Srisailam: శ్రీశైలం ఘాట్ రోడ్డు ఎప్పుడు వేశారో తెలుసా.. ఒకప్పుడు ఎలా ఉండేదంటే..?
1955కు ముందు నల్లమల గుండా శ్రీశైలం ప్రయాణం అత్యంత దుర్గమంగా ఉండేది. వన్యమృగాల బెడద, కారడవి మార్గంలో భక్తులకు కష్టాలు తప్పలేదు. 1950లో అప్పటి మద్రాసు సీఎం, ఆర్థిక మంత్రులు ఘాట్ రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక చేశారు. 1955-57లో రూ. 69 లక్షల వ్యయంతో 49 కిలోమీటర్ల ఈ రహదారి పూర్తయింది.

75 ఏళ్ల క్రితం.. కాకులు దూరని కారడవి, చీమలు దూరని చిట్టడవిలా ఉండే దట్టమైన నల్లమల అటవీమార్గం ద్వారా శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్ళేవారు. ధనవంతులైతే గుర్రాలు, పల్లకీల్లో వెళ్ళేవారు. సామాన్యులకు కాలినడకే దిక్కు… అటవీమార్గంలో వెళ్ళే దారిలో వన్యమృగాలు దాడి చేసే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే ఏడాడికొకసారి శ్రీశైలం మల్లన్న దర్శనానికి వెళితే గొప్పగా చెప్పుకునేవారు. నేరుగా రోడ్డు వేసేందుకు అంతా కొండలు, గుట్టలతో నిండిన ఘాట్ అయిపోవడంతో రహదారి నిర్మాణం అంత తేలికైనపని కాదు. అయితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కి మెరుగైన ఘాట్ రోడ్డు నిర్మించడానికి 75 క్రితం బీజం పడింది.
నల్లమల అడవుల మధ్య ప్రసిధ్ద పుణ్యక్షేత్రంగా ఉన్న శ్రీశైలం తెలుగునాట మహిమాన్వితమైన దర్శనీయస్థలం. ఈ పురాతన ఆలయం నదులు, కొండల మధ్య పురాణకాలం నుంచి ఉందని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళేందుకు రోడ్డు బాగా లేకపోవడంతో భక్తులు కష్టపడి చేరుకోవాల్సి వచ్చేది. ఇప్పట్లా హోటళ్ళు, రెస్టారెంట్లు లేవు. అక్కడక్కడ ఉన్న పూటకూళ్ళ ఇళ్లే ప్రధాన వసతిగా ఉండేది. శ్రీ భ్రమరాంబికా దేవి, మల్లికార్జున స్వామి కొలువైన శ్రీశైలం లక్షలాది మంది భక్తుల కొంగుబంగారంగా ఉంది. అలాంటి పుణ్యక్షేత్రానికి మంచి రహదారి నిర్మించాలన్న ఆలోచనతో 75 ఏళ్ళ క్రితం 1950 సంవత్సరంలో అప్పటి మద్రాసు ముఖ్యమంత్రిగా ఉన్న పియస్ కుమారస్వామిరాజా, ఆర్ధిక మంత్రి బెజవాడ గోపాలరెడ్డిలు మంచి ఆలోచన చేశారు. ఇంజనీర్లతో కలిసి శ్రీశైలం వచ్చి ఆలయానికి ఘాట్‌రోడ్డు నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించారు…
ఆ తరువాత శ్రీశైల జగద్గురు వాగీశ పండితారాధ్య శివాచార్య మహా స్వాముల స్నేహితుడిగా ఉన్న నాటి మద్రాసు గవర్నర్ ప్రకాశ్‌కు శ్రీశైల క్షేత్రానికి ఘాట్ నిర్మాణం గురించి వివరించి అనుమతి మంజూరు చేయించుకున్నారు. ఆ తరువాత శ్రీశైలం రోడ్డు పనులు దోర్నాల నుంచి శ్రీశైలం వరకు 1955 నుంచి 1957 వరకు సాగాయి. కొండల మీదుగా అటవీమార్గంలో 49 కిలోమీటర్ల మేర 69 లక్షల 70వేల రూపాయల వ్యయంతో ఈ రోడ్డును పూర్తి చేశారు. అప్పటి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి, మైసూరు రాష్ట్ర ముఖ్యమంత్రి యస్.నిజలింగప్ప 24-11-1957 తేదీన ఈ నూతన ఘాట్‌రోడ్డుకు ప్రారంభోత్సవం చేశారు. ఇక అప్పటినుంచి అంతా ఎంతో సంతోషంగా శ్రీశైలం మల్లన్న దర్శించుకుంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
