Andhra Pradesh TDP: అలా ఉంటే ఊరుకునే పరిస్థితే లేదు.. సొంత పార్టీ నేతలకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్..
Andhra Pradesh TDP: సొంత పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇకనుంచి పార్టీలో గ్రూప్‌లకు చెక్ పడాల్సిందేనని
Andhra Pradesh TDP: సొంత పార్టీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఇకనుంచి పార్టీలో గ్రూప్‌లకు చెక్ పడాల్సిందేనని, ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ.. అప్పుడే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు.. బాదుడే బాదుడు కార్యక్రమం, మహానాడుతో మంచి జోష్‌లో ఉన్నారు. అయితే, ఇదే సమయంలో పార్టీలోని అంతర్గత వ్యవహారాలపై ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఇందులో భాగంగానే.. తెలుగుదేశం పార్టీలో గ్రూపు రాజకీయాలను ఇకపై సహించేది లేదని, గట్టిగా చెప్పారు. ఈ విషయంలో ఏ ఒక్కరికి కూడా మినహాయింపు లేదని స్పష్టం చేశారు చంద్రబాబు.
పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన బాబు, కీలక అంశాలను ప్రస్తావించారు. ఎన్నికలకు రెండేళ్లు మాత్రమే గడువు ఉందని, పార్టీ నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయని వివరించారు. ఇటీవలే ముగిసిన టీడీపీ మహానాడును ప్రస్తావించిన చంద్రబాబు, అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కసిగా ఉన్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రూపు రాజకీయాలు పార్టీకి తీరని నష్టం చేస్తాయని వార్నింగ్ ఇచ్చారు. పార్టీలో గ్రూప్ రాజకీయాలను ఎవరూ ప్రోత్సహించొద్దని స్పష్టం చేశారు. పార్టీ శ్రేయస్సును పక్కనపెట్టి గ్రూపు రాజకీయాలకు దిగే నేతలు ఎవరైనా కూడా సహించబోమని హెచ్చరించారు టీడీపీ చీఫ్. అటు ఓటర్ల తొలగింపుపై స్థానిక నేతలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు దీనిపై వివరాలు తెలుసుకోవాలని చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి, అక్రమాలపై స్థానికంగా పోరాటం చేయాలని సూచించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మరోసారి స్పష్టం చేశారు చంద్రబాబు. కార్యకర్తల ఉత్సాహానికి అనుగుణంగా, నేతలు ఉండాలని స్పష్టం చేశారు.