Srikalahasti CI Anju Yadav controversy: అంజూ.. అంజూ యాదవ్.. తిరుపతి జిల్లాలో సర్కిల్ ఇన్స్‌పెక్టర్.. ఏ స్టేషన్లో పనిచేసినా ఆమె స్టైల్ వేరు. అందుకే సీఐ అంజూ యాదవ్ తరచూ మీడియాలో తళుక్కుమంటుంది. ఈ మధ్య కాలంలో వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తూ తెరమీదకి వస్తోంది. సత్యవేడు ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలోనూ ఇదే దూకుడు ప్రదర్శించిన అంజు యాదవ్.. అదే పంథా కంటిన్యూ చేస్తూ వచ్చింది. 2009 నుంచి 2011 మధ్యకాలంలో తిరుపతి వెస్ట్ సీఐ గా పనిచేస్తున్న సమయంలోనూ పోలీసు శాఖ సిబ్బందినే ఇబ్బంది పెట్టి శాఖా పరమైన విచారణ ఎదుర్కొంది. ఇక రేణిగుంట అర్బన్ సీఐ కూడా అదే దూకుడును ప్రదర్శించి వార్తల్లో నిలిచింది. దాదాపు ఏడాది క్రితం రేణిగుంట వైసీపీ ఎంపీపీ పట్ల దురుసుగా ప్రవర్తించిన అప్పటి రేణిగుంట అర్బన్ సీఐ యాదవ్.. వైసీపీ నేతలపైనా ఇదే రీతిలో దూకుడు ప్రదర్శించింది.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కూతురు పవిత్ర ఆందోళనకు మద్దతుగా నిలవడంతో ఆమెపై దురుసుగా ప్రవర్తించింది. ఎమ్మెల్యే కూతురు తో సిఐ అంజు యాదవ్ వాగ్వాదానికి దిగడంతో వైసిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. దీంతో అంజు యాదవ్ కు ఎమ్మెల్యే కూతురు పవిత్రకు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటన అప్పట్లో చర్చగా మారిపోగా తిరిగి అంజు యాదవ్ శ్రీకాళహస్తి వన్ టౌన్ సిఐ గానే బదిలీ చేసుకుని పంతం నెగ్గించుకుంది.
ఇక శ్రీకాళహస్తి కి వెళ్ళాక కూడా అంజూ యాదవ్ లో స్పీడ్ మాత్రం తగ్గలేదు. 8 నెలల క్రితం శ్రీకాళహస్తి వన్ టౌన్ పిఎస్ పరిధిలో హోటల్ నిర్వహిస్తున్న మహిళపై దాడి చేసిన అంజూ యాదవ్.. మహిళ అన్న విచక్షణ మరిచి దురుసుగా వ్యవహరించింది. ఇక టిడిపి తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు చక్రాల ఉషాపై కూడా అదే రీతిలో వ్యవహరించిన అంజూ యాదవ్ విమర్శలను మూట గట్టుకుంటూనే ఉంది.
తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న అంజు యాదవ్ దూకుడుగా వ్యవహరిస్తూనే ఉంది. ఈరోజు శ్రీకాళహస్తిలో పెళ్లి మండపం వద్ద సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నం చేసిన జనసేన కేడర్ ను అడ్డుకునే ప్రయత్నంలో అంజు యాదవ్ చేసిన ఓవర్ యాక్షన్ పై జనసేన రియాక్ట్ అయింది. ఏకంగా నాదెండ్ల మనోహర్ తో పాటు జనసేన క్యాడర్ అంతా అంజు యాక్షన్ పై రియాక్ట్ అయింది.
మరోవైపు సిఐ అంజూ యాదవ్ దూకుడు, వ్యవహరించిన తీరుపై పోలీస్ బాస్ లు కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.. వన్ టౌన్ పిఎస్ కు తీసుకొచ్చిన జనసేన కార్యకర్తలపై చేయి చేసుకుని చంప చెల్లుమనిపించిన సీఐ అంజు యాదవ్.. వీడియో తీస్తున్న వారి మొబైల్స్ ను కూడా లాక్కున్నట్లు సమాచారం.. చివరకు ఉన్నతాధికారులు సీఐ నుంచి వివరణ కోరినట్లు తెలుస్తోంది..
మరిన్ని ఏపీ వార్తల కోసం..