AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wolf: అడవికి రాజు సింహం కావచ్చు.. కానీ తోడేలు ఎవరికీ బానిస కాదు!

స్వేచ్ఛ, క్రమశిక్షణ, గుంపుపై అపారమైన విశ్వాసానికి తోడేళ్లు ప్రతీకలుగా నిలుస్తాయి. కుక్కలతో ఒకే జాతికి చెందినప్పటికీ, తోడేళ్లు తమ సహజ స్వభావాన్ని కోల్పోకుండా గుంపు బంధానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. వేటలో సమన్వయం, పిల్లల రక్షణ, ప్రమాదాలపై అప్రమత్తత వంటి లక్షణాలతో వాటి జీవన విధానం ప్రత్యేకంగా నిలుస్తోంది.

Wolf: అడవికి రాజు సింహం కావచ్చు.. కానీ తోడేలు ఎవరికీ బానిస కాదు!
Wolfs
Ram Naramaneni
|

Updated on: May 21, 2026 | 11:38 AM

Share

అడవికి రాజు సింహం కావచ్చు.. కానీ తోడేలు మాత్రం ఎవరికీ సులభంగా బానిస కాదు. స్వేచ్ఛ, క్రమశిక్షణ, గుంపుపై విశ్వాసం అనే లక్షణాలకు ప్రపంచవ్యాప్తంగా తోడేళ్లను ప్రతీకగా చూస్తారు. వాటి జీవన విధానం, సామాజిక నిర్మాణం ఇతర అడవి జంతువులతో పోలిస్తే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. తోడేళ్లు సాధారణంగా “ప్యాక్” అనే గుంపులుగా జీవిస్తాయి. ఈ గుంపులో అనుభవం ఉన్న వయసు పైబడిన తోడేళ్లు దిశానిర్దేశం చేస్తుంటాయి. వేట, ప్రమాదాల గుర్తింపు, మార్గాల ఎంపికలో వాటి అనుభవం గుంపుకు ఎంతో ఉపయోగపడుతుంది. యువ తోడేళ్లు గుంపు రక్షణలో చురుకుగా ఉంటాయి. పిల్ల తోడేళ్లను కాపాడుతూ, ప్రమాద సమయాల్లో గుంపుగా కదలడం వాటి ప్రత్యేకత. పరిస్థితిని బట్టి గుంపులోని తోడేళ్ల స్థానాలు మారినా, అప్రమత్తత విషయంలో మాత్రం అవన్నీ ఒకేలా పనిచేస్తాయి. ఏదైనా ప్రమాదం కనిపిస్తే వెంటనే గుర్రుమంటూ మిగతా గుంపును హెచ్చరిస్తాయి. ఆ తర్వాత చిన్నవాటిని, బలహీనమైన వాటిని రక్షించేలా సమన్వయంతో కదులుతాయి.

తోడేళ్లు, కుక్కలు రెండూ ఒకే కెనైడ్ కుటుంబానికి చెందినవే. అయితే వేల సంవత్సరాలుగా కుక్కలు మనుషులతో కలిసి జీవిస్తూ మచ్చిక జంతువులుగా మారిపోయాయి. తోడేళ్లు మాత్రం ఇప్పటికీ తమ సహజ స్వభావాన్ని ఎక్కువగా నిలుపుకున్నాయి. చిన్నప్పటి నుంచి పెంచినా, అవి పూర్తిగా కుక్కల్లా విధేయంగా మారడం చాలా అరుదు. అందుకే సర్కస్‌లు లేదా సాధారణ పెంపుడు జంతువుల ప్రపంచంలో తోడేళ్లు చాలా తక్కువగా కనిపిస్తాయి. అవి మనుషుల కంటే తమ గుంపు బంధానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి.

తోడేలు జీవితం క్రమశిక్షణకు కూడా ఉదాహరణగా చెబుతారు. గుంపులో ప్రతి తోడేలు తన స్థానాన్ని అర్థం చేసుకొని ప్రవర్తిస్తుంది. వేటలోనూ, ప్రయాణాల్లోనూ ఒక సమన్వయం కనిపిస్తుంది. చాలా సందర్భాల్లో తోడేళ్ల జంటలు దీర్ఘకాలం కలిసి జీవిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి. పిల్లలను సంరక్షించడం, గుంపుగా ఆహారం పంచుకోవడం వంటి లక్షణాలు వాటిలో బలంగా కనిపిస్తాయి. వృద్ధ తోడేళ్లను కూడా గుంపు పూర్తిగా వదిలేయకుండా చూసుకునే స్వభావం వాటిలో కనిపిస్తుంది.

సాధారణంగా తోడేళ్లు మనుషులకు దూరంగానే ఉండేందుకు ప్రయత్నిస్తాయి. ఆహారం తీవ్రంగా లేకపోవడం, రాబిస్ వంటి వ్యాధులు సోకడం, లేదా తమ ప్రాంతంలో మనుషుల జోక్యం ఎక్కువవడం వంటి పరిస్థితుల్లో మాత్రమే దాడి చేసే అవకాశాలు పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదైన ఘటనలు చూస్తే, ఇతర క్రూర జంతువులతో పోలిస్తే తోడేళ్ల దాడులు చాలా తక్కువగానే ఉంటాయని వన్యప్రాణి నిపుణులు చెబుతున్నారు. అందుకే తోడేళ్లను చాలామంది కేవలం క్రూర జంతువులుగానే కాకుండా.. స్వేచ్ఛను వదులుకోని జీవులుగా కూడా చూస్తారు. వాటి జీవన విధానం మనకు గుంపు బలం, క్రమశిక్షణ, అప్రమత్తత, కుటుంబ బంధం వంటి అనేక విషయాలను గుర్తు చేస్తుంది.

తీవ్రమైన పొత్తి కడుపు నొప్పితో ఆస్పత్రికి వ్యక్తి.. టెస్టులు చేసిన వైద్యులే షాక్..

Follow Us