Andhra: చూశారా మావ.. ఈదురుగాలికి ఏకంగా టోల్‌గేట్ 100 మీటర్ల దూరం కొట్టుకుపోయింది..
మార్కాపురం జిల్లాలో అకాల వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. త్రిపురాంతకం మండలం మేడపి వద్ద జాతీయ రహదారిపై ఉన్న భారీ టోల్‌ప్లాజా గాలిదుమారానికి వంద మీటర్ల దూరం ఎగిరిపడి పూర్తిగా ధ్వంసమైంది. ఘటన సమయంలో రోడ్డుపై వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పగా, సిబ్బంది పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు.

కాలం కాని కాలంలో కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులతో కలిసి బీభత్సం సృష్టిస్తున్నాయి. మార్కాపురం జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. జాతీయ రహదారిపై ఉన్న భారీ టోల్‌ప్లాజా గాలిదుమారానికి గాల్లోకి ఎగిరి వంద మీటర్ల దూరం వరకు కొట్టుకుపోయి నేలకూలింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో రోడ్డుపై వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. టోల్‌ప్లాజా సిబ్బంది కూడా అప్రమత్తమై బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు.
మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు తీవ్ర బీభత్సం సృష్టించాయి. మేడపి సమీపంలోని జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన భారీ టోల్‌ప్లాజా ఈదురు గాలుల తీవ్ర తాకిడికి తట్టుకోలేక కూలిపోయింది. గాల్లోకి ఎగిరిన టోల్‌ప్లాజా నిర్మాణం సుమారు వంద మీటర్ల దూరంలో పడిపోవడంతో అది పూర్తిగా ధ్వంసమైంది.
టోల్‌ప్లాజా జాతీయ రహదారికి అడ్డంగా పడిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇదే సమయంలో అటుగా వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అక్కడ ఆగి పరిస్థితిని పరిశీలించారు. టోల్‌ప్లాజా సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
టోల్‌ప్లాజా కూలిపోతున్న సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అప్రమత్తంగా బయటకు పరుగులు తీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మరోవైపు యర్రగొండపాలెం మండలంలో కూడా భారీ వర్షాలు, పెను ఈదురుగాలులు ప్రజలను భయాందోళనలకు గురిచేశాయి. గాలుల తీవ్రతకు కొంతసేపు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడిపోయారు.
