుడిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

చిన్నారి పట్ల కర్కశంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు సమాచారం. దీనిపై వివరణ ఇవ్వాలని ఉపాధ్యాయుడిని ఆదేశించినట్లు పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..