ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. ఇప్పటికే మొదటి రోజు అసెంబ్లీకి 236 నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్ సభకు 46 నామినేషన్లు దాఖలయినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ప్రకటించారు. అయితే ప్రధాన పార్టీల అభ్యర్ధులు రాబోయే మూడు నాలుగు రోజుల్లో నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక సీఎం జగన్మోహన్ రెడ్డి ఈనెల 25న పులివెందులలో నామినేషన్ వేయనున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈనెల 23న పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ల కార్యక్రమం ప్రారంభం కావడంతో ఇక ప్రచారం కూడా ఊపందుకోనుంది. ఇప్పటికే జనసేన అభ్యర్ధులకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బీ-ఫారంలు అందించారు.
ఇక కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించి అసెంబ్లీ, లోక్ సభ స్థానాల అభ్యర్ధులకు ఇప్పటికే నామినేషన్ పత్రాలు అందించారు. నామినేషన్ల దాఖలు సమయంలో, అఫిడవిట్లు సమర్పించేటప్పుడు ఎలాంటి చిక్కులు లేకుండా న్యాయనిపుణులను అందుబాటులో ఉంచారు. కొంతమంది తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులు కూడా ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేయగా.. మిగిలిన వారికి ఈనెల 21వ తేదీన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫారం – బీ లను అందించనున్నారు. ఈనెల 22 నుంచి 25 వరకు టీడీపీ అభ్యర్ధులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఆ నాలుగు రోజులు మంచి ముహూర్తాలు కావడంతో ఎక్కువగా నామినేషన్లు వేసే అవకాశం ఉంది. అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో సీట్ల విషయంలో ఉన్న గందరగోళానికి తెరదించాలని చంద్రబాబు నిర్ణయించారు. శనివారంలోగా పలు స్థానాల అభ్యర్ధులను మార్పు చేసేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో తెలుగుదేశం పార్టీలో కొన్ని స్థానాల్లో అభ్యర్ధుల మార్పుపై చంద్రబాబు దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వీటిలో అత్యంత కీలకంగా మారిన ఉండి అసెంబ్లీ స్థానం ఒకటి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తూ అప్పట్లోనే మాజీ ఎమ్మెల్యే శివరామరాజు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది చాలదన్నట్లు కొత్తగా రఘురామకృష్ణం రాజుకు కూడా టిక్కెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో చేసేదేమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో రామరాజుకు బదులు రఘురామ కృష్ణరాజుకు టిక్కెట్ ఇస్తున్నట్లు చంద్రబాబు ఇప్పటికే పార్టీ నేతలకు చెప్పినట్లు సమాచారం. అయితే రామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడి పదవి ఇస్తారని తెలిసింది. ఇక టీడీపీ తప్పనిసరిగా మార్పు చేయాల్సిన స్థానం అనపర్తి. ఇక్కడ ఇప్పటికే బీజేపీకి టిక్కెట్ కేటాయించారు.
ఈ స్థానం బదులు బీజేపీకి దెందులూరు స్థానం ఇచ్చేలా దాదాపు నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దెందులూరులో ఇప్పటికే చింతమనేని ప్రభాకర్‌ను అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆయనకు నచ్చజెప్పి బీజేపీకి టిక్కెట్ ఇచ్చేలా టీడీపీ అధిష్టానం ముందుకెళ్తుంది. ఇక మాడుగుల లో కూడా ఇప్పటికే ప్రకటించిన పైలా ప్రసాద్‌కు బదులు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానారాయణ మూర్తిని రంగంలోకి దింపుతున్నారు చంద్రబాబు. అటు మడకశిర అభ్యర్ధి అనిల్ కుమార్ స్థానంలో ఎంఎస్ రాజుకు అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. తంబళ్లపల్లె అభ్యర్ధి జయచంద్రారెడ్డికి టిక్కెట్ ఇవ్వడంపై పెద్ద ఎత్తున నిరసన రావడంతో ఇక్కడ శంకర్ యాదవ్ లేదా వేరే అభ్యర్ధికి టిక్కెట్ ఇచ్చే అవకాశాలున్నాయి. ఈ స్థానాలపై శనివారంలోగా అధికారిక ప్రకటన చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..